NTV Telugu Site icon

Shaitan Review: సైతాన్ (వెబ్ సిరీస్)

Shaithan

Shaithan

Shaitan Review: ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఎంతగా ట్రోల్ కి గురయిందో అంతకు ముందు ఓ రోజు ముందుగా ఓటీటీలో వచ్చిన ‘సైతాన్’ వెబ్ సీరీస్’ సైతం విమర్శల పాలయింది. ఇక గతంలో ‘పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి చిత్రాలతో పాటు ‘సేవ్ టైగర్స్’ వంటి ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన వెబ్ సీరీస్ నిర్మించిన దర్శకుడు మహి వి రాఘవ దర్శకత్వం వహించిన వెబ్ సీరీస్ ఇది. ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో
15న విడుదలైన ఈ సీరస్ లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ట్రైలర్ చూసినపుడే ఇది అడల్ట్ కంటెంట్ ఉన్న సీరీస్ అని అర్థం అయింది. దీనికి తగ్గట్లే ఉందీ సీరీస్. మరి ఈ సీరీస్ కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం.

కథ విషయానికి వస్తే 90లలో నక్సలైట్స్, పోలీసులకు మధ్య జరిగిన పోరు… అందులో పొలిటికల్ ఇన్ వాల్వ్ మెంట్ చుట్టూ ఈ ‘సైతాన్’ వెబ్ సిరీస్ తిరుగుతుంది. సావితి (షెల్లి)కి ముగ్గురు సంతానం. భర్త వదిలేసిన సావిత్రి పిల్లలు బాలి (రిషి), జయప్రద (దివియాని శర్మ), గుమతి (జాఫర్ సాదిఖ్)ను పోషించుకోవడానికి పోలీసు అధికారికి ఉంపుడుకత్తెగా ఉంటుంది. దాంతో సొసైటీ సావిత్రిపై వ్యభిచారి ముద్రవేసి చిన్నచూపు చూస్తుంటుంది. ఆ అవమానాల మధ్య పెరిగి, పెద్దైన బాలి పరిస్థితుల ప్రభావంతో నేరస్తుడిగా మారతాడు. ఆపై నక్సలైట్లలో చేరతాడు. అది అతడి కుటుంబంపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? తద్వారా వచ్చే సమస్యలు… వాటి పర్యవసానాలు ఏమిటన్నదే ఈ ‘సైతాన్’ సీరీస్.

నక్సలైట్లు, పోలీసుల పోరు.. పొలిటీషియన్స్ ఇన్ వాల్వ్ మెంట్ తో సినిమాలు గతంలోనూ వచ్చాయి. అయితే ఈ కథను తెరకెక్కించిన తీరు తప్పకుండా ఆకట్టుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ చూసే వారికి బూతు డైలాగ్స్, అడల్ట్ సీన్స్ ఇబ్బందికరం అనిపిస్తుంది. నిజానికి వాటి జోలికి వెళ్ళకుండానే కథలో ఉన్న పాత్రల బతుకు పోరాటంను హైలైట్ చేయవచ్చు. ఎందుకో దర్శకుడు మహి వి రాఘవ కసితో బూతును చొప్పించినట్లు అనిపిస్తుంది. తను తీసిన సినిమాలకు ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా రావలసినంత హైప్ రాలేదనే ఆవేదనతో తను ఓటీటీలలో ఉన్న ఫ్రీడమ్ ను అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ సీరీస్ తెరకెక్కించినట్లు భావించాలి. తను ఇంటర్వ్యూలలో కూడా ఓటీటీలలో ఉండే ఫ్రీడమ్ కి సంకెళ్లు వేస్తారా? అని ప్రశ్నించటం మనం గమనించవచ్చు.
బాలి పాత్రలో రిషి జీవించాడు. ఆ పాత్ర తీరుతెన్నులు ఔపాసపట్టినట్లు అనిపించింది. కొన్ని క్లోజప్ షాట్స్ మినహాయిస్తే బాలి పాత్రకు పర్‌ఫెక్టుగా ఫిట్ అయ్యాడు. ఇక స్టేజ్ ఆర్టిస్ట్ రవి కాలె కూడా తను పోషించిన ఇన్ స్పెక్టర్ పాత్రకు న్యాయం చేశాడు. ఇతర పాత్ర ధారులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఒక మనిషి తన జీవితంలో ఎదురైన సంఘటనలకు కఠినుడిగా మారి నేరాలవైపు ఎలా మొగ్గు చూపాడు? ఏ తోడు లేని మహిళను అంగడి సరుకు అని భావించి వేధిస్తే తను పాషాణంలా ఎలా మారుతుంది? ఎలాంటి పరిస్థితుల్లో పోలీస్ లకు, నక్సలైట్స్ కు మధ్య దోస్తీ కుదురుతుంది తదితర అంశాలను దర్శకుడు ప్రజెంట్ చేసిన విధానం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఇంతకు ముందు వచ్చిన పలు సినిమాల్లోలాగే ఇందులో కూడా నక్సలైట్ల ఐడియాలజీ, సిద్ధాంతాలను సరైన విధంగా ఫోకస్ చేసినట్లు అనిపించదు.

సమాజంలో జరిగిన సంఘటనలు, వాటి పరిణామాలను కథాంశంగా ఎంచుకున్న మహి వి రాఘవ వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించటంలో సక్సెస్ అయినప్పటికీ బాధితులే అడవి బాట పడుతున్నారని హైలైట్ చేశారు తప్ప ఉద్యమం, దాని గొప్పతనంను చూపించలేక పోయారు. అంతే కాదు నక్సలైట్ నాయకులను అవనీతి పరులుగా చూపించటం కూడా అంతగా మెప్పించదు. శ్రీరామ్ మద్దూరి నేపథ్య సంగీతం, షణ్ముగ సుందరం సినిమాటోగ్రఫి కథను బాగా ఎలివేట్ చేశాయని చెప్పాలి. అన్ని ఎపిసోడ్స్ 30 నిమిషాలలోపే ఉండటం కలసివచ్చే అంశం. సైతాన్ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ బూతుల కారణంగా ఫ్యామిలీ మొత్తం కలసి చూసే పరిస్థితి లేకుండా చేశారు. నిజానికి బూతులు, అడల్ట్ సీన్స్ లేకుండా కూడా ఈ సీరీస్ ని ఆసక్తికరంగా మలచవచ్చు. మహి వి రాఘవ దీనిని దృష్టిలో పెట్టుకుని తన తదుపరి ప్రాజెక్ట్ లను తీస్తారని ఆశిద్దాం.

ప్లస్ పాయింట్స్
కథ, కథనం
నటీనటులు నటన
మహివి రాఘవ దర్శకత్వం

మైనస్ పాయింట్స్
శ్రుతి మించిన బూతులు
అడల్ట్ సీన్స్

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: గతితప్పిన ‘సైతాన్’