NTV Telugu Site icon

The Great Indian Suicide Review: ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ రివ్యూ

The Great Indian Suicide Movie Review

The Great Indian Suicide Movie Review

The Great Indian Suicide Movie Review: హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే సినిమా అక్టోబర్ ఆరో తేదీ నుంచి ఆహ్వానం స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో అనౌన్స్ చేసిన ఒక సినిమాని పేరు మార్చి ఆహా లో రిలీజ్ చేశారు. గతంలో ఢిల్లీ బురారీ మాస్ సూసైడ్, మదనపల్లి ఘటనలను ఆధారంగా చేసుకుని విప్లవ్ కోనేటి ఈ సినిమాను డైరెక్ట్ చేసి స్వయంగా నిర్మించాడు. ట్రైలర్, టీజర్ తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు సినిమా రివ్యూలో చూద్దాం.

కథ: అనాధ అయిన హేమంత్ (రామ్‌ కార్తీక్‌) తన స్నేహితుడితో కలిసి ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. తన కాఫీ షాప్ కి కుకీస్ సప్లై చేసే చైత్ర (హెబ్బా పటేల్)ను మొదటి చూపులోనే ప్రేమించిన హేమంత్ ఆమె ప్రేమను దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే చైత్రకు ప్రపోజ్ చేస్తే ఆమె ఒప్పుకోవడం లేదని ఊరు విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో చైత్ర తనకు హేమంత్ అంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెబుతుంది. ఎందుకంటే తాను కొన్ని రోజులలో చనిపోవడానికి సిద్ధమవుతున్నానని షాక్ ఇస్తుంది. ముందు షాకింగ్ అనిపించినా తనను ప్రేమిస్తుందని తెలియడంతో ఆమెను దక్కించుకునేందుకు హేమంత్ ప్రయత్నిస్తాడు. అందులో భాగంగా ఆమె తన పెదనాన్న బళ్ళారి నీలకంఠం(నరేష్) కోసం ఎందుకు చనిపోవాలని అనుకుంటుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు బళ్ళారి నీలకంఠం ఎలా చనిపోయాడు? బళ్ళారి నీలకంఠాన్ని మళ్లీ ఎలా బతికించాలని ఆయన కుటుంబ సభ్యులు భావించారు? హేమంత్ చైత్రను వివాహం చేసుకున్నాడా? చైత్ర కుటుంబాన్ని ఈ మాస్ సూసైడ్ నుంచి కాపాడాడా అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ: నిజానికి ఢిల్లీలో 11 మంది ఒకే ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో కనిపించగా అప్పట్లో ఈ ఘటన పెను కలకలానికి దారితీసింది. దాదాపుగా అలాంటి తరహాలోనే మదనపల్లిలో ఇద్దరు కుమార్తెలను చంపి తాము కూడా చనిపోయేందుకు సిద్ధమైన ఒక మధ్య వయస్కులైన జంట వ్యవహారం కూడా హాట్ టాపిక్ అయింది. ఇలా మూఢనమ్మకాలనే ప్రధాన అంశంగా చేసుకొని విప్లవ్ కోనేటి ఈ కథ రాసుకున్నట్లు అనిపించింది. మూఢనమ్మకాలను బాగా ఫాలో అయ్యే ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబం వల్ల ఇబ్బంది పడిన అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రేరేపించి చావు వరకు నడిపించే ప్రయత్నం చేయడం. చివరికి ఆ వ్యక్తి తీసుకువచ్చిన మరో వ్యక్తి ద్వారానే ఈ విషయం అంతా కుటుంబ సభ్యులకు తెలియడం వంటి విషయాలను చాలా ఆసక్తికరంగా రాసుకున్నాడు దర్శకుడు. నిజానికి సినిమా ట్రైలర్ చూసినప్పుడు కచ్చితంగా ఇది ఆత్మహత్యలకు సంబంధించిన సినిమానే అని ఈజీగా అర్థమవుతుంది. కానీ సినిమాలో సెకండ్ హాఫ్ మొదలైన తరువాత అసలు విషయం ఒక్కటొక్కడిగా రివీల్ అవుతున్నంతసేపు భలే షాకింగ్ అనిపిస్తుంది. ఎవరినైతే మనం బాధితులం అనుకుంటామో వారే ఇదంతా ప్లాన్ చేశారని రివీల్ చేసేలా స్క్రీన్ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. కథనంలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే సినిమాగా చూస్తే మాత్రం అందరినీ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు. మూఢనమ్మకాల మీద ఇది ఎక్కువ పెట్టిన ఒక బాణంలా అనిపిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చర్చలోకి వస్తున్న చైల్డ్ అబ్యూస్ వ్యవహారాన్ని కూడా ఈ సినిమాలో టచ్ చేశారు. చైల్డ్ అబ్యూస్ కి గురైన ఒక బాలిక లేదా బాలుడు ఎలాంటి పరిస్థితులకు గురవుతారు? వారి మనస్తత్వం ఎంతలా మారిపోతుంది? అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపడంలో సఫలమయ్యాడు డైరెక్టర్.

ఎవరు ఎలా చేశారు అంటే ముందుగా నటీనటుల విషయానికి వస్తే సూసైడ్ కి ప్రయత్నిస్తున్న చైత్ర అనే అమ్మాయి పాత్రలో హెబ్బా పటేల్ అదరగొట్టింది. ఆమెకు ఈ తరహా పాత్ర కొత్త ఏమీ కాదు, ఎందుకంటే గ్లామరస్ గా కనిపిస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న ఎన్నో సినిమాల్లో ఆమె నటించింది. కానీ ఇది కాస్త ప్రత్యేకమైనదే అని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి ఆమె చూసిన కోణాన్ని సెకండాఫ్ క్లైమాక్స్ కి వచ్చేవరకు పూర్తిగా మారిపోతుంది. రెండు భిన్నమైన పార్శ్యాలు ఉన్న పాత్రలో ఆమె తన నటనను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. హీరోగా నటించిన రామ్ ఆకట్టుకునేలా నటించాడు. ఇక బళ్ళారి నీలకంఠయ్య పాత్రలో నరేష్ ఆయన భార్య పాత్రలో పవిత్ర లోకేష్ సరిగ్గా సూట్ అయ్యారు. ఇక మిగతా వారు కూడా ఎవరికి వారు తమ తమ పాత్రల పరిధి మేర నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా హారర్ అనిపిస్తుంది కానీ కాదు. ఒకరకంగా థ్రిల్లర్ సబ్జెక్ట్ ని చాలా లైటర్ వేలో ముగించినట్లు అనిపించింది. దర్శకుడు ఈ విషయాన్ని కాస్త మరింత హారర్ టచ్ ఇచ్చి తీసి ఉంటే ఈ సినిమా లెవెల్ వేరేలా ఉండేది, అలాగే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యుండేది. కథ, స్క్రీన్ ప్లే బాగానే ఉన్నా డైలాగులు మాత్రం ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్లీ: ఊహించని ట్విస్టులతో థ్రిల్ చేసే ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’