NTV Telugu Site icon

Writer Movie Review : రైటర్

Writrey

Writrey

 

గత యేడాది డిసెంబర్ లో తమిళనాట విడుదలైన ‘రైటర్’ చిత్రం గత ఫిబ్రవరిలో ఆహా తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు అదే చిత్రం తెలుగు డబ్బింగ్ వర్షన్ ను ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఆహా తెలుగు ఓటీటీలో శుక్రవారం నుండి అందుబాటులోకి తీసుకొచ్చారు. సముతిర కని టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీతో ఫ్రాంక్లిన్ జాకబ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

రంగరాజు (సముతిర కని) హెడ్ కానిస్టేబుల్. పోలీస్ స్టేషన్ గా రైటర్ గా డ్యూటీ చేస్తుంటాడు. అన్ని ఉద్యోగ సంస్థలకు యూనియన్లు ఉన్నట్టుగానే పోలీస్ డిపార్ట్ మెంట్ కూ ఓ యూనియన్ ఉండాలన్నది అతని కోరిక. అయితే… ఆ డిపార్ట్ మెంట్ లో అలాంటి వాటికి అస్సలు ఆస్కారం కల్పించకూడదని, అలాంటి పనులు చేసే వారిని ఊరికి దూరంగా బదిలీ చేయాలని అధికారులు చూస్తుంటారు. ఆ రకంగా పనిష్ మెంట్ ట్రాన్స్ ఫర్ క్రింద సొంత ఊరు నుండి దూరంగా వెళతాడు రంగరాజు. అక్కడ కాలేజీ స్టూడెంట్ దేవకుమార్ (హరికృష్ణ) ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి లాడ్జీలో బందిస్తారు. ఆ విషయం కాస్తా మీడియాకు లీక్ అయ్యే సరికీ రంగరాజుతోనే క్రైమ్ సీన్ రాయించి, అతన్ని పబ్లిక్ గా పట్టుకున్నట్టుగా సాక్ష్యాలు క్రియేట్ చేస్తారు. అమాయకుడైన దేవకుమార్ జీవితం ఆ అక్రమ అరెస్ట్ తో చిన్నాభిన్నమై పోతుంది. అసలు దేవకుమార్ ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అతన్ని వాళ్ళు టార్గెట్ చేసి హింసించడం వెనుక కారణం ఏమిటీ? ఎవరి ప్రోద్భలంతో ఇదంతా జరిగింది? తనకి తెలికుండానే దేవకుమార్ కు ద్రోహం చేసిన రంగరాజు చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? పోలీస్ డిపార్ట్ మెంట్ లోనూ యూనియన్ ఉండాలనే అతని కోరిక తీరిందా లేదా? అనేది మిగతా కథ.

సినిమా అనేది నిర్మాతలకు కాసుల పంట పండించే ఓ వ్యాపారం. ప్రేక్షకులకు అది వినోద సాధనం. అయితే గతంలో సినిమాను కళాత్మక వ్యాపారంగానూ కొందరు భావిస్తే, మరికొందరు మాత్రం ఈ మీడియం ద్వారా తమ భావాలను ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకునే వారు. స్వాతంత్రానికి పూర్వం దేశభక్తి చిత్రాలను రూపొందించినట్టుగానే, ఆ తర్వాత ప్రభుత్వాలు చేసే అవినీతి, అక్రమాలను ఎండగట్టే చిత్రాలు వచ్చాయి. అలానే ఈ వ్యవస్థను ప్రశ్నిస్తూ విప్లవం వర్థిల్లాలంటూ కమ్యూనిస్టు భావజాలాన్ని సైతం సినిమాల ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇదే పంథాలో గత కొన్ని సంవత్సరాలుగా కోలీవుడ్ లో లాల్ – నీల్ ఉద్యమ స్ఫూర్తితో పా. రంజిత్ వంటి వారు కులవివక్షను ప్రశ్నిస్తూ వరుసగా సినిమాలు తీస్తున్నారు. కమ్యూనిస్టులు, సమాజంలోని అట్టడువర్గాల వారు చేతులు కలిపితే, ఈ వ్యవస్థను శాసించవచ్చనే నమ్మకాన్ని ఈ సినిమాల ద్వారా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లోని లోపాలను తెలియచేసే ‘రైటర్’ సినిమాలోనూ అదే అంశాన్ని అంతర్లీనంగా చూపించారు. దీనికి దర్శకుడు పా. రంజిత్ సమర్పకుడు కావడం విశేషం. పోలీస్ డిపార్ట్ మెంట్ లో రంగరాజు లాంటి మంచివాళ్ళు, అట్టడుగు వర్గాలకు సాయం చేయాలనుకునే మానవతా వాదులు కొందరు ఉన్నా, అగ్రకుల అధికారుల కనుసన్నలలో వారు కూడా పావులుగా మారిపోతున్నారని దర్శకుడు ఫ్రాంక్లిన్ జాకబ్ ఇందులో చూపించాడు. ఈ తరహా సినిమాలకు ఏ మేరకు సాధారణ ప్రజల నుండి ఆదరణ లభిస్తుందనే విషయాన్ని పక్కన పెడితే, సామాజిక, రాజకీయ ఎజెండాను భుజానికెత్తుకుని కొంతమంది దర్శక నిర్మాతలు వరుసగా సినిమాలు తీస్తుండటం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రంగరాజు కుటుంబ నేపథ్యం చెప్పడం కోసం ప్రధమార్థంలో ఎక్కువ సమయం కేటాయించడం, అలానే కథను చాలా నింపాదిగా నడపడంతో చూసే ప్రేక్షకుల సహనానికి ఇది పరీక్ష పెడుతుంది.

