Peka Medalu Review: ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ తో ఒక్కసారిగా ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడేలా చేసిన సినిమా పేక మేడలు. తమిళంలో నా పేరు శివ అనే సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకులకు పరిచయమై ఈ మధ్య మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించిన వినోద్ కిషన్ హీరోగా కన్నడ అమ్మాయి అనూష కృష్ణ హీరోయిన్ గా బాహుబలి నటుడు రాకేష్ వర్రే నిర్మాతగా ఈ పేక మేడలు అనే సినిమా తెరకెక్కింది. వినూతమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ట్రైలర్ కట్ చూసిన తర్వాత ఏదో విషయం ఉందని ప్రేక్షకులు అందరూ భావించారు. నిజంగానే మరి ఈ సినిమా అంత బాగుందా? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
పేక మేడలు కథ: తనకు 60 వేల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందని లక్ష్మణ్(వినోద్ కిషన్), వరలక్ష్మి (అనూష కృష్ణ) ఇంట్లో వాళ్ళను నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. మోసపోయాను అని తెలిసినా భర్త మీద ప్రేమతో వరలక్ష్మి అలియాస్ వరాలు స్లమ్లో జీవితం వద్దని ఎప్పటికైనా ఒక మంచి మిడిల్ క్లాస్ జనాలు ఉండే కాలనీలో అద్దె ఇంట్లో బతకాలని కష్టపడుతూ ఉంటుంది. కానీ లక్ష్మణ్ మాత్రం 100 రూపాయలు దొరికినా వెళ్లి తాగేయాలి అనే మనస్తత్వంతో రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అలాంటి అతనికి సోషల్ గా మూవ్ అవ్వనివ్వడం లేదు అని భావించి భర్తను పిల్లలను వదిలేసి వచ్చి హైదారాబాద్ లో సెటిల్ అవ్వాలని ఒక రిచ్ ఎన్ఆర్ఐ లేడీ(రితికా శ్రీనివాస్) పరిచయం అవుతుంది. తనకున్న పనికిరాని బీటెక్ చదివిన తెలివితేటలతో ఆమెను ట్రాప్ చేస్తాడు లక్ష్మణ్. భార్య ఎంతో కష్టపడి మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తుంటే తనకు ఏమీ పట్టనట్టు తిరుగుతూ ఉంటాడు. ఈ సమయంలో భార్యకు తన భర్త చేసే గలీజ్ వ్యవహారం గురించి తెలుస్తుంది. దీంతో వరాలు ఏం చేసింది? ఎన్ఆర్ఐ లేడీతో సంబంధం పెట్టుకున్న లక్ష్మణ్ ఏమయ్యాడు? చివరికి లక్ష్మణ్ -వరాలు కలిశారా? అసలు ఏం జరిగింది? అనే విషయం తెలియాలి అంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: ఎలాగైనా కష్టపడి జీవితంలో మరో స్థాయికి వెళ్లాలనుకునే భార్య, ఒంటి మీద వర్షం కురుస్తున్నా ఏమాత్రం చలనం లేకుండా రమ్మీ ఆడుకుంటూ సిగరెట్లు తాగుకుంటూ తిరిగే భర్త. వీళ్ళిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సింగిల్ లైన్ లో ఈ సినిమా కథ. గతంలో మనం ఎన్నో తెలుగు సినిమాల్లో ఇలాంటి కాంబినేషన్ జంటలను చూశాం కానీ ఈరోజు ట్రెండుకు తగ్గట్టు ఈ పేక మేడలు సినిమా కోసం కథ రాసుకున్నాడు దర్శకుడు. కథగా చూస్తే ఈ మధ్యకాలంలో మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా జయ జయహే పోలికలు కనిపిస్తాయి. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు రాసుకున్న దర్శకుడు చాలా నేచురల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సఫలం అయ్యాడు. నిజానికి ఈ సినిమా పెళ్లి చేసుకున్న జంటలకి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఎలాంటి పని చేయకుండా భార్య సంపాదన మీద లేదా తల్లిదండ్రులు సంపాదన మీద ఆధారపడి తింటూ ఉండేవాళ్ళకు ఒక చెంపపెట్టులా అనిపిస్తుంది. ఏదో నా టైం బాలేక ఇక్కడ ఉండిపోయాను, లేకపోతే అంబానీ పక్క ఇంట్లో ఉండేవాడిని అనుకునే మనస్తత్వం ఉన్నవాళ్లను మన జీవితకాలంలో అంతెందుకు గడిచిన 10- 15 రోజుల్లోనే ఒక్కరినైనా చూసి ఉంటాం. అలాంటి వ్యక్తి కథనే చాలా న్యాచురల్ గా హైదరాబాద్ బస్తీలలో చిత్రీకరించారు. చదువు ఉన్నా నాకు సరైన ఉద్యోగం లేదు అనుకుంటూ గాలికి తిరిగే వ్యక్తి భార్యగా కష్టపడితే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని నిరూపించే సినిమా ఇది. సావాసం మంచిదైనా, చెడ్డదైనా దానిని స్వీకరించే వ్యక్తుల మనస్తత్వాలను బట్టే ఉంటుందని చాలా సున్నితమైన విధంగా చెప్పడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు. కథలో కొత్తదనం లేదు కానీ స్క్రీన్ ప్లేతో నేటి తరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు. నిడివి రెండు గంటలైనా కొన్నిచోట్ల సీన్స్ లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే రెగ్యులర్ తెలుగు సినిమా క్లైమాక్స్ కాకుండా ఆసక్తికరంగా ముగించాడు. అద్భుతం అనలేం కానీ చూసి మాత్రం ఆలోచించకుండా ఉండలేం.
నటీనటుల విషయానికి వస్తే లక్ష్మణ్ అనే పాత్రలో రెచ్చిపోయి నటించాడు. కన్మింగ్ వ్యక్తిగా లక్ష్మణ్ పాత్రలో వేరే నటుడిని ఊహించలేము అనేలా నటించాడు. వరాలు అనే పాత్రలో అనూష ఒదిగిపోయింది. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే రాకేష్ వర్రె నిర్మాణ విలువలు బాగున్నాయి. స్మరణ సాయి సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ పాయింట్. హరిచరణ్ కె సినిమాటోగ్రఫీ పర్వాలేదు.
ఫైనల్లీ పేక మేడలు సందేశంతో కూడిన బతుకు చిత్రం.. ఏదో బస్తీలో సీసీ కెమెరా పెట్టీ చూసినట్టే అనిపిస్తుంది.