NTV Telugu Site icon

Raghava Reddy Review: రాఘవ రెడ్డి రివ్యూ

Raghava Reddy Review

Raghava Reddy Review

Raghava Reddy Movie Review: శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా ‘రాఘవ రెడ్డి’ అనే సినిమా తెరకెక్కింది. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై ఈ రాఘవ రెడ్డి అనే సినిమాను డైరెక్ట్ చేశారు సంజీవ్ మేగోటి. KS శంకర్ రావ్, R.వెంకటేశ్వర్ రావు, G.రాంబాబు యాదవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 5న విడుదలయింది. సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేయడంతో ఈ సినిమా ఎలా ఉఁటుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు ఆడియన్స్. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

రాఘవ రెడ్డి కథ ఏమిటంటే:
రాఘవ రెడ్డి(శివ కంఠమనేని) వైజాగ్ లోని ఒక కాలేజీలో క్రిమినాలజీ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఉంటాడు. నా అనేవారు ఎవరూ లేకున్నా కాలేజ్ పిల్లల్ని నయానో భయానో క్రమశిక్షణలో పెడుతూ ఆ కాలేజ్ మొత్తానికి తలలో నాలుకలాగా మెలుగుతూ ఉంటాడు. అదే కాలేజ్ లో హైదరాబాద్ నుంచి వచ్చి జాయిన్ అవుతుంది లక్కీ అలియాస్ మహాలక్ష్మి(నందితా శ్వేతా). తన తల్లి జానకి(రాశి), అమ్మమ్మ(అన్నపూర్ణమ్మ)ల గారాభం వలన పెంకి పిల్లగా పెరిగిన లక్కీ కాలేజ్ మొత్తాన్ని తన అల్లరితో అల్లాడిస్తూ ఉంటుంది. అయితే ఆమె వల్ల మిగతా పిల్లలు చెడిపోతున్నారు అని భావించి ఆమెను కంట్రోల్ లో పెట్టడానికి ట్రై చేస్తాడు. ఇక అదే సమయంలో అనూహ్యంగా లక్కీ మిస్ అవుతుంది. లక్కీ మిస్ అవడానికి నువ్వే కారణమని జానకి రాఘవ రెడ్డిని నిందిస్తుంది. దీంతో లక్కీని ట్రేస్ చేయడానికి రంగంలోకి దిగుతాడు రాఘవ రెడ్డి. అప్పుడే లక్కీ గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అయితే రాఘవ రెడ్డికి లక్కీకి లింక్ ఏంటి? రాఘవ రెడ్డిని జానకి ఏమని బెదిరించింది? ఎందుకు రాఘవ రెడ్డి తన భార్య పిల్లలకు దూరం అయ్యాడు? చివరికి రాఘవ రెడ్డి తన భార్య పిల్లలకి దగ్గరయ్యాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
నిజానికి ఈరోజుల్లో కమర్షియల్‌ సినిమాలను కూడా కొత్త రకమైన కంటెంట్‌ ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్‌ అందుకుంటున్నారు. డ్యూటీ కోసం ఫ్యామిలీని దూరం చేసుకుని బాధపడుతూ చివరికి ఆ ఫ్యామిలీని చేరుకున్న కథలతో చాలా సినిమాలు వచ్చాయి. `రాఘవరెడ్డి` సినిమా కూడా అదే కోవలో సాగుతుంది. నిజానికి లవ్ స్టోరీలు, కమర్షియల్ సినిమాల హడావుడిలో ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులవుతుంది. ఇక గ్యాప్‌ వచ్చినా, ఆడియన్స్ సెంటిమెంట్‌ని కనెక్ట్ అయ్యేలా సినిమా తెరకెక్కించడంలో రాఘవరెడ్డి మేకర్స్ మాత్రం సక్సెస్‌ అయ్యారు. కథ పాతదే అయినా, కొత్త ట్రీట్మెంట్ తో తెరకెక్కించారు. సినిమా మొదటి భాగం అంతా రాఘవరెడ్డి పాత్రని ఎస్టాబ్లిష్‌ చేయగా పాత్రకి ఎలివేషన్లు మాత్రం ఒక రేంజ్ లో ఇచ్చారు. హీరో పాత్ర ఒక పక్క కేసులను సాల్వ్ చేస్తూ మరోపక్క ప్రొఫేసర్‌గా ఉండటం ఆసక్తికరంగా మలిచారు. ఇక నందిత శ్వేత పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రౌడీ బేబీలా వ్యవహరిస్తూ చేసిన అల్లరి బాగుంటుంది. ఓ వైపు యాక్షన్‌, మరోవైపు ఫన్‌ తో అలరిస్తూ ఇంటర్వెల్‌ వరకు ఇలా సరదాగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు కథ మలిచి మరింత ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు. రాఘవరెడ్డి తన భార్యతో జరిగిన ఇబ్బంది వలన ఫ్యామిలీకి దూరం కావడం వంటి అంశాలు చూపించారు. కూతురుని చూడాలని అతను పడే తపన, బాధ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చూపారు. ఇక క్లైమాక్స్ కొంత రొటీన్ అనిపిస్తుంది, అలాగే సినిమా చాలా స్లోగా సాగడం కూడా కొంత ఇబ్బందికర అంశం. అయితే అనుభవం ఉన్న నటీనటులు ఉన్నా ఎందుకో పూర్తిస్థాయి నటన రాబట్టుకోడంలో దర్శకుడు సక్సెస్‌ కాలేదనిపిస్తుంది. దర్శకుడికి అనుభవం లేకనో ఏమో కానీ ల్యాగ్‌, స్లో నెరేషన్‌, ఒక్కోసారి లాజిక్‌ లెస్‌ సీన్లలా అనిపిస్తాయి. కొంత రొటీన్ అనిపించినా ఎమోషన్స్, సెంటిమెంట్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

