NTV Telugu Site icon

Urvasivo Rakshasivo Movie Review: ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ

urvasivo rakshasivo

2291a257 C0be 44e0 A0d5 9ccad52eb451

దాదాపు 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత విడుదలైన అల్లు శిరీష్ సినిమా ‘ఊర్వశివో ప్రేయసివో’. 4వ తేదీన వచ్చిన ఈ సినిమాపైనే అల్లు శిరీష్ ఆశలు అన్నీ. యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ సినిమాకు రీమేక్. నిజానికి తమిళంలో యువన్ శంకర్ రాజా నిర్మించిన ‘ప్యార్ ప్రేమ కాదల్’ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలనుకున్న టైమ్ లో శిరీష్ కి బాగుంటుందని భావించి రీమేక్ చేసి తీసిన సినిమా ఇది.

కథ విషయానికి వస్తే శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ భిన్న ధృవ భావాలు కలిగిన వ్యక్తులు. ఐటీ కంపెనీలో పనిచేసే వీరి ఒకరిపట్ల ఇంకొకరు ఇష్టాన్ని పెంచుకుంటారు. అది శారీరక సంబంధానికి దారితీస్తుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శిరీష్ అను పట్ల గాఢమైన ప్రేమను పెంచుకుని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అయితే విదేశాల్లో పుట్టి పెరిగిన అను దానిని సాధారణంగా తీసుకుంటుంది. తన డ్రీమ్ నెరవేర్చుకోవటానికే ప్రాధన్యమిచ్చే అను పెళ్ళి కంటే లివ్ఇన్ రిలేషన్ కి ఓకె అంటుంది. తనని ఎలాగైనా పెళ్ళికి ఒప్పించవచ్చనే ఉద్దేశ్యంతో శిరీష్ కూడా సరే అంటాడు. తల్లి ఆమని అంటే ఎంతో ప్రేమ ఉన్న శిరీష్ రెండిళ్ళ మధ్య ఎలా నలిగిపోయాడు? అను పెళ్ళికి ఒప్పుకోకుంటే శిరీష్ ఏం చెసాడు? వేరే సంబంధం చేసుకున్న శిరీష్‌ కి ఏం జరిగింది? అసలు చివరకు శిరీష్‌, అను ఒక్కటవుతారా? అన్నదే ఈ చిత్రం.

ముందు సినిమాలతో పోలిస్తే శిరీష్ నటనలో ఎంతో ఈజ్ పెరిగింది. తన పాత్రలో ఒదిగిపోయాడు. అను ఇమ్మాన్యుయేల్, శిరీష్ మధ్య లిప్ లాక్స్, లివ్ ఇన్ రిలేషన్ యూత్ కి బాగా పడతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సీన్స్ లో ఎక్కడా అబ్సినిటీ అనేది లేకుండా తెరకెక్కించటంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. వెన్నెల కిషోర్, సునీల్ పాత్రలు సినిమాకు మూలస్థంబాల్లాంటివి. ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాయి. శిరీశ్, అను లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నపుడు వారు యస్.పి.ఎల్ కామెంట్రీ పేరుతో చేసిన హడావుడి నవ్వులపువ్వులు పూయిస్తుంది. ఆమని, పృధ్వి, పోసాని వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు.

ఈ యూత్‌ఫుల్ డ్రామాకు సమకాలీన సంబంధాలను మేళవించి చక్కగా సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు రాకేష్ శశి. ప్రథమార్ధం అలా అలా నడిచిపోయినా ద్వితీయార్ధంలో మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ తో ఆడుకున్నాడు. చివరిలో వచ్చే సెంటిమెంట్ డ్రామా కూడా ఆకట్టుకునేలా సాగటంతో పాస్ మార్కులు పడిపోతాయి. పాటలు పిక్చరైజేషన్ పరంగా బాగున్నాయి. ‘థీంతనా… నీ చూపుల దాడి’, ‘అరెరె’ అలరిస్తాయి. అచ్చు అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవర్ ఆల్ గా చూస్తే శిరీశ్ కెరీర్ లో ఓ మంచి సినిమాగా నిలిచిపోతుంది. అయితే టైటిల్ ‘ఊర్వశివో రాక్షసివో’ కంటే బెటర్ టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
యూత్ ను ఆకట్టుకునే సన్నివేశాలు
నేపథ్య సంగీతం
డైలాగ్స్
ఎంటర్ టైన్ మెంట్

మైనస్ పాయింట్స్
అక్కడక్కడా స్లోగా సాగటం
అలరించే పాటలు లేకపోవడం

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: ఎంటర్ టైన్ మెంట్ ఊర్వశి