నటీనటుల విషయానికి వస్తే సముతిర ఖని దర్శకుడిగానే కాదు నటుడిగానూ ఉత్తమ ప్రదర్శన కనబరచగలడని గతంలోనే నిరూపించుకున్నాడు. ఇందులోనూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ వ్యవస్థను మార్చలేకపోతున్నాననే నిస్సహాయత అతని నటనలో కనబడింది. అలానే దేవకుమార్ గా నటించిన హరికృష్ణ, లాయర్ గా నటించిన జి.ఎం. సుందర్, రంగరాజు భార్యల పాత్రలు పోషించిన విజీ ఆంటోని, మహేశ్వరి ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ద్వితీయార్థంలో ఈ కథకు మూలకారణమైన శరణ్య పాత్రలో ఇనేయా చలాకీగా నటించి, మెప్పించింది. ఇతర ప్రధాన పాత్రలను సుబ్రహ్మణ్యం శివ, దిలీపన్, కెవిన్ జై బాబు తదితరులు పోషించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా వేణు బాబు మాటలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల పాత్రలు తమ పరిథి దాటి మాట్లాడటం బాలేదు. ఉదాహరణకు ఓ జేబుదొంగ దొంగ నోటి నుండి ‘జీవచ్చవంలా బతుకుతున్నాను’ వంటి మాటలు రావడం సబబుగా అనిపించదు. ఇందులో ఉన్న రెండు మూడు నేపథ్య గీతాలను రాంబాబు గోసాల రాశారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లోని అధికారుల ఆగడాల కారణంగా ఆత్మహత్య చేసుకునే కానిస్టేబుల్స్ గురించి అందరూ ఒకసారి ఆలోచించాలనే ఓ చక్కని పాయింట్ ను దర్శకుడు ఇందులో డీల్ చేయడం అభినందించదగ్గది. కానీ దానికి కూడా కులాన్ని ముడిపెట్టడం, ఉత్తరాది వారిని పనికట్టుకుని ప్రతినాయకులుగా చూపించడం సంకుచితమైన ఆలోచనే. సమాజంలోని అసమానతలను తొలగించుకుని అందరం కలిసి ముందుకు సాగాలనే భావనతో సినిమాలను తీస్తే మరింత మేలు జరుగుతుందనే ఆలోచన ఈ దర్శక నిర్మాతలకు ఎప్పుడు కలుగుతుందో!

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
సముతిర కని నటన
ఎంచుకున్న అంశం
గోవింద వసంత్ నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్స్
నత్తనడకలా సాగే కథనం
పనికట్టుకుని కులవివక్షను చూపడం
సింగిల్ ఎజెండాతో తీయడం

ట్యాగ్ లైన్: రొటీన్ రైటర్!