NTV Telugu Site icon

The Life Of Muthu Review: ద లైఫ్ ఆఫ్ ముత్తు

Muthu

Muthu

The Life Of Muthu Review:త‌మిళ‌నాట విల‌క్ష‌ణ న‌టునిగా గుర్తింపు ఉన్న శింబు, వైవిధ్య‌మైన చిత్రాల ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మేన‌న్ కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం `ద లైఫ్ ఆఫ్ ముత్తు`. ఆరంభం నుంచీ ఈ సినిమా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. తమిళ‌నాట సెప్టెంబ‌ర్ 15న విడుదలైన ఈ చిత్రం తెలుగులో రెండు రోజులు ఆల‌స్యంగా సెప్టెంబ‌ర్ 17న జ‌నం ముందు నిల‌చింది. ప్ర‌ముఖ తెలుగు నిర్మాణ సంస్థ శ్రీ‌స్ర‌వంతి మూవీస్ ఈ సినిమాను తెలుగునాట‌ పంపిణీ చేయ‌డం విశేషం!

ఇంత‌కూ `ద లైఫ్ ఆఫ్ ముత్తు` క‌థ ఏమిటంటే – బియ‌స్సీ చ‌దివిన ముత్తు జీవ‌నోపాధి కోసం కంప చెట్లు కొట్టి అమ్ముకుంటూ ఉంటాడు. త‌ల్లి, చెల్లిని పోషిస్తూ ఉంటాడు. అయితే ఓసారి అగ్నిప్ర‌మాదంలో కంప చెట్లు కాలిపోతాయి. దాంతో ఆ ప్రాంతం అద్దెకు ఇచ్చిన వ్య‌క్తి త‌న డ‌బ్బు త‌న‌కు వాప‌స్ చేయ‌మంటాడు. లేదంటే పోలీసుల‌కు చెబుతాన‌నీ బెదిరిస్తాడు. ముత్తు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఏం చేస్తావో చేసుకోపో అంటాడు. ముత్తు త‌ల్లి అది చూసి భ‌య‌ప‌డుతుంది. ఎందుకంటే అత‌ని జాత‌క రీత్యా ఏదో ఒక రోజున అత‌ను హంత‌కుడు అవుతాడ‌ని ఆమెకు జోస్యులు చెప్పి ఉంటారు. దాంతో భ‌య‌ప‌డి త‌మ‌కు తెలిసిన వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్తుంది. ఆ వ్య‌క్తి బొంబాయిలో ప‌నిచేస్తుంటాడు. అత‌ను ఏదో ఒక ప‌ని చూస్తాన‌ని చెబుతాడు. అయినా అత‌నితో పాటే బొంబాయి తీసుకు పొమ్మ‌ని ముత్తు త‌ల్లి బ్ర‌తిమాలుతుంది. బొంబాయిలో ప‌రోటా కొట్టులో తాను ప‌నిచేస్తాన‌ని, అక్క‌డ ముత్తుకు త‌గిన ఉద్యోగం ఉండ‌ద‌నీ చెబుతాడు. కానీ, ముత్తు త‌ల్లి కాదు కూడ‌దంటే స‌రే అంటాడు. ఆ రోజు రాత్రే ముత్తుకు ఆ పెద్ద‌మ‌నిషి ఓ ఉత్త‌రం ఇచ్చి, మ‌రుస‌టి రోజు ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ముత్తు వెళ్లి శ‌వాన్ని కింద‌కు దించే స‌మ‌యంలో అత‌ని షూట్ కేసులోని గ‌న్ తీసుకుంటాడు. ఎలాగైనా బొంబాయి పోవాల‌నే నిర్ణ‌యించుకుంటాడు. బొంబాయి పోయి ఆ ఉత్త‌రం ప‌ట్టుకొని ప‌రోటా కొట్టు క‌నుగొంటాడు. అక్క‌డ ప‌నిచేసేవారంద‌రూ ఓ డాన్ చెప్పిన‌ట్టు చేసేవార‌ని త‌రువాత తెలుస్తుంది. త‌ర‌చూ తెలుగువారికి, మ‌ల‌బార్ వారికి గొడ‌వ‌లు సాగుతూ ఉంటాయి. వాళ్ల మ‌నుషుల‌ను వీళ్ళు, వీరి జ‌నాన్ని వారు చంపుకుంటూ ఉంటారు. ఆదిప‌త్య పోరు సాగుతూ ఉండ‌గా ఈ రెండు గ్యాంగ్ లు ఓ అస‌లైన డాన్ క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తుంటాయి. ఓ సారి ముత్తు ఉన్న ప‌రోటా కొట్టులోకి రాత్రి జొర‌బ‌డి అపోజిట్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది. ముత్తు త‌న వాళ్ళ‌ను ర‌క్షించుకోవ‌డం కోసం అన్న‌ట్టు త‌న ద‌గ్గ‌ర ఉన్న రివాల్వ‌ర్ తో వ‌చ్చిన వారిని కాల్చిచంపుతాడు. దాంతో ముత్తును అంద‌రూ హీరోలా చూస్తారు. ఆ గ్యాంగ్ కు పైన ఉండి న‌డిపే డాన్ ముత్తును తీసుకు వెళ‌తాడు. త‌నతోనే ఉంచుకుంటాడు. అత‌నికి అమ్మాయిల పిచ్చి. అయినా రెండు సార్లు ముత్తు వ‌ల్ల‌నే ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ‌తాడు. ముత్తు మొద‌ట్లోనే ఓ రెడిమేడ్ షాప్ లో ప‌నిచేసే అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. ఆమె కూడా అత‌డిని అభిమానిస్తుంది. ఓ హోట‌ల్ లో ఆమెను చూస్తాడు. ఆరా తీస్తే, ఆ కొట్టు య‌జ‌మాని ఆమెను అనుభ‌వించాల‌ని ఓ ప‌త‌కం ప్ర‌కారం అక్క‌డ‌కు ర‌మ్మ‌ని ఉంటాడు. ముత్తు వాడిని కొట్టి ఆమెను తీసుకు వెళ‌తాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళ‌కు ముత్తు డ‌బ్బు ఇచ్చి, ఓ ముహూర్తాన ఆమెనే పెళ్ళాడ‌తాడు. ముత్తు చుట్టూ ఉండే ప‌రోటాకొట్టు వాళ్ళ‌లో శంక‌రం ఓ ప‌త‌కం ప్ర‌కారం డాన్ ను చంపేసి, ఆ నేరం ముత్తుపై వేస్తాడు. కానీ, ముత్తు అన్ని వాస్త‌వాలు చెప్ప‌గానే వాడు నీరు కారిపోయి అస‌లు విష‌యం చెబుతాడు. తాను బ‌త‌కడం కోసం ఎదుటి గ్యాంగ్ తో చేయి కలిపాన‌ని అంటాడు. ముత్తు బొంబాయిలో అడుగుపెట్టిన రోజునే శ్రీ‌ధ‌ర్ అనే ఓ మ‌ళ‌యాళ కుర్రోడు కూడా వ‌చ్చి ఉంటాడు. అత‌డు మ‌ల‌బార్ గ్యాంగ్ న‌డిపే బార్బ‌ర్ షాప్ లో క‌టింగ్ చేస్తూ ఉంటాడు. అత‌డిని కూడా ముత్తు ఆదుకుంటాడు. అత‌ను సాధార‌ణ బార్బ‌ర్ లాగే ఉంటాడు.కానీ, ఐదేళ్ళ త‌రువాత ముత్తు డాన్ గా మారివుంటాడు. అందుకు దారి తీసిన కార‌ణాల్లో ఓ లేడీ డాన్ కూడా ఉంటుంది. ముత్తు ఆ ఐదేళ్ళలో ఏం చేశాడు అన్న క‌థ‌కు లీడ్ సీన్స్ చూపిస్తూ సినిమాను మ‌రో భాగం చూసేందుకు ప్రేక్ష‌కుడిని ప్రిపేర్ చేస్తూ ఎండ్ చేశారు.

