NTV Telugu Site icon

Keeda Cola Review: తరుణ్ భాస్కర్ మూడో సినిమా ‘కీడా కోలా’ రివ్యూ

Keeda Cola Review

Keeda Cola Review

Keeda Cola Movie Review: పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో యూత్లో మంచి క్రేజ్ సంపాదించాడు తరుణ్ భాస్కర్. ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో అందుకే ఈ సారి కీడా కోలా అనే సినిమా తెరక్కించడమే కాదు నటించి, దర్శకత్వం చేస్తూ ఈసారి కొత్త ప్రయోగం చేశాడు. రానా సమర్పకుడిగా వ్యవహరించడం బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమా మీద అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ మేరకు ఈ కీడా కోలా మెప్పించిందా? ఎంతవరకు ఆ అంచనాలను అందుకుంది అనేది సినిమా రివ్యూలో చూద్దాం.

కీడాకోలా కథ ఏమిటంటే?
ఒక నత్తి లాంటి జబ్బుతో బాధపడే వాస్తు(చైతన్యరావ్), తాత వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం) అనూహ్యంగా ఒక కోటి రూపాయలు కట్టాల్సి వస్తుంది. వాస్తుకు ఫ్రెండ్, లంచం అనే నిక్ నేమ్ తో ఉన్న లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌) ఆ కోటి సంపాదించే పనిలో ఉండగా తాత కోసం కొన్న కూల్ డ్రింక్ కీడా కోలాలో బొద్దింక‌ కనిపిస్తుంది. దాన్ని చూపించి కన్స్యూమర్ ఫారంలో కేసు వేసి య‌జ‌మానిని బెదిరించి 5 కోట్లు లాగాలని చూస్తారు. అయితే నిజానికి వీరికి సంబంధం లేని వార్డు మెంబర్ జీవ‌న్ (జీవ‌న్‌)కి కార్పొరేట‌ర్ కావాల‌నే ఆశ‌తో 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్న భక్త నాయుడు (తరుణ్ భాస్కర్) తో ఆ ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. జీవ‌న్ కార్పొరేట‌ర్ కావాలంటే డబ్బు అవ‌స‌రం కావ‌డంతో ఆ డబ్బు కోసం నాయుడు పనిచేసే కోలా కంపెనీ సీసాలో బొద్దింక వేస్తాడు. ఆ బొద్దింకను చూపించి డబ్బు కొట్టేయాలని అనుకుంటే ఆ సీసా వాస్తు అండ్ కో చేతికి వెళుతుంది. ఈ క్రమంలో ఆ సీసా కోసం వాస్తు అండ్ కోని నాయుడు అండ్ కో ఛేజ్ చేస్తుంది. మరో పక్క కీడా కోలా సీఈవో (రవీంద్ర విజయ్) తన మేనేజర్ షార్ట్స్(రోడీస్ రఘు)ని కూడా రంగంలోకి దించుతాడు. ఇలా ఎవరికీ వారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్‌, జీవ‌న్ గ్యాంగ్ చేతులు ఎందుకు క‌లిశారు? వీరి డబ్బు అవసరాలు తీరాయా? లాంటి విష‌యాలు తెలియాలంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాలసిందే.

