NTV Telugu Site icon

Prema Vimanam Review: ప్రేమ విమానం రివ్యూ

Prema Vimanam Review

Prema Vimanam Review

Prema Vimanam Review: సంగీత్ శోభన్ అనే పేరు ఈ మధ్య తెలుగులో ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన మాడ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఆయన హీరోగా శాన్వీ మేఘన హీరోయిన్ గా నిర్మాత అభిషేక్ నామా కొడుకులు దేవాన్ష్, అనిరుధ్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటించిన ‘ప్రేమ విమానం’ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? సంగీత్ శోభన్ కి మరో హిట్ దొరికిందా? అనేది తెలియాలంటే సినిమా రివ్యూ మొత్తం చదవాల్సిందే.

కథ:
ఈ కథ అంతా 90లలో జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ శివారు మేడిపల్లి అనే ఊరిలో వ్యవసాయం చేసుకునే భార్యాభర్తలు(రవి వర్మ- అనసూయ)లకు ఇద్దరు కుమారులు రామ్(దేవాన్ష్)), లక్ష్మణ్(అనిరుధ్). తన స్నేహితుడు విమానంలో ప్రయాణించాడు అని తెలిసి తాము కూడా విమానంలో ప్రయాణించాలనే కోరిక బలంగా నాటుకుపోతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో ఉన్నాం మన కుటుంబం వల్ల అవుతుందా? లేదా? అని కూడా తెలియని వయసు వారిది. మరోపక్క మరో ఊరిలో మణి (సంగీత్ శోభన్) తండ్రి (గోపరాజు రమణ)ది పల్లెటూరిలో చిన్న కిరాణా కొట్టు. దుబాయి వెళ్లి ఉద్యోగం చేయమని తండ్రి చెబుతున్నా వినకుండా అక్కడే ఉండి ఊరి సర్పంచ్ కుమార్తె అభిత (శాన్వీ మేఘన)తో ప్రేమలో పడతాడు. పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరని ఇద్దరూ దుబాయ్ వెళ్ళడానికి సిద్ధమవుతారు. మరోపక్క రామ్-లక్ష్మణ్ ఇద్దరూ విమానం ఎక్కాలని బయలుదేరి హైదరాబాద్ వచ్చి కిడ్నాపర్ల చేతికి చిక్కుతారు. అలా దుబాయ్ వెళ్ళడానికి హైదరాబాద్ వచ్చిన మణి, అభితలకు లచ్చు, రాము ఎలా కలిశారు? చివరికి మణి, అభిత దుబాయ్ వెళ్ళారా? లచ్చు, రాము విమానం ఎక్కారా? అసలు ఈ కథకు ప్రేమ విమానం టైటిల్ ఎలా వచ్చింది. అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ: ఈ మధ్య కాలంలో పీడియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటి కధలను కాకుండా ఎప్పుడో జరిగిన కథలు చెప్పేందుకు ఇష్టపడుతున్నారు. అలా `ప్రేమ విమానం` కూడా అదే ఫార్మాట్ లో తెరకెక్కించారు. ఓ వైపు పల్లెటూరి చిన్నపిల్లలు విమానం ఎక్కాలనే కోరిక, మరో ఊరిలో ఓ ప్రేమ జంట ప్రేమను పారలల్‌గా ఆవిష్కరిస్తూనే వచ్చి ఒక ఫన్‌ -ఎమోషనల్‌ రైడ్‌లా ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేయడంలో కొంత సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా మొదటి భాగం అంతా పాత్రలను ఎస్టాబ్లిష్‌ చేయడానికి ఎక్కువ డెప్త్ తీసుకు వెళ్లడంతో కొంత బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక పక్క అనసూయ కుటుంబ స్థితిని ఆవిష్కరిస్తూనే తన పిల్లలు విమానం ఎక్కాలనే కోరికని చూపించి ఎమోషనల్ చేస్తూనే విమానానికి సంబంధించిన అనేక డౌట్లని వెన్నెల కిషోర్‌ని అడుగుతూ ఫన్ జనరేట్ చేశారు. సెకండాఫ్‌లో పిల్లలు విమానం ఎక్కడం కోసం పారిపోవడం, ప్రేమ జంట ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ రావడం ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ట్విస్ట్ లు అన్నీ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తాయి. ఫన్ బాగానే వర్కౌట్ అయినా ఎమోషన్స్ మాత్రం పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. కామెడీ కూడా రొటీన్‌గా అనిపిస్తుంది. సినిమా ఊహించేలా ఉండడం కొంత మైనస్. `విమానం`కథకి లవ్‌ స్టోరీని యాడ్‌ చేసి ప్రేమ విమానంగా మలిచినట్టు అనిపిస్తుంది. ఫైనల్‌ ట్విస్ట్ బాగున్నా ఏదో వెలితి మాత్రం ఉండిపోతుంది. ఇక

నటీనటుల విషయానికి వస్తే సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ బాగుంటుంది, కానీ ‘ప్రేమ విమానం’లో ప్రేమికుడిగా ఎందుకో గిరిగీసుకుని ఆ పాత్ర వరకు న్యాయం చేశారు. శాన్వీ మేఘన నటనలోనూ, అందంలోనూ ఆకట్టుకుంది. గ్లామర్ లేకుండా పూర్తిగా నటన మీద ఫోకస్ పెట్టి అనసూయ ఆకట్టుకుంది. బాల నటులు దేవాన్ష్, అనిరుధ్ ఇద్దరూ అలరించినా అనిరుధ్ టైమింగ్ బాగుంది. ‘వెన్నెల’ కిశోర్ కామెడీ కోసమే ఉన్నా పూర్తిగా వర్కౌట్ కాలేదు. హీరో స్నేహితుడిగా అభయ్ బేతిగంటి, తల్లి తండ్రులుగా సురభి ప్రభావతి, గోపరాజు రమణ… హీరోయిన్ తల్లి తండ్రులుగా కల్పలత, సుప్రీత్ తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదు అనిపించారు.

ఫైనల్లీ: ‘ప్రేమ విమానం’ కథ పరంగా కొత్తదనం లేకున్నా ఒక ఎమోషనల్ ఫన్ రైడ్ లాంటి మూవీ..

Show comments