NTV Telugu Site icon

Chinna Review: చిన్నా రివ్యూ

Chinna Review

Chinna Review

Chinna Movie Review: సిద్దార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ చిన్నా. తమిళ, మలయాళ, కన్నడ భాషలలో సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం కాస్త లేటుగా అక్టోబర్ ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తన జీవితంలో చేసిన అత్యంత బెస్ట్ మూవీ అని ప్రమోషన్స్ లో సిద్ధార్థ చెప్పుకుంటున్న ఈ సినిమాను తెలుగు మీడియా కోసం ముందే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం

చిన్నా కథ ఏమిటంటే:
తెలంగాణలోని యాదాద్రి అనే పట్టణంలో ఒక మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఈశ్వర్ అలియాస్ చిన్న(సిద్దార్థ్). ఉదయాన్నే లేవడం పారిశుద్ధ్య కార్మికుల హాజరు తీసుకోవడం, తన అన్న కూతురు చిట్టి/ సుందరిని స్కూల్ లో దించి ఆఫీస్ కి వెళ్లి మళ్లీ ఆమెని స్కూల్ నుండి తీసుకు రావడమే అతని దినచర్య. అప్పుడప్పుడూ ఎస్సై అయిన తన స్నేహితుడితో కలిసి టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కాలేజీలో ఉన్నప్పుడు తాను లవ్ చేసిన అమ్మాయి శక్తి( నిమిషా సజయన్) పారిశుద్ధ్య కార్మికురాలిగా జాయిన్ అవుతుంది. ఆమెతో ప్రేమను మళ్లీ మొదలు పెట్టి లైఫ్ సాఫీగా సాగిపోతోంది అన్న సమయంలో ఎస్సై స్నేహితుడి మేనకోడలు రేప్ కు గురవుతుంది. ఆ రేప్ చేసింది చిన్నా అని భావించి ఎస్సై సహా అతని కుటుంబం చిన్నా మీద దాడి చేస్తుంది. అయితే అదే సమయానికి చిట్టి మిస్ అవుతుంది. అసలు ఎస్సై మేనకోడలు మున్నీని రేప్ చేసింది చిన్నా ఏనా? చిట్టి ఎలా మిస్ అయింది? చిట్టిని ఎవరైనా రేప్ చేశారా? చిట్టి చివరికి దొరికిందా? లేదా? చిన్నా మీద పడ్డ రేప్ ఆరోపణలలో నిజమెంత? అనేవి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