ముత్తు పాత్ర‌లో శింబు త‌న‌దైన అభిన‌యం ప్ర‌ద‌ర్శించాడు. మొద‌ట్లో ఏమీ తెలియ‌ని ప‌ల్లెటూరి బైతులా క‌నిపిస్తూనే త‌రువాత అత‌ను ఒక్కోమెట్టూ ఎక్కుతూ సాగిన వైనంలో శింబు న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఇత‌ర పాత్ర‌ధారుల్లో ఎవ‌రికి వారు త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించారు. సిద్ధి ఇద్నాని త‌న ముద్దు మోముతో మురిపించింది. లేడీ డాన్ గా తుల‌సి క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. సిద్ధార్థ నూని కెమెరా ప‌నిత‌నం కొన్ని సీన్స్ లో అల‌రించింది. ఎ.ఆర్.ర‌హ‌మాన్ సంగీతంలో రూపొందిన కొన్ని పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా ప‌రోటా కొట్టులో ప‌నిచేసే వారిలో ఓ వ్య‌క్తి భార్య సెల్ ఫోన్ లో వీడియో కాల్ చేసిన‌ప్పుడు వ‌చ్చే పాట “పండ‌గ‌కి రా రా..“ అంటూ సాగే గీతం మురిపిస్తుంది. ఇక గౌత‌మ్ మేన‌న్ నుండి జ‌నం కోరుకున్నంత వైవిధ్యం మాత్రం ఇందులో క‌నిపించ‌దు. ఓ ప‌ల్లె నుండి బొంబాయి పోయి డాన్ అయ్యే వ్య‌క్తుల క‌థ‌ల‌తో ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. పైగా ప్ర‌థ‌మార్ధంలో క‌థ మొత్తం ప‌రోటా కొట్టు చుట్టూ తిరుగుతూ ప్రేక్ష‌కుడి స‌హనానికి ప‌రీక్ష పెడుతుంది. ద్వితీయార్ధంలోనే కొన్ని ట్విస్టులు చోటు చేసుకొని ప‌ర‌వాలేద‌నిపిస్తుంది. మ‌రి ఈ సినిమా సీక్వెల్ ఎలా ఉంటుందో అనే అనుమానంతోనే ప్రేక్ష‌కులు బ‌య‌ట‌కు వ‌స్తారు.

ప్ల‌స్ పాయింట్స్:
– శింబు, గౌత‌మ్ మేన‌న్ సినిమా కావ‌డం
– అల‌రించే సిద్ధి అద్నానీ న‌ట‌న‌
– ఎ.ఆర్. ర‌హ‌మాన్ సంగీతం

మైన‌స్ పాయింట్స్:
– కొత్త‌ద‌నంలేని క‌థ‌
– ప‌రోటాలాగే సాగ‌దీసిన‌ట్టుండే ప్ర‌థ‌మార్ధం
– అల‌రించ‌లేక పోయిన స‌న్నివేశాలు

రేటింగ్: 2/5

ట్యాగ్ లైన్: ముత్తు సుత్తితో మొత్తు!