NTV Telugu Site icon

రివ్యూ: అశ్విన్స్

Asvins

Asvins

నిర్మాత భోగవల్లి ప్రసాద్ పేరు వినగానే ఆయన రూపొందించిన భారీ, చిన్న సినిమాలు గుర్తు రాక మానవు. ఆయన బ్యానర్ లో వచ్చే సినిమాలకు మినిమమ్ గ్యారంటీ ఉంటుందని భావించే వారు లేకపోలేదు. ఎస్.వి.సి.సి. పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ రూపొందించిన ‘విరూపాక్ష’ ఇటీవల విడుదలై సాయిధరమ్ తేజ్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సంస్థ ద్వారా వచ్చిన తాజా సినిమా ‘అశ్విన్స్’. ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం.

రాహుల్, రీతు, వరుణ్‌, అర్జున్, గ్రేసీ స్నేహితులు. పురాతన భవనాలతో పాటు హాంటెడ్ హౌసెస్ ను వీడియోలుగా తీసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటారు. లండన్ కి చెందిన ఓ కంపెనీ అక్కడి పురాతన భవంతిని రికార్డ్ చేసే కాంట్రాక్ట్ వీరికి అప్ప చెబుతుంది. ఆ భవంతిలో అంతకు ముందే ఆర్తి అనే ఆర్కియాలజిస్ట్ తనతో ఉండే పదిహేను మందిని చంపి, ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె శవం పోలీసులకు దొరకదు. అది తెలియకుండా భవంతిలో అడుగుపెట్టిన ఆ ఐదుగురు స్నేహితులకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఈ భవంతిలో జరిగిన సంఘటనలకు అశ్వినీ దేవతలు ఓ రైతుకు ఇచ్చిన వరానికి సంబంధం ఉందా? అన్నదే ఈ సినిమా.

ఫస్ట్ చాప్టర్ లోనే ఇది మామూలు సినిమా కాదు అని తేలుతుంది. అయితే ఒక్కో చాప్టర్ గడిచే కొద్ది కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అర్థం కాకుండా పోతుంది. చూసిన సన్నివేశాలనే మళ్ళీ మళ్ళీ చూడాల్సి రావటం ప్రేక్షకులకు నరకంగా తోస్తుంది. ఓ విధంగా వారి సహనానికి అది పరీక్షే. ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ లో హారర్ ఎలిమెంట్ కంటే డైరెక్టర్ పైశాచికత్వమే ఎక్కువ కనిపిస్తుంది. విమలా రామన్ తప్ప వేరే ఆర్టిస్ట్ లు ఎవరూ తెలిసిన వారు కాకపోవడం కూడా ఇబ్బంది కలిగించే అంశం. ఆర్టిస్ట్ ల ముఖాలమీద కెమెరా పెట్టి ఇష్టం వచ్చినట్లు నటించమని చెప్పినట్లనిపిస్తుంది. ఈ మూవీలో ఆకట్టుకునే అంశం ఏదైనా ఉందంటే అది సౌండ్ డిజైనింగ్ మాత్రమే. ఈ సౌండింగ్ కొత్తగా కూడా ఉంది. కొంత వరకూ కెమెరా వర్క్ కూడాబాగుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్, వారి తనయుడు బాపినీడు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో పాటు ‘విరూపాక్ష’ తర్వాత వారి సంస్థ లో వస్తున్న సినిమా కావటంతో బాగుంటుందేమో అని ఎక్స్ పెక్ట్ చేసి థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ పూర్తిగా నిరాశకు గురవుతారు. ఈ సినిమా చూడటానికి కేటాయించే కొద్ది సమయమైనా దండగే.

ప్లస్ పాయింట్స్
‘విరూపాక్ష’ నిర్మాతల చిత్రం కావటం
సౌండ్ డిజైనింగ్

మైనెస్ పాయింట్స్
తలాతోక లేని కథ
చూపించిందే చూపించి విసిగించే వైనం
క్లోజప్ షాట్స్ తో టార్చర్

రేటింగ్: 1.5/5

ట్యాగ్ లైన్: హారర్ టార్చర్!

Show comments