The Indian Story Movie Review: వేసవి సెలవులు చేయడంతో ఈ వారం చిన్న సినిమాలు దాదాపు 5 థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాదాపు ఆ అన్ని సినిమాలు ఏ ఒక్కటి ఒకే సబ్జెక్టుతో తెరకెక్కినవి కాదు. వాటిలో “ది ఇండియన్ స్టోరి” అయితే ఒక మంచి సందేశం తో తెరకెక్కించామని ముందు నుంచి దర్శకునిర్మాతలు చెబుతూ వచ్చారు. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ భీమ్ రెడ్డి హీరోగా నటిస్తూనే నిర్మించారు. సమాజంలో మత సామరస్యం ఉండాలనే మంచి సందేశంతో మాస్ మసాలా సినిమాకి ఉండాల్సిన కమర్షియల్ అంశాలు కలిపి ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. మరి సందేశాత్మక సినిమాగా చెబుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ
ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ మత విద్వేషాలతో అల్లకల్లోలం అయ్యే ఒక రాష్ట్రంలో హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు), ముస్లింలకు కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్ ) లీడర్లుగా ఉంటారు. ఒక వర్గం మీద మరో వర్గం ప్రతీకార దాడులు చేసుకుంటూ ఉన్న క్రమంలో వైజాగ్ నుంచి రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి) అనే వ్యక్తి వస్తాడు. రెహమాన్ దగ్గర ఉన్న బంగారు బిస్కెట్లు అమ్మడానికి తన స్నేహితుడు ఫేకు (చమ్మక్ చంద్ర) సాయం తీసుకుంటాడు. అయితే అప్పటికే అప్పుల్లో ఉన్న ఫేకు రెహమాన్ దగ్గర గోల్డ్ బిస్కెట్స్ కొట్టేసి అప్పుల నుంచి బయటపడాలని ప్లాన్ చేస్తాడు. గోల్డ్ బిస్కెట్స్ అమ్మే క్రమంలో ఫేకు స్నేహితుడు ముస్తాఫా మీద శ్రీరామ్ వర్గం దాడి చేస్తుంది. ఆస్పత్రిలో ఉన్న ముస్తాఫాను చూసేందుకు వెళ్లిన ముస్లిం లీడర్ కబీర్ ఖాన్ పై హత్యాయత్నం జరుగుతుంది. ఆ సమయంలో కబీర్ ఖాన్ ను కాపాడతాడు రెహమాన్. ఇక అప్పటి నుంచి కబీర్ ఖాన్ కు ఆప్తుడవుతాడు రెహమాన్. ఫేకు ఒత్తిడిలో కబీర్ ఖాన్ వర్గంలో ఓ నాయకుడిగా మారిన రెహమాన్ కబీర్ ఖాన్ కూతురు డాక్టర్ ఆయేషా (జరా ఖాన్) ప్రేమలో పడతారు. ఇంతలో ముస్తఫా చనిపోగా అతని మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు రెహమాన్ తో మాట్లాడాలని ఒంటరిగా తీసుకెళ్లిన కబీర్ ఖాన్ దాడి చేస్తాడు. తనను కాపాడిన రెహమాన్ పై కబీర్ ఖాన్ ఎందుకు దాడికి దిగాడు? జర్నలిస్ట్ రాజ్ రెహమాన్ గా మారి కబీర్ ఖాన్ వర్గానికి ఎందుకు దగ్గరయ్యాడు? రామరాజు, కబీర్ ఖాన్ల గతం ఏంటి. మతం పేరుతో ఈ ఇద్దరు నాయకులు ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టాలి అనుకున్నారు? ఆ కుట్రను రెహమాన్ అలియాస్ రాజ్ ఎలా ప్రజలకు తెలిసేలా చేశాడు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
మత కలహాలు మతకల్లోల నేపథ్యంలో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి ఇప్పుడు ఈ సినిమా కూడా దాదాపు అదే కథాంశంతో తెరకెక్కింది. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అనే లైన్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. నిజానికి ఇది సున్నితమైన అంశం కావడంతో ఇలాంటి సినిమాలు చేయడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు కానీ ఎందుకో ఇలాంటి పాయింట్తో నిర్మాత, హీరో రాజ్ భీమ్ రెడ్డి, దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ముందుకు రావడం ఆశ్చర్యపరిచే అంశం. మతం పేరుతో సమాజాన్ని విడదీసి తమ పబ్బం గడుపుకునే స్వార్థ రాజకీయ నాయకుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి? అందుకోసం వారు ఎంత నీచనికైనా ఎలా దిగజారుతారు అలాంటి విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. నిజానికి హీరో, చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ మధ్య మంచి కామెడీతో ఈ సినిమా సరదాగా మొదలైనా మతం పేరుతో జరిగే రాజకీయ క్రీడను దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆసక్తికరంగా తెరకెక్కించాడు. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే చిన్న లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఇంటర్వెల్ లో ఆడియెన్స్ కు మొదలయ్యే ప్రశ్నలు ఒక్కొక్కటిగా సెకండాఫ్ లో రివీల్ చేస్తూ రావడం సినిమాకి కాస్త ప్లస్ అయ్యే అంశం. ఇక సినిమా పరంగా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అయితే ఎంచుకున్న పాయింట్ ని ప్రజెంట్ చేసే విషయంలో క్లారిటీ కనిపించింది.
నటీనటుల విషయానికి వస్తే హీరోగా తనదైన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు రాజ్ భీమ్ రెడ్డి. అంతేకాక హీరోయిన్ తో అర్థం పర్థం లేని డ్యూయెట్స్ పెట్టకపోవడం మరో ఆసక్తికరమైన అంశం. ఫేకు గా చమ్మక్ చంద్ర సినిమాలో మరో ప్లస్ పాయింట్. ఉన్నంత సేపూ నవ్విస్తూనే ఉన్నాడు. అలాగే హీరోయిన్ జరా ఖాన్ తన పాత్రలో ఇమిడిపోయింది. శ్రీరామ్ గా రామరాజు, కబీర్ ఖాన్ గా ముక్తార్ ఖాన్ తమ పాత్రల్లో జీవించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ది ఇండియన్ స్టోరి” సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిమ్మల జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సందీప్ కనుగుల మ్యూజిక్ కూడా సినిమాకి మంచి ఎలివేషన్ తీసుకువచ్చాయి. సందీప్ నేపథ్య సంగీతం కూడా సినిమా సీన్స్ ను మరింత ఎలివేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫైనల్లీ మతం కంటే మనుషులుగా మనం కలిసి ఉండటం ముఖ్యమనే సందేశాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పే ప్రయత్నం “ది ఇండియన్ స్టోరి”