NTV Telugu Site icon

RunWay 34 Review: రన్ వే 34 (హిందీ)

Runway

Runway

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్, కన్నడ కథానాయకుడు సుదీప్ మధ్య భాషా వివాదం గత కొద్దిరోజులుగా రావణ కాష్టం మాదిరి రగులుతూ ఉంది. హిందీ జాతీయ భాష అని పొరపాటున నోరు జారిన అజయ్ దేవ్ గన్ దానికి భారీ మూల్యమే చెల్లించుకుంటున్నాడు. కన్నడ చిత్రసీమ మాత్రమే కాదు.. రాజకీయ నేతలు అజయ్ దేవ్ గన్ అజ్ఞానాన్ని ఎండగడుతున్నారు. దక్షిణ భారతీయులలోనూ ఇప్పుడు భాషాభిమానం పెల్లుబికుతోంది. అజయ్ దేవ్ గన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నీ తానై అజయ్ దేవ్ గన్ రూపొందించిన ‘రన్ వే 34’ చిత్రం జనం ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో సేఫ్ గా లాండ్ అయ్యిందో లేదో తెలుసుకుందాం.

నైట్ పార్టీ బలహీనత ఉన్న కెప్టెన్ విక్రాంత్ ఖన్నా (అజయ్ దేవ్ గన్) రాత్రంతా ఫుల్ పార్టీ చేసుకుని ఆ మర్నాడే దుబాయ్ నుండి కొచ్చికి వచ్చే విమానాన్ని నడపడానికి సిద్ధపడతాడు. అతనితో పాటు కో-పైలెట్ గా తన్యా అల్బుకెర్కీ (రకుల్ ప్రీత్ సింగ్) ఉంటుంది. విమానం సక్రమంగా బయలుదేరినా అది కొచ్చిలో లాండ్ అయ్యే సమయానికి వాతావరణం దారుణంగా మారిపోతోంది. దాంతో కొచ్చిలో కాకుండా తిరువనంతపురంలో ఫ్లయిట్ ను ల్యాండ్ చేస్తారు. నిజానికి అక్కడ కూడా వాతావరణం ఏమంత అనుకూలంగా ఉండదు. బెంగళూర్ లో లాండ్ చేస్తే బెటర్ అని తెలిసినా, మొండిగా తన నిర్ణయమే కరెక్ట్ అని విక్రాంత్ భావిస్తాడు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకున్న ప్రయాణీకులు ఈ ఆపద నుండి ఎట్టకేలకు సురక్షితంగా బయట పడతారు, ఒక్కరు తప్ప! ప్రాణాలు కాపాడి పునర్ జన్మ ప్రసాదించినందుకు వారంతా పైలట్ విక్రాంత్ ను హీరోలా ట్రీట్ చేస్తారు. కానీ నియమాలను ఉల్లంఘించి విమానాన్ని లాండ్ చేసిన కారణంగా విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ నారాయణ్ వేదాంత్ (అమితాబ్ బచ్చన్) బృందం ముందు హాజరు కావాల్సి వస్తుంది. ఒళ్ళంతా బలుపున్న విక్రాంత్ ఖన్నాను నారాయణ్ వేదాంత్ తన వాదనా పటిమతో ఎలా ఆడుకున్నాడు? ఎయిన్ లైన్ అధినేత ఈ వ్యవహారంలో ఎలాంటి పాలిటిక్స్ ప్లే చేశాడు? తనను కాదని నిర్ణయం తీసుకున్న విక్రాంత్ పై తన్యా ఎలా రియాక్ట్ అయ్యింది? అనేది మిగతా కథ.

