NTV Telugu Site icon

Custody Movie Review: కస్టడీ మూవీ రివ్యూ

Custody

Custody

అక్కినేని నాగచైతన్యకు ‘లవ్ స్టోరీ’ తరువాత ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. అందువల్ల చైతూ అభిమానులందరూ తాజా చిత్రం ‘కస్టడీ’పైనే ఆశలు పెట్టుకున్నారు. తమిళంలో అనేక చిత్రాలు రూపొందించిన దర్శకనిర్మాత, నటుడు వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో వెంకట్ ప్రభుకు ఇదే తొలి చిత్రం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘కస్టడీ’ శుక్రవారం విడుదలయింది.

‘కస్టడీ’ కథ ఏమిటంటే – శివ సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్. ఓ రోజు అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటూ అతనికి దొరుకుతారు. వారిని సెల్ లో వేస్తాడు. అందులో ఒకరు సీబీఐ ఆఫీసర్ ను అంటాడు, మరొకరు పేరు మోసిన క్రిమినల్ రాజు. క్రిమినల్ రాజును వదలవద్దని శివకు సీబీఐ ఆఫీసర్ చెబుతాడు. కావాలంటే పై ఆఫీసర్స్ కు ఫోన్ చేసి కనుక్కోమంటాడు. దాంతో శివ పై అధికారులకు ఫోన్ చేస్తాడు. తరువాత శివ కస్టడీలో ఉన్న ఆ ఇద్దరినీ చంపేందుకు ప్లాన్ జరుగుతుంది. సీబీఐ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోతాడు. మిగిలిన రాజును ఎలాగైనా రక్షించి, కోర్టులో హాజరు పరచాలని శివ ప్రయత్నిస్తాడు. అందుకు అతని గర్ల్ ఫ్రెండ్ రేవతి కూడా సహకరిస్తుంది. సీబీఐ ఆఫీసర్ ను, రాజును చంపాలని ఆదేశించిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఆ స్థాయి వ్యక్తి నుండి రాజును కాపాడాలని శివ ఎంతగానో ప్రయత్నిస్తాడు. చివరకు రాజును కూడా చంపేస్తారు. ఆ తరువాత ఏమయింది అన్నదే మిగతా కథ.

నాగచైతన్య గతంలో ‘తడాఖా’లో పోలీస్ పాత్రలో ఖాకీదుస్తులు ధరించి కనిపించారు. ఇందులోనూ మరోమారు ఖాకీ దుస్తుల్లో చైతూ ఒదిగిపోయారు. తన పాత్రకు తగ్గ అభినయాన్ని ప్రదర్శించారు చైతన్య. మొన్నటి దాకా లవర్ బోయ్ ఇమేజ్ తో సాగిన చైతూ ఆ మధ్య ‘మజిలీ’ వంటి చిత్రాలలో ఎమోషన్ బాగానే పండించారు. ఇందులో మాస్ మిక్స్ చేస్తూ చైతన్య నటన సాగింది. హీరోయిన్ కృతి శెట్టి తన పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించారు. అరవింద్ స్వామి ‘ధ్రువ’ తరువాత మరోమారు తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్ హాస్యం కాసింత రిలీఫ్ ఇస్తుంది. మేస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా బాణీల్లో రెండంటే రెండు పాటలే ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. వెంకట్ ప్రభు కథ, దానిని నడిపించిన తీరు అలరిస్తాయి. కానీ, కొన్ని చోట్ల సాగదీసిన వైనం కనిపిస్తుంది. నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
– నాగచైతన్య, అరవింద్ స్వామి నటన
– నేపథ్య సంగీతం
– ప్రొడక్షన్ వేల్యూస్

మైనస్ పాయింట్స్:
– అంతగా అలరించని పాటలు
– సాగదీసినట్టున్న కొన్ని సీన్స్

రేటింగ్: 2.75/5

ట్యాగ్: క’స్టడీ’గా లేదు!