NTV Telugu Site icon

Peddha Kapu 1 Review: పెద్దకాపు 1 రివ్యూ

Peddhakapu

Peddhakapu

Peddha Kapu 1 Review: ఫ్యామిలీ సినిమాలు చేసే శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్శించారు. ఆ తరువాత ఆయన ఏమి సినిమా చేస్తున్నాడు అనేది కూడా బయటకి రానివ్వకుండా సైలెంటుగా చేసిన సినిమా పెద్దకాపు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ అనే రెండు కొత్త ముఖాలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కించారు. దాని తోడు ఈ సినిమాలో కన్నబాబు అనే ఒక పాత్రలో కూడా శ్రీకాంత్ అడ్డాల కనిపించడం సినిమా మీద ఆసక్తి పెంచింది. దానికి తోడు సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేయగా ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

పెద్దకాపు 1 కథ :
గోదావరి లంకల్లోని ఓ గ్రామంలో సత్య రంగయ్య (రావు రమేష్), బయ్యన్న (ఆడుకాలమ్ నరేన్) ఇద్దరూ రాజకీయ నాయకులుగా ఉంటారు. అధికారం చేజిక్కించుకోవడం కోసం ఆ ఊరితో సహా దాదాపు మరో పది చుట్టుపక్కల గ్రామాల్లో అల్లకల్లోలం సృష్టిస్తారు. తక్కువ కులాలపై అగ్రవర్ణాల వివక్ష ఇంకా కొనసాగుతున్న సమయంలో 1983 సంవత్సరంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించి బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి తీసుకుని పోటీకి దించేందుకు ఒక పార్టీ ఇంఛార్జ్(నాగబాబు)ను పంపుతారు. ఈ క్రమంలో ఆవేశమే కాక ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం పార్టీ జెండాను గ్రామంలో ఎగరేసి ఎన్టీఆర్ దృష్టిలో పడతారు. ఇక పెద్దకాపుకి టికెట్ ఇచ్చారా? పెద్దకాపు సత్య రంగన్నను ఎందుకు చంపాడు? పెద్దకాపుకి బయ్యన్నకి మధ్య సంబంధం ఏంటి? పెద్దకాపు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా? పెద్దకాపుకి అక్కమ్మకి ఉన్న సంబంధం ఏమిటి? లాంటి ఎన్నో విషయాలు తెలియాలి అంటే సినిమా పూర్తిగా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా ఒక పూర్తిస్థాయి రివెంజ్ డ్రామా అనే విషయాన్నీ అనేక సార్లు చెబుతూనే వచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే గోదావరి జిల్లాలు అనగానే ప్రేమకు ఆప్యాయతకు మారు పేరు, అక్కడ మనుషులు అందరూ ప్రేమతో ముంచెత్తుతూ ఉంటారని అందరూ అనుకుంటారు కానీ ఈ సినిమా అందుకు భిన్నం అనిపించింది. గోదావరి జిల్లాలో రెండు వర్గాల మధ్య వైరం కారణంగా ఓ పాపను అమ్మడానికి ప్రయత్నించే సీన్‌తో పెద్దకాపు సినిమా మొదలై ఎన్టీఆర్ పార్టీ పెట్టి బడుగు, బలహీన వర్గాలు అన్నీ ఏకమై టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌. అంతేకాక ఇతర భాషల్లో వచ్చే రా అండ్ రస్టిక్ సినిమాలు చూసి మనవాళ్ళు ఇలాంటివి ఎప్పుడూ తీయరు ఏంటి? అనుకునే వారందరి నోళ్లు మూయించే విధంగా జెండా పాతే ఎపిసోడ్ తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. ప్రతీ చిన్న విషయాన్ని కుడి విశదీకరించి చెప్పేందుకు శ్రీకాంత్ అడ్డాల చేసిన ప్రయత్నం బాగుంది కానీ కొంత సాగదీసినట్టు అనిపించినా అది మన తప్పు కాదు. అయితే మితిమీరిన రక్తపాతం కొంత ఎబ్బెట్టుగా అనిపించినా అప్పటి పరిస్థితులు ఇలాగే ఉండేవేమో అనిపించేలా తీశారు. నిజానికి ఇలాంటి ఘటనలు గతంలో చుండూరు, కారంచేడు వంటి ప్రాంతాల్లో జరిగాయి కానీ వాటిని గోదావరి లంకల నేపథ్యంలో చూపించడం కొంత కన్విన్సింగ్ అనిపించలేదు. ఇక సినిమా కథ, పాయింట్ బాగానే ఉన్నా ఎందుకో స్క్రీన్ ప్లే విషయంలో కొంత తడబాటు అనిపించింది. ఈ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అయితే మొత్తం మీద అడ్డాల వారి అడ్డా నుంచి వచ్చిన ఈ సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నా ఆకట్టుకునేలా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే:
పెద్దకాపు సినిమాలో నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విరాట్ కర్ణ మొదటి సినిమాకే స్టార్ లు చేయాల్సిన లాంటి పాత్రలో ఆకట్టుకునేలా నటించారు. మొదటి సినిమా అని ఎక్కడా అనిపించకుండా నటించే ప్రయత్నం చేశాడు. ఇక కొత్త అమ్మాయి ప్రగతి చాలా క్యూట్ అనిపించింది. రావు రమేష్ మరోసారి నట విశ్వరూపం చూపింస్తూ ఆడుక్కాలమ్ నరేన్ తో ఢీ అంటే ఢీ అన్నట్టు నటించారు. అనసూయ అక్కమ్మ పాత్రలో జీవించింది. శ్రీకాంత్ అడ్డాల ఇప్పటి వరకు దర్శకుడిగానే మనకి తెలుసు కానీ ఈ సినిమాలో కూర్చున్న చోట నుంచి అంత నడిపించే పాత్రలో రెచ్చిపోయి నటించాడు. బ్రిగిడా సాగా ఆకట్టుకునేలా నటించింది. తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, శ్రీనివాస్, ప్రవీణ్ యండమూరి, చౌదరి లాంటి వారు తమ తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు. టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే మ్యూజిక్ విషయంలో మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ కూడా వేరే రేంజ్ లో ఉంది. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్లు, రక్తపాతం భయపెట్టేలా ఉన్నాయి. ద్వారకా క్రియేషన్స్‌ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ: పెద్దకాపు 1 ఒక రా అండ్ రస్టిక్ పొలిటికల్ డ్రామా. మితిమీరిన హింసను భరిస్తే ఈ సినిమా నచ్చచ్చు. ఫ్యామిలీల కంటే బీ,సీ సెంటర్ల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.