NTV Telugu Site icon

Swathi Mutyam Review: స్వాతిముత్యం

Swathi Mutyam

Swathi Mutyam

Swathi Mutyam Review: ‘స్వాతిముత్యం’ టైటిల్ తెలుగువారికి సుపరిచితం. దాదాపు 36 ఏళ్ళ క్రితం కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన ‘స్వాతిముత్యం’ జనాన్ని విశేషంగా అలరించింది. ఇప్పుడు అదే టైటిల్ తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ‘స్వాతిముత్యం’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ చిన్న కొడుకు సాయిగణేశ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణకు కూడా ఇదే తొలి చిత్రం! చిరంజీవి, నాగార్జున సినిమాలు ‘గాడ్ ఫాదర్, ద ఘోస్ట్’ తో పాటు విడుదల అయిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.

ఇక ‘స్వాతిముత్యం’ కథ విషయానికి వస్తే – హీరో గ‌ణేశ్ కు ఇంట్లోవాళ్ళు పెళ్లిసంబంధాలు చూస్తూ ఉంటారు. అటు హీరోయిన్ వర్ష బొల్లమ్మకు పెళ్లికొడుకును వెద‌కుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి పెళ్ళి చూపులు జరుగుతాయి. ఒకరికి ఒకరు నచ్చినా స్వతంత్రభావాలు ఉన్న హీరోయిన్ కు కాబోయే అత్తమామల నిబంధనలు నచ్చవు. అయినా హీరో కోసం ఒప్పుకుంటుంది. దాంతో సంబంధం ఖాయం అవుతుంది. ఇదిలా ఉంటే హీరోకి సన్నిహిత మిత్రుడు వెన్నెల కిశోర్. తన ఇబ్బందిని తీర్చటానికి స‌రోగ‌సీ ద్వారా సంతానం కోసం హీరో `స్పెర్మ్` దాన‌మిస్తాడు. బిడ్డ కోసం ఓ స‌రోగ‌సీ మ‌ద‌ర్ ను కూడా ఎంచుకుంటారు. ఆమె ఓ బిడ్డకు జ‌న్మనిస్తుంది. అయితే స‌రోగ‌సీతో బిడ్డ కావాల‌నుకున్న మహిళ హ‌ఠాత్తుగా మ‌ర‌ణిస్తుంది. దాంతో స‌రోగ‌సీ మ‌ద‌ర్ ఆ బిడ్డ వ‌ల్ల త‌న భ‌ర్తతో స‌మ‌స్యలు వస్తాయని భావించి పరిష్కారం కోసం బిడ్డతో స‌హా హీరో ద‌గ్గర‌కి వ‌స్తుంది. సరిగ్గా పెళ్ళి రోజు జరిగిన ఈ సంఘటన వల్ల ఆ బిడ్డ ఆల‌నాపాల‌నా భారం హీరోపై ప‌డుతుంది. దీంతో పెళ్ళి ఆగిపోతుంది. మ‌రి హీరో, హీరోయిన్ మ‌ళ్ళీ ఎలా క‌లుసుకున్నారు. వారి ప్రేమ ఫ‌లించిందా? వాళ్ళ పెద్దవాళ్ళ స్పందన ఏమిటి? ఇత్యాది అంశాల‌తో క‌థ చివ‌ర‌కు సుఖాంత‌మ‌వుతుంది.

`స‌రోగ‌సీ` ద్వారా త‌లెత్తే స‌మ‌స్యల‌పై గ‌తంలోనూ కొన్ని చిత్రాలు రూపొందాయి. అయితే ఆ అంశం చుట్టూ క‌థ‌ను వినోదంగా న‌డిపే ప్రయ‌త్నం చేశాడు దర్శకుడు లక్ష్మణ్. తనకు ఇదే తొలి చిత్రం అయినా శ‌క్తి మేర‌కు ఆక‌ట్టుకొనేలా తీసే ప్రయ‌త్నం చేశారు. ఇక హీరో బెల్లంకొండ సాయిగ‌ణేశ్ కు కూడా ఇదే మొద‌టి సినిమా. పాత్ర లో ఫ్రొపైల్ లో ఉండాలి కాబట్టి త‌న ప‌రిధి మేర‌కు చక్కగానే న‌టించాడు. హీరోయిన్ వ‌ర్ష చక్కటి న‌ట‌న ప్రద‌ర్శించినా హీరోకు సరైన జోడి అనిపించలేదు. ఇక ఈ సినిమాకు ఆయువు ప‌ట్టు నిలిచింది ద్వితీయార్ధమే. అందులోనూ పల్లెటూరి మనిషిగా గోప‌రాజు ర‌మ‌ణ పండించిన కామెడీ నవ్వుల పువ్వులు పూయించింది. ఒక విధంగా అత‌ని ట్రాక్ లేక‌పోయి ఉంటే సినిమా బోర్ అనేసే వాళ్ళే. ఎప్పటిలాగే న‌రేశ్, రావు ర‌మేశ్ ఇరగదీవారు. ప్రగ‌తి, సురేఖావాణి, వెన్నెల కిశోర్ త‌మ‌ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఈ త‌ర‌హా చిత్రాల‌కు ప్రాణం పోసేది సంగీత‌మే. ఎందుకో ఏమో మ‌హ‌తి స్వర‌సాగ‌ర్ సంగీతం అంత‌గా ఆక‌ట్టుకోలేదనే చెప్పాలి. ఏది ఏమైనా పండగా పూట టాప్ స్టార్స్ ని కాదని ఈ సినిమాకు ఆడియన్స్ రావాలంటే అద్భుతమైన టాక్ రావాలి. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పగలం కానీ యూత్ ని ఇంప్రెస్ చేస్తుందని చెప్పలేం. సో ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి మౌత్ టాక్ ద్వారా ప్రచారం చేస్తేనే ఈ సినిమాకు మనుగడ. అది జరుగుతుందా? జరగాలని ఆశిద్దాం.

ప్లస్ పాయింట్స్
– నిర్మాణ విలువలు
– కొన్ని నవ్వించే సన్నివేశాలు
– అల‌రించే గోప‌రాజు ర‌మ‌ణ హాస్యం
– సినిమా నిడివి

మైనస్ పాయింట్స్
– సాదా సీదాగా సాగే తొలి భాగం
– హీరో, హీరోయిన్ల జోడీ
– ఆకట్టుకోని సంగీతం

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: `స‌రోగ‌సీ` ముత్యం

Show comments