విశ్లేషణ:
ఇది కొత్త కథ అని అద్భుతమైన కథ అని అనలేం. అలా అని రొటీన్ సినిమాలాగా కూడా అనిపించదు. ఎందుకంటే ఈ సినిమాను చాలా చిన్న లైన్ తో రాసుకుని దాని చుట్టూనే తిరుగుతూ ఫన్ పుట్టించే ప్రయత్నం చేశాడు తరుణ్ భాస్కర్. నిజానికి ఈ కథను వేరే దర్శకుడు ఎవరైనా అయితే రోటీన్ క్రైమ్ కామెడీగా మార్చేవారేమో కానీ తరుణ్ భాస్కర్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఉన్న కథనే కొత్తగా చెప్పాలని ప్రయత్నించి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఓపెనింగ్ సీన్ నుంచే తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ మొదలు పెట్టి చిట్టచివరి సీన్ వరకు ఆగకుండా చూసుకున్నాడు. అయితే చిన్న సినిమా కావడంతో ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని పంచ్ లు తప్పిస్తే పెద్దగా ఎగ్జైటింగ్ అనిపించదు. సెకండాఫ్ ను మాత్రం ఒక్క నిమిషం కూడా ఆగకుండా క్రైమ్ కామెడీతో సినిమాను పరుగులు పెట్టించాడు తరుణ్ భాస్కర్. ముఖ్యంగా రీమిక్స్ పాటలు వచ్చే సీన్స్ అయితే జనాలు పగలబడి నవ్వేలా రాసుకున్నాడు. కూల్ డ్రింక్ లో బొద్దింక పడిందని కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి డబ్బులు లాగుదాం అనే సింపుల్ లైన్ తో భలే కథ అల్లుకున్నాడు. ఈ లైన్ చాలా సింపుల్ అయినా తన స్క్రీన్ ప్లేతో, తనదైన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నాడు తరుణ్ భాస్కర్. నిజానికి జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు వారానికి పదుల జోకులు జనాల్లోకి వదులుతున్న క్రమంలో ఇప్పుడు నవ్వించడం చాలా కష్టమే కానీ తన ప్రయత్నం చాలా వరకు బాగా చేసి ఆకట్టుకున్నాడు తరుణ్.. అయితే యూత్ కు మాత్రమే కనెక్ట్ అయ్యే కామెడీ ఇది.. కొంత సోషల్ మీడియాకి దూరంగా ఉండేవారికి కొన్ని సీన్లు కనెక్ట్ కావు. అదొక్కటి మైనస్ అనిపిస్తుంది కానీ ఓవర్ ఆల్ గా చూసుకుంటే అసభ్యత జోలికి పోకుండా నవ్వించే ప్రయత్నం చేశారు. షార్ప్ షూటర్ల పేరుతో దించిన గ్యాంగ్ చేసే హంగామా సినిమా మొత్తానికి హైలైట్.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఇప్పటి వరకు 1000కి పైగా సినిమాల్లో ఎన్నో పాత్రలతో అలరించిన బ్రహ్మానందం ఈ మూవీలో వరదరాజు అని కుర్చీలో నుంచి లేవకుండా ఉండే ఒక క్యారెక్టర్‌తో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. చైతన్య రావు వాస్తుగా ఒక జబ్బుతో బాధపడుతూ ఫెర్ఫార్మన్స్ తో దుమ్మురేపాడు. ఇక లంచం అలియాస్ కౌశిక్‌గా రాగ్ మయూర్, సీఈఓగా రవీంద్ర విజయ్, షాట్స్‌గా రోడీస్ రఘురామ్ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇక ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ యాక్టర్ గా మరో మెట్టు ఎక్కాడనేలా ఆయన నటన ఉంది. ఇక జీవన్ కుమార్, విష్ణు ఓయ్, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇలా ఒక్కరేమిటి కనిపించిన అందరూ ఆకట్టుకునేలా నటించారు. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపువస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి కనుక వస్తే మ్యూజిక్ ఈ సినిమాను వేరే లెవల్ కి తీసుకువెళ్ళింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను ఎలివేట్ చేయగా బూతుల బదులు వాడిన పాటలు హైలైట్. ఇక అరోన్ సినిమాటోగ్రఫి అయితే సూపర్ అనిపించింది. ఉపేంద్ర వర్మ ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. ఫన్, సెటైరికల్ కామెడీ ప్రధాన అంశాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో దాదాపు చాలా సీన్స్ లో కామెడీ పండడంతో సినిమా వర్కౌట్ అయిదనింపించేలా సాగుతుంది.

ఫైనల్లీ: ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఫుల్ మీల్స్ లాంటి కామెడీ భోజనం చేసి రావచ్చు. అయితే నేటితరం జోక్స్ కాబట్టి అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు కానీ కీడా కోలా ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ .