Cobra Review: ఇప్పుడే కాదు ఎన్నో ఏళ్ళుగా విక్రమ్ కెరీర్ ను గమనిస్తున్నవారికి అతను ఓ వైపు స్టార్ గానూ, మరోవైపు నటునిగానూ అలరించే ప్రయత్నమే కనిపిస్తూ ఉంది. నటునిగా విలక్షణమైన పాత్రలవైపు ఆకర్షణ, స్టార్ గా మాస్ ను ఆకట్టుకొనే ప్రయత్నమూ రెండూ ఆయనలో కనిపిస్తాయి. ఆ ప్రయత్నంలోనే ‘అపరిచితుడు’ తరువాత నుంచీ విక్రమ్ పయనం సాగుతోంది. వైవిధ్యమైన గెటప్స్ తో ఆకట్టుకొనేందుకే విక్రమ్ తపిస్తున్న వైనమూ ఇట్టే తెలిసిపోతుంది. విక్రమ్ తాజా చిత్రం ‘కోబ్రా’లోనూ అదే ప్రయతమే మన ముందు నిలచింది.
ఇంతకూ ‘కోబ్రా’ కథ ఏమిటంటే – మది అళగన్ మేథమేటికల్ జీనియస్. లెక్కలతోనే ఎదుటివారిని చిత్తు చేయగల ప్రతిభ ఆయన సొంతం. ఆ ప్లాన్స్ తోనే ఒరిస్సా సీయమ్ ను, స్కాట్లాండ్ ప్రిన్స్ ను చంపేసి ఉంటాడు. అతడిని పట్టుకోవడానికి ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ రంగంలోకి దిగుతాడు. మది వేసే ఎత్తులు చూసి అందరూ షాక్ గురవుతారు. పలు రకాల గెటప్స్ లో ‘మది’ అలాగ వచ్చి ఇలాగ మాయమవుతూ చిత్రవిచిత్రాలు చేస్తూ ఉంటాడు. అందరూ మదినే అనుమానిస్తారు. కానీ, ఆ హత్యల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ‘కోబ్రా’ అని తెలుస్తుంది. మది, కోబ్రా ఒకేలా ఉండే కవలలు. చిన్నతనంలోనే విడిపోయి ఉంటారు. ఇద్దరూ మేధావులే. కానీ, మది గణితంలో రాణిస్తే, కోబ్రా తన యుక్తితో ఎదుటివారిని చిత్తు చేస్తూ ఉంటాడు. ‘కోబ్రా’గా సాగుతున్న అన్నను పట్టించడానికే తమ్ముడు మది పూనుకుంటాడు. చివరకు కోబ్రా మరణంతో కథ ముగుస్తుంది.
దాదాపు మూడేళ్ళ తరువాత వచ్చిన విక్రమ్ సినిమా కావడంతో ‘కోబ్రా’ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. తన విలక్షణమైన అభినయంతో ఆకట్టుకోవడంలో విక్రమ్ కృషిని ఎవరూ తక్కువ చేయలేరు. శ్రీనిధి, మృణాళిని తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా డిగ్నిఫైడ్ గా నటించాడు. కథలో ‘ధూమ్-3’ పోలికలూ కనిపిస్తాయి. ఎ.ఆర్.రహమాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమా నిడివి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుందనే చెప్పాలి. దర్శకుడు కథను నడిపించడంలో సఫలీకృతుడు కాలేకపో యాడనే భావించాలి.
ప్లస్ పాయింట్స్:
– విక్రమ్ విలక్షణమైన అభినయం
– ఇర్ఫాన్ పఠాన్ పాత్ర
– ఎ.ఆర్.రహమాన్ సంగీతం
మైనస్ పాయింట్స్:
– కొత్తదనం కనిపించని కథ
– సాగదీసినట్టుగా ఉన్న ద్వితీయార్ధం
– అంతగా ఆకట్టుకోని సన్నివేశాలు
– తికమక పెట్టే కథనం
రేటింగ్ : 2.25/5
ట్యాగ్: ‘కోబ్రా’… గుండె గాబరా!