అననుకూల వాతావరణంలో విమానాలను ల్యాండ్ చేయడం అనేది కొన్ని సందర్భాలలో జరిగేది. 1993లో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, కోడి రామకృష్ణ, అల్లు అరవింద్ తదితరులు చెన్నయ్ లో బయలు దేరిన ఓ ఫైట్ తిరుపతి సమీపంలో అత్యవసరం ల్యాండింగ్ జరుపుకుంది. అయితే ఎవరి ప్రాణాలకూ హాని కలుగలేదు. పైలట్ విజయ్ భల్లా చాకచక్యంతో తమ ప్రాణాలను కాపాడాడని భావించిన సినీ ప్రముఖులు ఆ తర్వాత గ్రాండ్ పార్టీ ఇచ్చారు. బట్ ఆ పైలట్ సస్పెండ్ అయ్యారంటూ ఆ పైన వార్తలు వచ్చాయి. ఇప్పుడీ ‘రన్ వే 34’ కథ కూడా అలాంటిదే. అయితే దీనికి 2015లో జరిగిన ఓ సంఘటన కారణమని చిత్ర బృందం పేర్కొంది. దోహ నుండి కొచ్చి బయలుదేరిన విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో మరో ఫ్లైట్ ను ఢీకొట్టినంత పనిచేసి ఆ తర్వాత తిరువనంతపురంలో ల్యాండ్ అయ్యింది. దీని నుండి ఈ చిత్ర కథ రూపొందించామని చెబుతున్నారు. కానీ ఈ తరహా చిత్రాలు హాలీవుడ్ లో ఇప్పటికే కొన్ని వచ్చాయి. విమాన ప్రయాణం, అందులో జరిగే సరిగమలు పదనిసలు, ఆ తర్వాత ల్యాండింగ్ సమస్య ఏర్పడటం వంటి సన్నివేశాల కారణంగా.. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగానే సాగింది. కానీ కోర్టు డ్రామా మొదలైన తర్వాత సినిమా గ్రాఫ్ పడిపోయింది. ఫస్ట్ హాఫ్ తర్వాత థియేటర్ నుండి బయటకు వచ్చేసినా ఏమీ మిస్ కాలేదన్న భావన ప్రేక్షకులకు కలిగేలా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ అజయ్ దేవ్ గనే! ఆయనే దర్శకుడు, ఆయనే నిర్మాత, ఆయనే హీరో. దాంతో ఇక ఆడింది ఆట పాడింది పాట!! నిజానికి దర్శకత్వం బాధ్యతలను వేరెవరికైనా ఇచ్చి ఉంటే అజయ్ దేవ్ గన్, విక్రాంత్ పాత్రకు మరింత న్యాయం చేసేవాడేమో. ఇటీవల వచ్చిన ‘గంగూభాయ్ కతియావాడి’, ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాలలోనే అతను బెటర్ ఆర్టిస్ట్ గా కనిపించాడనిపించింది. అమితాబ్ కు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. కొట్టిన పిండే. ‘పింక్, బద్లా, సెక్షన్ 375, ముల్క్’ వంటి చిత్రాలల్లో ఆయన్ని ఇలాంటి పాత్రల్లో చూశాం. కానీ ఆ సినిమాల్లోని పాత్రలంత గొప్పగా ఇందులో సంభాషణలు లేవు. విక్రాంత్ భార్యగా ఆకాంక్ష సింగ్, లాయర్ గా అంగీరా ధర్ నటించారు. వారి పాత్రలకు ఏమంత స్కోప్ లేదు. బొమ్మన్ ఇరానీని పెద్దంతగా ఉపయోగించుకోలేదు. ఉన్నంతలో కాస్తంత ఆకట్టుకుంది, సహజ నటన కనబరించింది కో-పైలట్ పాత్ర చేసిన రకుల్ ప్రీత్ సింగే! అసీమ్ బజాజ్ సినిమాటోగ్రఫీ కూడా గొప్పగా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సో సో నే! ఈ సినిమాలో ఏదో ఉంటుందని ఊహించుకుని వెళితే నిరాశ పడక తప్పదు. ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తే సరిపోతుంది.

రేటింగ్: 2.25/ 5

ప్లస్ పాయింట్స్
రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ మూవీ
అజయ్ దేవ్ గన్, అమితాబ్ కాంబో

మైనెస్ పాయింట్స్
సహనానికి పరీక్ష పెట్టే ద్వితీయార్థం
తేలిపోయిన అమితాబ్ పాత్ర
పెద్దగా లేని నిర్మాణ విలువలు

ట్యాగ్ లైన్: అన్ సేఫ్ ల్యాండింగ్!