NTV Telugu Site icon

Operation Valentine Review: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ..హిట్ కొట్టాడా?

Operation Valentine Poster

Operation Valentine Poster

Operation Valentine Review In Telugu: వరుణ్ తేజ్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ మీద సందీప్ కుమార్ ముద్ద ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించింది. 2019లో జరిగిన పుల్వామా ఎటాక్, ఆ తర్వాత జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకొని తెరకెక్కించిన ఈ సినిమాకి ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంది? అనేది రివ్యూలో చూద్దాం

ఆపరేషన్ వాలెంటైన్ కథ ఏమిటంటే?
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన అత్యుత్తమ టెస్ట్ పైలెట్స్ లో ఒకరు అర్జున్ దేవ్ అలియాస్ రుద్ర (వరుణ్ తేజ్). హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కలిసి చేసిన ఆపరేషన్ వజ్ర టెస్ట్ ఫెయిల్ కావడంతో తన కో టెస్ట్ పైలెట్ కబీర్ (నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అతన్ని ఫ్లయింగ్ కి దూరంగా పెడుతుంది. పుల్వామా ఎటాక్ జరగడానికి ముందు అతనితో మరో టెస్ట్ చేయించాలని భావించి రాడార్ ఆఫీసర్ అహానా గిల్ (మానుషి చిల్లర్) ను గ్వాలియర్ ఎయిర్ బేస్ కు పంపుతుంది. సరిగ్గా టెస్ట్ చేస్తున్న సమయంలో శ్రీనగర్ పుల్వామా దగ్గర సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద ఉగ్రదాడి జరుగుతుంది. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని బెస్ట్ టీంని రక్షణ అధికారులు సిద్ధం చేస్తారు. ఎవరికీ తెలియకుండా చివరి నిమిషంలో పాక్ లోని బాలాకోట్ వద్ద ఉన్న ఉగ్ర శిబిరాల మీద దాడి చేసి భారతీయ సైనికుల వీర మరణానికి ప్రతీకారం తీర్చుకుంటారు. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ ఇండియా మీద ఎలాంటి చర్యలకు దిగింది? అసలు పుల్వామా ఎటాక్ వెనుక ఉన్న పాకిస్తాన్ ప్లాన్ ఏమిటి? చివరికి వరుణ్ తేజ్ తన ఎయిర్ ఫోర్స్ టీంతో మొత్తాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆపరేషన్ వాలెంటైన్ అంటే ఏమిటి? తన భర్త అయిన అర్జున్ దేవుని అహనా గిల్ ఎందుకు ఎప్పుడూ వెనక్కి లాగుతూ ఉంటుంది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ:
2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామా ఎటాక్ ఒక్కసారిగా అప్పట్లో దేశాన్ని షాక్ కి గురి చేసింది. ఏకకాలంలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడటం కేవలం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత సరిగ్గా 12 రోజులకు భారత రక్షణ దళం ఎయిర్ ఫోర్స్ ఈ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంటూ బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి దాదాపు 300 మంది సుశిక్షితులైన ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సరిగ్గా కొన్నాళ్ల క్రితం హృతిక్ రోషన్ హీరోగా ఫైటర్ అనే సినిమా ఇదే లైన్ మీద వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ కూడా దాదాపు అదే లైన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. ఫైటర్ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కితే ఈ ఆపరేషన్ వాలెంటైన్ మాత్రం కేవలం 42 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్. అంటే సుమారు రెండు సినిమాలకు 10:1 నిష్పత్తిలో బడ్జెట్ తేడా ఉంది.ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మొదలు పెట్టినప్పుడు అసలు పుల్వామా ఎటాక్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకునే విధంగా మరొక లేయర్ కథతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆపరేషన్ వజ్ర టెస్టింగ్, అది ఫెయిల్ అవ్వడంతో కబీర్ మరణం వంటి విషయాలను ఎమోషనల్ గా డ్రైవ్ చేసే ప్రయత్నం చేశాడు. కబీర్ మరణంతో తన భర్తకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని ఒకపక్క భయపడుతూనే, మరొకపక్క దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యే ఒక రాడార్ ఆఫీసర్ గా మానుషి నటన ఆసక్తికరంగా ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయాడు కానీ అవసరమైన చోట టెన్షన్ పెట్టిస్తూ అసలు కథలోకి తీసుకువెళ్లాడు దర్శకుడు. ఒకానొక సందర్భంలో అయితే ఊపిరి బిగబట్టి ఏం జరగబోతుందా అని ప్రేక్షకుడు ఆసక్తికరంగా ఎదురుచూసేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సమయం వృధా చేయకుండా చెప్పాలనుకున్న పాయింట్ ని సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు. అయితే మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అసలైన ఆపరేషన్ వాలెంటైన్ రెండో భాగంలోనే మొదలు అవుతుంది కాబట్టి. కొత్త దర్శకుడు కాబట్టి ఎలా డీల్ చేస్తాడు అనే విషయం మీద ముందు నుంచి చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్ వజ్ర నుంచి నెహ్రూ వరకు అనేక లింకులు, లేయర్లు అల్లుకొని ప్రేక్షకుడిని పూర్తిస్థాయిలో సినిమాలో నిమగ్నం అయ్యేలా చేయడంలో దర్శకుడు దాదాపు సఫలమైనట్లే చెప్పాలి. నిజానికి పుల్వామా అటాక్స్, తర్వాత జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చరిత్రలో లిఖించబడిన విషయాలు. అయితే వాటికి కనెక్ట్ చేస్తూ సినిమాటిక్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేలా ఉంది. అయితే దేశభక్తిని ఎమోషనల్ గా చూపించే విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎమోషనల్ కనెక్ట్ ఉంటే అది ఆడియన్స్ ని మరింత ఎమోషనల్ గా దగ్గర చేస్తుంది. అయితే సినిమాలో కొంత ఆ ఎమోషన్ క్యారీ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. ఎంతసేపు మిషన్, ఆపరేషన్ మీద ఎయిర్ ఫోర్స్ ఉన్నట్లు చూపించాడు కానీ అప్పటి దేశ ప్రజల మూడ్ ని కూడా క్యారీ చేసుంటే బాగుండేది. అయితే ఇది పూర్తిస్థాయిలో ఎయిర్ఫోర్స్ ని బేస్ చేసుకుని చేసిన సినిమా కాబట్టి వాటిని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. అయితే సినిమాలో కొంచెం భాగం మిస్సయినా సినిమాను అర్థం చేసుకోవడం కష్టమే. అయితే ఒక భార్యగా భర్త తిరిగి రావాలని ఎంతగా కోరుకుంటూ ఉంటుందో దేశం విషయానికి వస్తే భర్త కంటే ముందు దేశ భద్రత చాలా ముఖ్యమని చెప్పే ఒక సీన్లో ఎమోషన్స్ మాత్రం హై అనిపిస్తాయి. ఫైటర్ సినిమాతో కంపేర్ చేసినా చేయకపోయినా దానికి పూర్తి భిన్నం ఈ సినిమా. అయితే ఫైటర్ సినిమా చూసిన వారి కంటే చూడని వారికి ఇంకా ఎక్కువ నచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఇలాంటి ప్రయత్నం చేయడం, అది కూడా చాలా మినిమం బడ్జెట్ తో చేయడం అనేది కచ్చితంగా అభినందించాల్సిన విషయం.

