NTV Telugu Site icon

Big Brother Review: బిగ్ బ్రదర్ రివ్యూ

Big Brother Review

Big Brother Review

Big Brother Movie Review: టాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్, భోజ్ పురిలో అపజయమే లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గోసంగి సుబ్బ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ బ్రదర్ అనే సినిమా తెరకెక్కింది. శివ కంఠమ‌నేని, శ్రీసూర్య‌, ప్రియా హెగ్డే, ప్రీతీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కె.ఎస్.శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు ప్రొడ్యూస‌ర్లుగా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ: శివ(శివ కంఠమనేని)కి కుటుంబ‌మే స‌ర్వ‌స్వం. త‌న వాళ్ల కోసం ఎంత‌దూర‌మైన వెళ్లే రకం. అయితే అన్న కారణంగా శివ త‌మ్ముడు సూర్య మాత్రం అతి భ‌య‌స్తుడిగా పెరుగుతాడు. త‌న శ‌త్రువుల నుంచి త‌మ్ముడికి ఆప‌ద ఉండ‌టంతో అత‌డిని కంటికి రెప్పలా శివ కాపాడుకుంటూ వస్తాడు. సూర్య‌ను ఇంటి గ‌డ‌ప దాట‌కుండా చూడాలని అనుకుంటే సూర్య మాత్రం తన వదిన దుర్గ (ప్రియ హెగ్డే)కి అబ‌ద్దాలు చెప్పి బయటకు వెళ్తుంటాడు. పూజ (ప్రీతీ) అనే అమ్మాయి ప్రేమలో పడ్డ సూర్య కుటుంబ‌స‌భ్యుల అనుమ‌తితో ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటాడు. అయితే అనుకోకుండాసూర్య, ప్రీతిల మీద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్‌ విషయం తెలిసి వచ్చిన శివ, సూర్యతో కలిసి దాన్ని ఎదుర్కొంటాడు. అయితే ఇంతకీ పూజ ఎవరు? నిజంగానే ఆమె సూర్య‌ను ప్రేమించిందా? ఎంగేజ్మెంట్ జరిగినా పదేళ్లు పెళ్లి చేసుకోకుండా శివ ఎందుకు తన ప్రేయసికి దూరంగా ఉంటాడు? చివరకు సూర్య, పూజల ప్రేమ కథ ఏమైంది?ఏం అవుతుంది? అనేదే కథ.

విశ్లేషణ: అన్న‌ద‌మ్ముల ప్రేమ-అనుబంధాల నేపథ్యంలో గ‌తంలో టాలీవుడ్లో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి, వాటిలో కొన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ కూడా అయ్యాయి. కంటెంట్ ఓరియెంటడ్, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల ఒర‌వ‌డి పెర‌గ‌డంతో ఈ బ్ర‌ద‌ర్స్ సెంటిమెంట్ ఫార్ములా సినిమాలు త‌గ్గాయి. అయితే ఈ సినిమాతో అదే సెంటిమెంట్ ఫార్ములాను మళ్ళీ నమ్ముకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో న‌డిపించగా అందులోనే కామెడీ, సెంటిమెంట్‌ను రాబ‌ట్టుకున్నాడు. త‌ ఫ్యామిలీ సీన్స్ చాలా వ‌ర‌కు రొటీన్‌గానే ఉండడంతో పాటు నాచురాలిటీ మిస్స‌యిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండాఫ్‌ అంతా ఫ్లాష్ బ్యాక్‌లో సాగుతుంది. సూర్య, ప్రీతీ మ‌ధ్య సీన్స్‌ రొమాంటిక్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో తమ్ముడి ప్రేమను గెలిపించేందుకు శివ చేస యాక్ష‌న్ ఎపిసోడ్‌ ఆకట్టుకుంది. అయితే ఈక‌థను నేటి ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా న‌డిపించ‌డంలో కొంత ద‌ర్శ‌కుడు పూర్తిస్థాయిలో సఫలం కాలేదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే బిగ్ బ్ర‌ద‌ర్ శివ పాత్ర‌లో శివ కంఠమనేని అన్ని ఎమోషన్స్‌ను పండిస్తోనే మరోపక్క యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. ల‌వ‌ర్‌బాయ్‌గా, అతి భ‌య‌స్తుడిగా శ్రీ సూర్య న‌ట‌న కూడా బాగుంది. గౌరి పాత్రలో ప్రియ హెగ్డే, పూజ కారెక్టర్‌లో ప్రీతి గ్లామరస్‌గా క‌నిపిస్తూనే పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సినిమాలో సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. అయితే పాటలు చూడటానికి బాగున్నప్పటికీ సంగీత పరంగా గుర్తిండిపోయేలా మాత్రం లేవు. కెమెరా సినిమా స్థాయికి తగ్గట్లు ఉంది. నిడివి విషయంలో ఎడిటర్ పనితనం కనిపించింది.

ఫైనల్‌గా బిగ్‌ బ్రదర్‌ సెంటిమెంట్ జానర్ ఇష్టపడేవారికి నచ్చొచ్చు.