(జూన్ 23న ‘విక్రమార్కుడు’కు 15 ఏళ్ళు)
పాతకథకైనా కొత్త నగిషీలు చెక్కి, జనాన్ని ఇట్టే కట్టిపడేయంలో రాజమౌళి మొనగాడు. అందులో ఏలాంటి సందేహమూ లేదు. ఆయన చిత్రాలు ఎలాఉన్నా, ఒకసారైనా చూడవచ్చునని జనమే ఏ నాడో ‘రాజముద్ర’ వేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం ‘విక్రమార్కుడు’. అచ్చు గుద్దినట్టుండే పోలికలతో హీరోలు డ్యుయల్ రోల్ చేయడం తెలుగు చిత్రసీమలో సదా పేయబుల్ ఎలిమెంటే! ఆ సూత్రాన్ని అనుసరించే రాజమౌళి ‘విక్రమార్కుడు’ తెరకెక్కించారు. ఆరంభంలో కొందరు మేధావులు పలు పాత చిత్రాలను గుర్తు చేసుకున్నా, సగటు ప్రేక్షకుడు మాత్రం ‘విక్రమార్కుడు’కు ఆ రోజుల్లో కొత్త ఓపెనింగ్స్ చూపించాడు.
విక్రమ్ రాథోడ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ను కొందరు దుండగులు తుద ముట్టించే ప్రయత్నం చేస్తారు. అతనితో కలసి పనిచేసే పోలీసులకు ఆయనంటే ఎంతో గౌరవం. అచ్చు అతని పోలికలతోనే ఉన్న అత్తిలి సత్తిబాబును పట్టుకుంటారు. అతని వద్దకు విక్రమ్ రాథోడ్ కూతురును చేరుస్తారు. విక్రమ్ రాథోడ్ కథ తెలుసుకున్న సత్తిబాబు, ఆయన చివరి క్షణాల్లో కలుసుకుంటాడు. తరువాత రాథోడ్ స్థానంలోకి సత్తిబాబు చేరి, అందరినీ ఉతికి ఆరేస్తాడు. ఇలాంటి కథలో కొత్తదనం అంతగా కనిపించక పోయినా, దానిని రక్తి కట్టేలా తెరకెక్కించడంలో రాజమౌళి అండ్ టీమ్ సక్సెస్ సాధించింది. అందుకే జనం ‘విక్రమార్కుడు’ కు జై కొట్టారు.
రాజమౌళితో రవితేజకు, అనుష్కకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమా తరువాత రాజమౌళి ‘బాహుబలి’ సీరీస్ లో దేవసేనగా అనుష్క మంచి మార్కులు సంపాదించుకున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో అనుష్క అందాలు జనాన్ని భలేగా ఆకర్షించాయి. ఇక రవితేజ తన మార్కు నటనతోనే ఆకట్టుకున్నా, అందులో రాజమౌళి బ్రాండ్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో రవితేజ అభినయం వైవిధ్యంగా సాగింది. ఇందులో బ్రహ్మానందం, వినీత్ కుమార్, అజయ్, రాజీవ్ కనకాల, రఘుబాబు, జయప్రకాశ్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, మేఘనా నాయుడు, మాధురీ సేన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో కీరవాణి సంగీతం భలేగా అలరించింది. ఇక ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను సమకూర్చగా, రత్నం సంభాషణలు రాశారు. ఇందులోని ‘జింతాతా జితా జితా…’ డైలాగ్ అప్పట్లో విశేషాదరణ చూరగొంది.
అమితాబ్ ‘డాన్’ సినిమాను అటు ఇటు చేసి ‘విక్రమార్కుడు’ రూపొందించారని చాలామంది అన్నారు. అయితేనేమి ఈ సినిమా కథ ఎంతోమందిని అలరించింది. కన్నడలో సుదీప్ హీరోగా ‘వీర మదకరి’గానూ, తమిళంలో కార్తీ హీరోగా ‘సిరుతై’గానూ, హిందీలో అక్షయ్ కుమార్ తో ‘రౌడీ రాథోడ్’గానూ తెరకెక్కి మురిపించింది. ఇక బెంగాల్ లో ‘బిక్రమ్ సింగ: ద లయన్ ఈజ్ బ్యాక్’ పేరుతో తెరకెక్కి, బెంగాలీయులనూ ఆకట్టుకుంది. మరో విశేషమేమంటే, బంగ్లాదేశ్ బెంగాలీలో అయితే, ఈ సినిమా కథ 2007లో ‘ఉల్టా పల్టా 69’గానూ, తరువాత 2015లో ‘యాక్షన్ జాస్మిన్’గానూ రూపొంది అక్కడి వారిని వినోదంలో ముంచింది.