నటీనటులు:
సినిమాలో రాఘవరెడ్డి అనే టైటిల్ పాత్రలో శివ కంఠంనేని ఇమిడిపోయారు. ఎలివేషన్ ఇవ్వగలిగే కటౌట్ తో అదరగొట్టాడు. ఒక పక్క ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టిస్తూనే మరోపక్క యాక్షన్ సీన్స్ లో అదరకొట్టారు. సెటిల్డ్ పెర్ఫర్మెన్స్ తో ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించారు. కొన్ని సీన్స్ లో అయితే వన్ మ్యాన్ షోలా అన్నీ తన భుజాన వేసుకుని నడిపించినట్టు అనిపించింది. ఇక చాలా రోజుల తర్వాత రాశీ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. లక్కీ పాత్రలో నందిత శ్వేత అదరగొట్టి అటు శివ కంఠంనేని ఇటు రాశీ ఇద్దరినీ డామినేట్‌ చేసింది. ప్రవీణ్‌, బిత్తిరి సత్తి, శ్రీనివాస్‌ రెడ్డి ఆకట్టుకున్నారు. అజయ్‌ ఘోష్‌, అజయ్‌ ఘోష్, పోసాని నెగటివ్‌ పాత్రలతో మెప్పించారు. ఇక టెక్నీకల్ టీం విషయానికి వస్తే సంజీవ్‌ మేగోటి దర్శకత్వం ఫర్వాలేదనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే పై దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. ఈ సినిమా మ్యూజిక్ ని దర్శకుడు సంజీవ్ మేగోటి .. సుధాకర్ మారియోతో కలిసి అందించగా స్పెషల్ సాంగ్‌ ఆకట్టుకుంటుంది. మిగతావి సోసో అనిపిస్తాయి. ఇక ఎస్‌ ఎన్‌ హరీష్‌ కెమెరా వర్క్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ఫైనల్లీ: కూతురి కోసం తండ్రి పడే ఆరాటమే ఈ రాఘవ రెడ్డి

Show comments