NTV Telugu Site icon

Vidya Vasula Aham Review: విద్యా వాసుల అహం రివ్యూ..ఎలా ఉందంటే?

Vidya Vasula Aham Review

Vidya Vasula Aham Review

Vidya Vasula Aham Review: ఈ మధ్య కాలంలో ఓటీటీలు కూడా నేరుగా సినిమాలు తమ ఒరిజినల్ కంటెంట్ గా రిలీజ్ చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి సంస్థలు మాత్రమే అలాంటి ప్రయోగాలు చేసేవి. కానీ ఆహా కూడా ఈ మధ్య కొన్ని సినిమాలను నేరుగా రిలీజ్ చేస్తోంది. అందులో భాగంగా విద్యా వాసుల అహం అనే సినిమా ఈరోజే ఆహా ఆడియన్స్ ముందుకు వచ్చింది. రాహుల్ విజ‌య్‌, శివాని రాజ‌శేఖ‌ర్‌లు జంట‌గా నటించిన ఈ సినిమా పెళ్లి, పెళ్లి తర్వాత జీవితం నేపథ్యంలో వచ్చింది. తెల్లారితే గురువారం సినిమాను డైరెక్ట్ చేసిన మణికాంత్ గెల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి.

కథ: వాసు (రాహుల్‌ విజయ్‌) మెకానికల్‌ ఇంజనీర్‌గా తక్కువ శాలరీకి ఇష్టం లేని జాబ్‌ చేస్తుంటాడు. పెళ్లీడుకొచ్చినా నచ్చినమ్మాయి లేదని, ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే స్వేచ్ఛగా ఉండలేమని పెళ్లికి దూరంగా ఉంటాడు. మరోవైపు విద్య(శివానీ రాజశేఖర్‌) కూడా తనకు నచ్చిన వాడు దొరకడం కష్టమని పెళ్లి ప్రస్తావన దాటవేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరూ ఒకరికొకరు సంబంధం లేకుండా ఓ రోజు గుడికి వెళ్లి అక్కడ విన్న ప్రవచనాలతో పెళ్లి మీద ఆలోచన మారుతుంది. మ్యారేజ్‌ ప్రస్తావన రావడంతో కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వీరికి పెళ్లి అవుతుంది. ఫస్ట్ నైట్‌ రోజే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలవుతాయి. రాను రాను గొడవలు కూడా మొదలవుతాయి. అయితే అసలు ఆ మనస్పర్థలు, గొడవలకు కారణమేంటి? ఇద్దరి మధ్య వచ్చే గొడవేంటి? ఆ గొడవల వలన చివరికి ఏమైంది? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:
తెలుగులో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సబ్జెక్ట్ లు కొన్ని ఉన్నాయి. అందులో పెళ్లి కాన్సెప్ట్ కూడా ఒకటి. అటు పెళ్లి అయిన వారు, ఇటు పెళ్ళికి రెడీ అయిన వారితో సహా ఇంట్లో పెళ్ళైన వారు ఉన్న వారంతా రిలేట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ఇలాంటి కథలనే ఈమధ్య ఎక్కువ ఎంచుకుంటున్నారు క్రియేటర్లు. ఇక ఆ లైన్ ను కాస్త ఎంటర్‌టైనింగ్‌గా రాసుకుని అంతే ఎంటర్‌టైనింగ్‌గా తీయాలి కానీ ఎన్నిసార్లైనా మనవాళ్ళు హిట్టు చేసి పెట్టేస్తారు. ఇక ఈ విద్యా వాసుల అహం సినిమాలో దర్శకుడు మణికాంత్ చేసింది కూడా దాదాపు అదే. పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ అనలేం కానీ ఇదేంట్రా మరీ ఇలా ఉంది అనుకునేలా చేయకుండా సింపుల్గా క్యూట్‌గా నడిపించేశాడు. ఒకపక్క గిల్లి కజ్జాలు, మరోపక్క రొమాన్స్ రెండిటినీ మేనేజ్ చేస్తూ చేసిన సినిమా ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా కొత్త పెళ్లిలో ఉండే మురిపాలను చూపించి సెకండాఫ్ మాత్రం పెళ్లయ్యాక వచ్చే రియాలిటీని చూపించాడు. వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటరా అంటూ చాలా సినిమాలు వచ్చాయి.. చివర్లో మళ్లీ పెళ్లే ముద్దని ముగిస్తారు. లైన్ ప్రకారం ఈ విద్యా వాసుల అహం కూడా అంతే. ఇద్దరి ఇగోల కారణంగా జరిగే గొడవలే ఈ సినిమా. చిన్న చిన్న మనస్పర్ధలు కామన్ పెళ్లి అనే బంధం వాటిని తట్టుకుని బలంగా ఉండాలనేది దర్శకుడు చెప్పిన మెయిన్ పాయింట్.

నటీనటుల విషయానికి వస్తే పెళ్లి మీద కన్ఫ్యూజన్ లో ఉంటూ పెళ్లి చేసుకున్న జంటగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. ఆన్ స్క్రీన్ రొమాన్స్, కెమిస్ట్రీ అదిరింది. ఇక అవసరాల శ్రీనివాస్, అభినయ, కాశీ విశ్వనాధ్, రాజశ్రీ నాయర్, సహా మిగిలిన వాళ్ళంతా తమ పాత్రల పరిధి మేర నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ ప్లెజెంట్ అనిపించేలా ఉంది. దర్శకుడు మణికాంత్ మంచి కథ రాసుకుని తెరకెక్కించినా ఎందుకో ఏదో వెలితి. బహుశా ఓటీటీ కట్ వల్ల కొంత నిడివి తగ్గడం వల్లనేమో.

ఓవరాల్‌గా విద్యా వాసుల అహం.. పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్

Show comments