Saranga Dariya Movie Review : రాజా రవీంద్ర కీలక పాత్రలో నటించిన సినిమా సారంగదరియా. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ ‘సారంగదరియా’ సినిమాను జూలై 12న భారతీయుడు 2 సినిమా రిలీజ్ అవుతున్నా వెనక్కు తగ్గకుండా రిలీజ్ చేయడంతో ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. రాజా రవీంద్రతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంత బాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు నటించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
విశాఖపట్నంలో కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీని భార్య సర్దుబాటుతనం సాయంతో నడుపుతూ ఉంటాడు. ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉండగా పెద్ద కొడుకు అర్జున్(మోయిన్) రోజూ తాగుతూనే ఉంటాడు. కూతురు అను(యశస్విని) ఇంట్లో దించిన తల కాలేజ్ లో అక్కడ దించిన తల ఇంట్లోనే ఎత్తేలా పద్ధతైన అమ్మాయి. అయితే ఆమె వెంట రాజ్(శివచందు) ప్రేమ అంటూ పడుతుంటాడు. చిన్నవాడు సాయి(మోహిత్) ప్లే బాయ్ టైప్. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ రొమాంటిక్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. పెద్దబ్బాయి తాగుడు, చిన్నవాడు అల్లరి, కూతురు పెద్దదైందా లేదా అంటూ ఇరుగుపొరుగువాళ్ల ఆరాలతో మనశ్శాంతి లేక సత్యనారాయణ వ్రతం చేస్తుండగా రాజ్ తండ్రి వచ్చి పెద్ద గొడవ చేసి అనుకి సంబంధించిన ఒక కీలక విషయం బయట పెడతాడు. ఇన్నాళ్లు ఆ కుటుంబం అంతా అను విషయంలో దాచిన ఆ రహస్యమేంటి? మోడల్‌గా రాణించాలనుకునే అను ఏం చేసింది? ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది? అర్జున్ ఎందుకు తాగుబోతు అయ్యాడు? లవర్ కోసం సాయి చేసిన పని ఏంటి? అసలు ఈ కుటుంబం ఈ సమస్యల నుంచి బయటపడిందా? లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:సినిమా మొదలయ్యాక ఇదేదో రొటీన్ ఫ్యామిలీ మెలో డ్రామా, యూత్ కోసం కొన్ని కామెడీ సీన్స్ తో నడిపిస్తారు అనిపించింది. కానీ నెమ్మదిగా కథలోకి వెళ్లే కొద్దీ సమాజంలో ఈరోజు ముఖ్యంగా తెరమీదకు వచ్చిన ఒక కీలకమైన అంశాన్ని డిస్కస్ చేశాడు దర్శకుడు. నిజానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని కష్టాలను విభిన్న కోణంలో చూపించేలా సినిమా కథ రాసుకున్నాడు డైరెక్టర్. సినిమాలో కులం, మతం సహా లింగమార్పిడి ప్రస్తావన ఉంది. అలాగే అమ్మాయి మోడల్‌గా ఎదగాలనుకునే ఒక ఇన్‌స్పిరేషనల్ స్టోరీ, కన్నపిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్లే ఏమి చేయడానికి అయినా రెడీ అయ్యే తల్లిదండ్రుల ఆవేదన ఉంది. నిజానికి ఇన్ని విషయాలను ఒక సినిమాలో జొప్పించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది కత్తిమీద సాములాంటి విషయమే. కానీ దర్శకుడు పండు తొలి సినిమాతోనే దాన్ని కామెడీతో నవ్విస్తూ డైలాగులతో ఆలోచింప చేస్తూ చెప్పే ప్రయత్నం చేయడం బాగుంది. ఒక పక్క ఎమోషన్స్ పండిస్తూనే మంచి సందేశాన్ని ఇవ్వడం ఈ సినిమాకి ప్లస్. నిజానికి ఈరోజుల్లో ఆడియన్స్ సందేశాత్మక సినిమాలు చూసేందుకు ఆసక్తిగా లేరు. అదేకావాలటే మోటివేషనల్ వీడియోస్ చూస్తాం కదా సినిమానే ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఏదైనా ఎంటర్‌టైనింగ్‌గా చెబితే, కమర్షియల్‌గా చూపించగలిగితేనే చూస్తున్నారు. ఈ క్రమంలో తానూ చెప్పాలనుకున్న పాయింట్స్ ను కమర్షియల్ వేలో కవితాత్మకముగా చూపించే ప్రయత్నం చేశారు, ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయింది సినిమా టీం.
నటీనటుల విషయానికి వస్తే కృష్ణ కుమార్ పాత్రలో రాజా రవీంద్ర చాలా బాగా చేశాడు. ఇప్పటి వరకు నెగటివ్ రోల్స్, కామెడీ రోల్స్ చేసిన ఆయనకు ఈ సినిమాలూ ఎమోషనల్ రోల్ పడింది. సినిమాని లీడ్ గా తన భుజాలపై మోశారు. ఈ సినిమాలో ఆయన తరువాత మాట్లాడు కోవలసింది మోహిత్ గురించి. సాయి పాత్రలో మోహిత్ లీనమైపోయాడు. ప్లేబాయ్ తరహా పాత్రలో మెరిశాడు. అర్జున్ పాత్రలో మెయిన్ మొహమ్మద్ చాలా నేచురల్‌గా చేశాడు. నటించినట్టు అనిపించకుండా పాత్రలో మునిగిపోయాడు. అను పాత్రలో యశస్విని తనదైన అందంతో ఆకట్టుకుంది. ఫాతిమాగా మధులత, రాజ్ పాత్రలో శివ, కృష్ణకుమార్ భార్యగా నీల ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. టెక్నీషియన్ల విషయానికి వస్తే ఎబెనెజర్ పాల్ మ్యూజిక్ సెట్ అయింది. పాటలు బాగున్నాయి, బీజీఎం చాలా చోట్ల సీన్స్ ను ఎలివేట్ చేసింది. సిద్ధార్థ స్వయంభు కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా, రిచ్‌గా కనిపించేలా ఉంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో డైలాగ్‌లు హైలైట్, ఏదేదో ట్రై చేయకుండా నేచురల్ గా మాటలు రాశారు. లింగమార్పిడి వంటి సెన్సిటివ్ ఇష్యూని నొప్పించకుండా చెప్పిన తీరు బాగుంది.
ఫైనల్లీ సారంగదరియా ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్.. కొన్ని లోపాలు పక్కన పెడితే ఒక సారి చూసేయొచ్చు.