NTV Telugu Site icon

Shikaaru Review: షికారు

Shikaru

Shikaru

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ అనే ముసుగులో డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ కామెడీతో కొన్ని సినిమాలు జనం ముందుకు వచ్చేస్తున్నాయి. సినిమా అనేది వినోదం అందించకపోయినా… కనీసం సమాజాన్ని చెడగొట్టేదిగా ఉండకూడదనే ఇంగితం దర్శక నిర్మాతల్లో కొరవడటమే దీనికి కారణం. పెట్టిన పెట్టుబడికి తగ్గ లాభం పొందటం కోసం చీప్ కంటెంట్ తో సినిమాలను తీసి ప్రేక్షకుల మీదకు వదలడమనేది ధనార్జన కోసం వైన్ షాపులను నిర్వహించడంతో సమానం. అది చట్టబద్ధంగా జరిగే వ్యాపారమే అయినా… దాని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ తరహా సినిమాల వల్ల యువత బుర్ర చెడిపోతుంది. ఆ కోవకు చెందిందే ‘షికారు’ మూవీ.

దీపిక (సాయి ధన్సిక) పెళ్ళైన అమ్మాయి. ఆమె భర్త నరసింహ (కన్నడ కిశోర్) పోలీస్ ఆఫీసర్. భార్యకు శారీరక సుఖం ఇవ్వని నరసింహా చాలా రూడ్ గా ఆమెతో ప్రవర్తిస్తుంటాడు. భర్తకు తెలియకుండా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న దీపికకు ఒక రోజు బాబీ (అభినవ్) అనే కుర్రాడు పరిచయమవుతాడు. ఆ తర్వాత అతను ఉద్యోగ నిమిత్తం స్నేహితులతో కలిసి సిటీకి వచ్చిన తర్వాత దీపికను కలుస్తాడు. భర్త ఇంటిలో లేని సమయంలో బాబీని రమ్మని దీపిక చెబుతుంది. తీరా అతను వచ్చిన కొద్దిసేపటికే భర్త డ్యూటీ నుండి హఠాత్తుగా ఇంటికి వస్తాడు. పోలీస్ ఆఫీసర్ ఇంటిలో చిక్కుకుపోయిన బాబీ పరిస్థితి ఏమిటీ? అతను ఆ ఇంటి నుండి బయటకు రావడానికి మిగిలిన ముగ్గురు స్నేహితులు ఏం చేశారు? ఈ సమయంలో సీఐ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి హంగామా చేశారు? భార్యను సరిగా అర్థం చేసుకోలేకపోయిన నరసింహలో చివరకు ఎలాంటి మార్పు వచ్చింది? అన్నది మిగతా సినిమా.

ఈ సినిమాకు ‘షికారు’ అనే పేరు సరదాగా పెట్టిందే కానీ స్టోరీకీ, టైటిల్ కు సంబంధం లేదు. పెళ్ళి అయిన మహిళల జోలుకు వస్తే ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో చూపించే ప్రయత్నం దర్శకుడు హరి కోలగాని చేశాడు. అయితే ఆ క్రమంలో మహిళల పట్ల ఎలాంటి గౌరవం లేనట్టు చాలా సన్నివేశాలను చిత్రీకరించాడు. మరీ ముఖ్యంగా ఓ గ్రామంలోని మహిళలంతా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళుగా చూపించాడు. చమ్మక్ చంద్ర నటించిన ఆ ఎపిసోడ్ మొత్తం పరమ జుగుప్సాకరంగా ఉంది. ఇక హీరోలలో ఒకరిని బాలకృష్ణ ఫ్యాన్ గా చూపించారు. అతని ద్వారా బాలయ్య బాబు డైలాగ్స్ ను చెప్పించి, థియేటర్ లో విజిల్స్ పడేలా చేశాడు. ఓరకంగా నందమూరి ఫ్యాన్స్ ను అలా బుట్టలో వేసుకున్నాడు. దానికి పోసాని క్యారెక్టర్ కూడా సహకరించడం విశేషం. ‘బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇలా ప్రవర్తించకూడదు’ అంటూ ఓ పక్క వారిస్తూ ఆ పాత్ర సాగడం బాగానే ఉంది. హీరో, అతని స్నేహితులుగా నటించిన వారు తప్ప మిగిలిన ఆర్టిస్టులంతా మంచి పేరున్న వారే.

‘అరవాన్’, ‘పరదేశీ’, ‘కబాలి’ వంటి చిత్రాలలో చక్కటి నటన కనబరిచి అందరిలో గుర్తింపు పొందిన సాయి ధన్సిక ‘షికారు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిందనగానే సహజంగానే ఈ మూవీకి ఓ సరికొత్త బజ్ క్రియేట్ అయ్యింది. కానీ ఆమె కోరుకోవాలే కానీ ఇంతకంటే మంచి పాత్రలు తెలుగులో దొరికి ఉండేవి. కన్నడ కిశోర్, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మక్ చంద్ర, పోసాని, అన్నపూర్ణ, సురేఖావాణి, సమ్మెట గాంధీ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. శేఖర్ చంద్ర సంగీతం, శ్యాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఆరువందలకు పైగా సినిమాలను పంపిణీ చేసిన పి.ఎస్.ఆర్. కుమార్ (వైజాగ్ బాబ్జీ) నిర్మించిన ఈ సినిమాతో హరి కొలగాని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘జబర్దస్త్’ షో చేసిన అనుభవం ఉన్న హరి ఆ అనుభవాన్నే సినిమాలోనూ ఉపయోగించాడు. కాకపోతే చివరిలో చిన్న సందేశంతో శుభం కార్డు వేశాడు. ఈ తరహా సినిమాలు గతంలో చాలానే వచ్చాయి కాబట్టి, ప్రేక్షకులు ఏ రకంగానూ దీనితో కనెక్ట్ కారు. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులను పెట్టుకున్న నిర్మాత ఓ మంచి కథను కూడా ఎంపిక చేసుకుని ఉంటే గౌరవంగా ఉండేది.

ప్లస్ పాయింట్స్
యువతకు నచ్చే అంశాలు ఉండటం
శేఖర్ చంద్ర స్వరాలు, నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్
చికాకు తెప్పించే అడల్ట్ కంటెంట్
ఆసక్తి కలిగించని కథనం

ట్యాగ్ లైన్: బేకారు..!!

రేటింగ్: 2 / 5