నటీనటుల విషయానికి వస్తే టెస్ట్ పైలెట్ రుద్ర అలియాస్ అర్జున్ దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ పరకాయ ప్రవేశం చేశాడు. కెరియర్ బిగినింగ్ నుంచి భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ కొన్ని సీన్స్ లో అయితే కేవలం కళ్ళతోనే నటించాడు. ఆరడుగుల బాడీతో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన భార్యగా మానుషీ చిల్లర్ కొన్నిచోట్ల డామినేట్ చేసేలా నటించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రాడార్ ఆఫీసర్గా దర్పం చూపిస్తూనే మరొకపక్క భర్త మీద ప్రేమతో అతన్ని అన్ని విషయాల్లో వెనక్కి లాగే సాధారణ భారత స్త్రీగా ఆమె భిన్నమైన పాత్రలో కనిపించింది. నవదీప్ అతిథి పాత్ర మాత్రమే చేశాడు. అలీ రెజా, అభినవ్ గోమటం, శతాఫ్, సంపత్ రాజ్, రుహానీ శర్మ వంటివాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక చాలామంది బిగ్ బాస్ భామలు ఒకటి రెండు సీన్లకు పరిమితం అయ్యారు. టెక్నికల్ విషయాలకు వస్తే బీజీఏం ఈ సినిమాకి ప్రాణం పోసింది.. మిక్కీ జే మేయర్ గతంలో ఎన్నో సినిమాలకి మంచి మెలోడీస్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి ఆయనకు ఇలాంటి ఒక వార్ సినిమా ఇస్తున్నారంటే ఎలా డీల్ చేస్తాడని అనుమానాలు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా వందేమాతరం అనే సాంగ్ విజువల్ గా కనిపిస్తున్నప్పుడు గూస్ బంప్స్ గ్యారంటీ. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కోసం దాదాపు 5 కోట్లు ఖర్చుపెట్టినట్లు నిర్మాతలు వెల్లడించారు. అయితే ఐదు కోట్లు అనే మాట పక్కన పెట్టి చూస్తే విఎఫ్ఎక్స్ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది కానీ ఐదు కోట్ల రూపాయలలో ఇంత అవుట్పుట్ తో ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. ఫస్టాఫ్ అలాగే సెకండాఫ్ లో కొన్నిచోట్ల నిజమైన ఫ్లైట్ లో కూర్చుని బయటికి చూస్తున్నామేమో అనేంతలా ఆ ఫైటర్ జెట్ల డీటైలింగ్ విఎఫ్ఎక్స్ లో కనిపించింది. ఇక సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని పంచేలా టెక్నికల్ టీమ్స్ అన్నీ కలిసి పని చేసినట్లు అనిపించింది. 42 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ స్థాయి సినిమా చేయడం కత్తి మీద సాము లాంటిది. ఆ విషయంలో నిర్మాతలు చాలా గట్టిగానే కష్టపడినట్టు అనిపించింది. సినిమా చాలా విజువల్ రిచ్ గా అనిపించింది.

ఫైనల్ గా:  ఆపరేషన్ వాలెంటైన్ ఎంగేజింగ్ ఎయిర్ ఫోర్స్ డ్రామా .. దేశభక్తి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది.

Show comments