NTV Telugu Site icon

Taanakkaran Movie Review : పోలీస్ ‘శిక్ష’ణ!

Taanakkaran Movie Review

Taanakkaran Movie Review

తారాగణం: విక్రమ్ ప్రభు, అంజలీ నాయర్, లాల్, ఎమ్.ఎస్.భాస్కర్, మధుసూదనరావు, బోస్ వెంకట్, పావెల్ నవగీతం, నితిశ్ వీర తదితరులు
సినిమాటోగ్రఫి: మాధేశ్ మాణిక్యం
సంగీతం: జిబ్రాన్
నిర్మాత: ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్.ప్రభు, పి.గోపీనాథ్, తంగ ప్రభాగరన్
దర్శకత్వం: తమిళ్

కాప్ స్టోరీస్ అనగానే, దొంగలను వెంటపడే పోలీసుల కథలు, పోలీసుల్లోనూ దుర్మార్గులైన వారిని ఓ పట్టు పట్టే సామాన్యుల కథలు చూసి ఉంటాం. అసలు పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? పోలీసులు ఎందుకు అంత కఠినంగా మారి ఉంటారు? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పే పోలీస్ కథలు అంతగా రాలేదు. ఆ లోటును తీర్చే చిత్రంగా ‘టానక్కారన్’ తెరకెక్కింది. మహానటుడు శివాజీగణేశన్ మనవడు, ప్రముఖ నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ప్రారంభం మొదలు, పూర్తయ్యే దాకా పోలీస్ శిక్షణయే నేపథ్యంగా సాగుతుంది.

అసలు కథలోకి వస్తే – భారతీయులను రక్షకభటులుగా చేర్చుకోవడానికి బ్రిటిష్ వారు అంతగా ఇష్టపడేవారు కాదు. అందువల్ల రక్షకభటులు కావాలనుకొనే భారతీయులకు కఠినమైన పరీక్షలు పెట్టి వెనక్కి పంపేవారు. ఆ పరీక్షల్లో నెగ్గినవారే వారి కింద పనిచేసేవారు. వారి శిక్షణవల్ల సాటి భారతీయులపైనే అప్పటి ఇండియన్ పోలీస్ రాక్షసంగా ప్రవర్తించేవారు. తెల్లవారు తొలగిపోయినా, మనకు స్వాతంత్ర్యం వచ్చినా, ఇప్పటికీ అవే రూల్స్ ను అనుసరిస్తూ మన పోలీసుల ట్రైనింగ్ సాగుతోంది. పోలీస్ అంటే ఎంతో బాధ్యతాయుతమైన ఉద్యోగం అని, రక్షకభటులు అంటే జనాన్ని రక్షించేవారని భావించిన అరివళగన్ అనే ఎమ్.ఏ. గోల్డ్ మెడలిస్ట్ పోలీస్ కావాలని వస్తాడు. అతని క్వాలిఫికేషన్ చూసి ఎందుకొచ్చావని అడుగుతారు. తనకు పోలీస్ కావాలన్నదే ధ్యేయమని చెబుతాడు. కానీ, అక్కడ పరిస్థితులు ఎంతో భిన్నంగా ఉంటాయి. ముత్తు పాండి అనే ఇన్ స్పెక్టర్, ఈశ్వరమూర్తి అనే ట్రైనింగ్ ట్యూటర్ ఇద్దరూ అక్కడ శిక్షణకు వచ్చిన వారిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. దానిని నిలదీసిన అరివును కూడా టార్చర్ పెడతారు. మరో ట్రైనింగ్ ట్యూటర్ చెన్నప్ప మాత్రం నిజాయితీ పరుడు. అతనితో పాటు మరో ఇన్ స్పెక్టర్ వెంకట్ కూడా దయార్ద్ర హృదయుడే ఉంటారు. అరివు ఎందుకు పోలీస్ కావాలనుకున్నాడో తెలిసిన మనసున్న ట్రైనింగ్ ట్యూటర్ అతనికి సహకరిస్తాడు. మంచి శిక్షణ ఇస్తాడు. ఓ సారి మాటామాటా పెరగడంతో ఈశ్వరమూర్తితో అరివు పోటీకి సై అంటాడు. చివరకు కవాతు ట్రైనింగ్ లో అరివు గెలుస్తాడు. కానీ, ఈశ్వరమూర్తియే విన్నర్ గా గోల్డ్ మెడల్ లభిస్తుంది. దాంతో పోలీస్ సిస్టమ్ మీదనే గౌరవం పోయిందని అరివు అంటాడు. అయితే, తామందరమూ సిస్టమ్ కు కట్టుబడి ఉండాలని జనానికి సేవ చేయడంలోనే అసలైన పోలీసులుగా నడచుకోవాలని ఇన్ స్పెక్టర్ వెంకట్ చెబుతాడు. దాంతో అరివు ఆయనను కౌగిలించుకొని ఖాకీ దుస్తులు ధరించేందుకు సిద్ధపడడంతో కథ ముగుస్తుంది.

కథ ఇంతే అయినా, సన్నివేశాలను ఎంతో వివరంగా తెరపైకెక్కించారు దర్శకుడు తమిళ్. అతనికి మాధేశ్ మాణిక్యం కెమెరా పనితనం ఎంతగానో సహకరించిందని చెప్పవచ్చు. జిబ్రాన్ స్వరకల్పనలో రూపొందిన “తుడితేళ్ తోళా…”, “కట్టికొడా…” అంటూ సాగే రెండు పాటలూ అలరిస్తాయి. విక్రమ్ ప్రభు తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అతనిపై మనసు పడే లేడీ పోలీస్ గా అంజలీ నాయర్ కనిపించారు. ఇతర పాత్రల్లో టార్చర్ పెట్టే ట్రైనర్ ఈశ్వరమూర్తిగా లాల్, అతనికి కొమ్ముకాసే ఇన్ స్పెక్టర్ గా మన తెలుగునటుడు మధుసూదనరావు, మంచి మనసున్న ట్రైనర్ గా ఎమ్.ఎస్.భాస్కర్, మరో ఇన్ స్పెక్టర్ గా బోస్ వెంకట్ తమదైన అభినయం చూపించారు.

పదే పదే ట్రైనింగ్ లో జరిగే టార్చర్ ను ఎక్కువగా చూపించడం ద్వారా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్టయింది. అందువల్లే కథ సాగదీసినట్టుగా ఉంది. ఏది ఏమైనా తెల్లవారి పాలన పోయినా, ఇప్పటికీ వారు చూపిన బాటలో వేలాడుతున్నామనే సందేశాన్ని ఈ సినిమా అందించింది. శుక్రవారం ‘టానక్కారన్’ డిస్నీ హాట్ స్టార్ లో నేరుగా విడుదలయింది.

ప్లస్ పాయింట్స్:

మైనస్ పాయింట్స్:

రేటింగ్: 2.5/5

ట్యాగ్ లైన్: పోలీస్ ‘శిక్ష’ణ!