చిన్నా విశ్లేషణ:
సిద్దార్థ్ తన కెరీర్ లో ఇంతకన్నా మంచి సినిమా చేయలేనని ప్రమోషన్స్ లో చెప్పడంతో ఈ సినిమా మీద అందరిలో అంచనాలు మొదలయ్యాయి. నిజానికి ఈ సినిమా కథ కొత్తది ఏమీ కాదు కమల్ హాసన్ మహానది, సాయి పల్లవి గార్గి సినిమాలో చూపించిన చైల్డ్ అబ్యూజ్ ను ప్రధాన అంశంగా ఎంచుకున్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితంలో అనుకోకుండా ఒక కుదుపు ఏర్పడితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? అనే విషయాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ముక్కుపచ్చలారని మైనర్ బాలికలు వరుసగా రేప్ కు గురవుతూ, శవాలుగా తేలుతుంటే ఏమీ చేయలేని వారిని ట్రేస్ చేయలేని పరిస్థితులు ఏర్పడితే హీరో అండ్ కో వారి కోసం ఏం చేశారు ? మిస్ అయిన తన అన్న కుమార్తెను సిద్దార్థ్ ఎలా తిరిగి దక్కించుకున్నాడు? తన మీద పడ్డ మరకను ఎలా తుడుచుకున్నాడు? అనే విషయాలను చాలా కన్విన్సింగ్ గా తెరకెక్కించి ప్రేక్షకులను అలోచింప చేశాడు. నిజానికి పిల్లలు అన్నం తినడం లేదనో ఇంకా ఏవేవో కారణాలతోనో వారికి ఫోన్లు ఇచ్చి అలవాటు చేస్తున్నారు. అలా చేయడం ఎంత ప్రమాదకరమో? పిల్లలకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ లాంటివి తెలుపకుండా ఉంటే ఎలాంటి స్థితికి దారి తీస్తుంది అనే విషయాలు చాలా కటువుగా చూపించారు. నిజానికి చైల్డ్ అబ్యూజ్ లాంటివి జరిగినప్పుడు చేసిన వాళ్ళ మీద బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు సభ్య సమాజం కూడా తీవ్రమైన ద్వేషం కనబరుస్తారు, వీలైతే చంపాలి అన్నంత కోపాన్ని చూపిస్తారు. కానీ బాధితులు పక్కన ఉండి వారికి ధైర్యం చెప్పాలి, ఏం జరిగినా పర్లేదు మీకు మేం అండగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేయక పోవడాన్ని ప్రశ్చించిన పాయింట్ సినిమాకి హైలైట్. ఇక ఇంట్లో మామలు, బాబాయిలు కూడా ప్రమాద కరమే అని హెచ్చరిస్తూనే బయటి వారితో ఎలా మెలగాలి అనే విషయాన్ని చిన్న పిల్లలకి నేర్పాల్సిన విషయాన్నీ సినిమా ప్రధానంగా డిస్కస్ చేసింది.. రొటీన్ కథ, కథనాలు అయినా తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పరచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఎవరెలా చేశారంటే
ముందుగా నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ఈశ్వర్ అలియాస్ చిన్నా అనే సాధారణ మధ్య తరగతి కుర్రాడిగా సిద్దార్థ్ జీవించాడు.ఈశ్వర్ మీద అనుమానం వచ్చినప్పుడు అతని చుట్టూ ఉండే పాత్రలలో మార్పు, వాటికి అతను ఎలా స్పందిస్తాడు అనే సీన్స్ సిద్ధార్థ్‌లోని నటుడిని కళ్ళకు కట్టినట్టు చూపించింది. అతని ప్రేయసి పాత్రలో నిమిషా సజయన్ అయితే సిద్దార్థ్ తో పోటాపోటీగా నటించింది. కమర్షియల్ హీరోయిన్లు చేయలేని, అసలు కలలో కూడా ఊహించని పాత్రలో ఆమె మెరిసింది. ఇక సిద్దార్థ్ వదిన పాత్రలో అంజలి నాయర్ నటన చాలా బాగుంది. చిన్నారి చిట్టి పాత్రలో సహజ శ్రీ నటన చాలా సహజంగా ఉంది. ఎస్సై, చిన్నా స్నేహితుడి పాత్రలో నటించిన వారు సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దర్శకుడు అరుణ్ కుమార్ అందరికీ తెలిసిన కథను తనదైన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. హీరోయిజం చూపడం కంటే సీరియస్ ఇష్యూను అంతే సీరియస్ గా రియలిస్టిక్ గా చూపే ప్రయత్నం చేసి కొంత వడకు సఫలం అయ్యాడు. ఇక సినిమాలో పాటలు అంతగా కనెక్ట్ అయ్యేవి లేకున్నా విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్ క్రియేట్ చేయడంలో బాగా ఉపయోగపడింది. అలాగే సినిమాటోగ్రాఫర్ బాలాజీ సుబ్రమణ్యం ఫ్రేమ్‌లు బాగున్నాయి. సిద్ధార్థ్ నిర్మాణ విలువలు సినిమాకి తగినట్టు ఉన్నాయి.

ఫైనల్లీ చిన్నా సినిమా సిద్దార్థ్ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ఒక హార్డ్ హిట్టింగ్ మూవీ.. మంచి సందేశంతో ఆలోచింప చేసే సినిమా.
Chinna Movie Rating

Show comments