NTV Telugu Site icon

Witness movie review: విట్ నెస్ రివ్యూ

Witness

Witness

సోనీ లివ్ లో…

రన్ టైమ్: రెండు గంటలు

విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022

నటీనటులు: రోహిణి, శ్రద్ధా శ్రీనాథ్, సుభద్రా రాబర్ట్, షణ్ముగ రాజా, అళగం పెరుమాళ్

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

సంగీత దర్శకుడు: రమేష్ తమిళమణి

సినిమాటోగ్రఫీ: దీపక్

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

దర్శకుడు: దీపక్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘విట్ నెస్’ తమిళ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయింది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ ఫామ్ సోనీలివ్ లో అందుబాటులో ఉంది. పారిశుద్ధ్య కార్మికుల కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ విషయానికి వస్తే ఈ సినిమా పారిశుద్ధ్య కార్మికుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారు ప్రతి దినం ప్రాణాలను లెక్క చేయకుండా మురుగును శుభ్రం చేస్తుంటారు. ఇంద్రాణి(రోహిణి) పారిశుద్ధ్య కార్మికురాలు. కాలేజ్ లో చదుకునే ఆమె కొడుకు ఓ అపార్ట్‌మెంట్ సొసైటీలో మురుగు కాలువను శుభ్రం చేస్తూ చనిపోతాడు. తన కొడుకును ఇల్లీగల్ గా పని చేయించిన కాంట్రాక్టర్స్ తో పాటు అపార్ట్ మెంట్ వాసులపై చట్టపరంగా చర్య తీసుకోవాలని నిర్ణయించుకుని కామ్రేడ్స్, లాయర్ సహాయంతో కోర్టు తలుపు తడుతుంది. అందులో భాగంగా అమెకు ఎదురైన సవాళ్ళు ఏమిటి? ఆమె గెలుస్తుందా? లేదా? అన్నదే సినిమా కథాంశం.

సొసైటీలో ఇప్పటికీ ఎందరో పారిశుద్ధ్య కార్మికులు సరైన పరికరాలు లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి దోపిడికి గురై చనిపోతున్నారు. వారి జీవితాలకు ఎలాంటి భరోసా లేదు. ఇదే విషయాన్ని దర్శకుడు దీపక్ తెరకెక్కించారు. ఈ తరహా కథాంశాన్ని సినిమాగా తీయటానికి పూనుకున్న నిర్మాతలను అభినందించాలి. ఇక ప్రధాన పాత్రలో రోహిణి వంటి ప్రతిభావంతురాలైన నటిని ఎంపిక చేసుకోవడం కలసి వచ్చింది. నిజానికి ఇలాంటి పాత్రలు ఆమెకు కొట్టినిండి. మరో కీలక పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా పరిణతితో కూడిన నటనను ప్రదర్శించింది. ఇతర పాత్రలలో తమిళ నటీనటులు కనిపించారు. వారు తమ పాత్రలను తగిన న్యాయం చేశారు.

నిజానికి సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే రోహిణి కొడుకు చనిపోయాడని తెలుస్తుంది. ఆ తర్వాత కూడా నేరుగా కథాంశంలోకి వెళ్ళకుండా దర్శకుడు సాగతీత ధోరణిని ప్రదర్శించాడు. నిజం చెప్పాలంటే సినిమా కాకుండా ఓ డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. కోర్ట్‌ డ్రామా నుంచే కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ తరహా సినిమాలకు సాంకేతిక అంశాలతో అంతగా పని ఉండదు. ఎందుకంటే ఆద్యంతం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ప్రభుత్వ అధికారులకు ఎదురుతిరిగిన పారిశుద్ధ్య కార్మికులకు ఏం జరుగుతుందనేది ఈ సినిమా ద్వారా కళ్ళకు కట్టినట్లు తీసినా ఎక్కడో మెలోడ్రామా మిస్ అయింది అనిపిస్తుంది. కథతో పాటు మనం ట్రావెల్ అవలేకపోతాం. అదే ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ పాయింట్. సినిమా నేపథ్యం కానీ, నటీనటుల నటనను కానీ తక్కువ చేయలేం. అలాగని సమస్యను సమర్ధవంతంగా తెరకెక్కించగలిగారనీ చెప్పలేం. పీపుల్స్ మీడియా లాంటి సంస్థను చేతిలో పెట్టుకుని కూడా ఇలా సినిమా మొత్తం చీప్ గా చుట్టేసినట్లు అనిపిస్తుందంటే అది దర్శకుడి తప్పిదమే అవుతుంది. ఏది ఏమైనా ఓ మంచి ప్రయత్నం అని మాత్రం చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్
ఎంపిక చేసుకున్న కథాంశం
నటీనటులు ప్రతిభ

మైనస్ పాయింట్స్
డాక్యుమెంటరీలా సాగటం
స్లో నెరేషన్

రేటింగ్: 2.5/5

ట్యాగ్ లైన్: సందేశాత్మకం