NTV Telugu Site icon

Bubblegum Review: యాంకర్ సుమ కొడుకు రోషన్ బబుల్ గమ్ రివ్యూ

Bubble Gum రివ్యూ

Bubble Gum రివ్యూ

Bubblegum Movie Review: యాంకర్ సుమ -రాజీవ్ కనకాలల కుమారుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా బబుల్ గమ్. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంటుంది అని అందరిలోనూ ఒక రకమైన ఇంట్రెస్ట్ అనౌన్స్ చేసిన నాటి నుంచే కలిగింది. దానికి తోడు ఈ సినిమాలో తెలుగు అమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా నటించడం, హీరో సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ రోషన్ తండ్రి పాత్రలో నటించడంతో సినిమా మీద మరింత అంచనాలు ఏర్పడ్డాయి. యూత్ ఫుల్ సినిమాలు చేసిన రవికాంత్ పేరేపు డైరెక్టర్ కావడంతో సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఒకరోజు ముందుగానే పెయిడ్ స్పెషల్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూసి తెలుసుకుందాం.

బబుల్ గమ్ కథ ఎలా ఉందంటే?
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన సాయి ఆదిత్య (రోషన్ కనకాల) ఎలా అయినా డీజే అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చికెన్ షాప్ నడిపే తండ్రి యాదగిరి (చైతు జొన్నలగడ్డ) – తల్లితో కలిసి సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఎప్పటికైనా ఒక మంచి డీజే అవ్వక పోతానా? తన లైఫ్ మారకపోతుందా అని తన ఇద్దరు స్నేహితులతో కలిసి గడిపేస్తూ ఉంటాడు. అలాంటి ఆది లైఫ్ లోకి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని భావించే రిచ్ ఫ్యామిలీ కి చెందిన జాహ్నవి అలియాస్ జాను (మానస చౌదరి) ఎంటర్ అవుతుంది. ఆమెను మొదటి చూపులోని చూసి ఆదిత్య ప్రేమిస్తాడు. అయితే ప్రేమ లాంటిది ఏమీ లేదని అప్పటికే ఒక బ్రేకప్ అయిన జాను భావిస్తూ ఉంటుంది. మగాళ్ళను ఒక ఆట బొమ్మలా చూడాలి కానీ వాళ్ళ చేతిలో మనం ఆట బొమ్మ కాకూడదు అనేది ఆమె ఫీలింగ్. ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆదిత్య ఒకానొక సమయంలో ఆమె చేతుల్లోనే తీవ్రంగా అవమానించబడతాడు. ఈ దెబ్బతో ప్రేమ కరెక్ట్ కాదు ముందు లైఫ్ మీద ఫోకస్ పెట్టాలని భావించి ఆదిత్య తన లైఫ్ సెట్ చేసుకునే పనిలో ఉండగా తన తప్పు తెలుసుకుని అతని వెంట పడుతుంది జాను. అయితే రెండు వేరువేరు నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ చివరికి ఏమైంది? వీరిద్దరూ చివరికి కలుస్తారా? లేదా? ఆదిత్య డీజే, జాను ఫ్యాషన్ డిజైనర్ అయ్యారా? లేదా? అనేదే సినిమా కథ.

విశ్లేషణ:
క్షణం కృష్ణ అండ్ హిస్ లీల లాంటి సినిమాలు చేసిన రవికాంత్ పేరేపు దర్శకత్వంలో మరొక లవ్ స్టోరీ వస్తుంది అంటే ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా కుర్ర కారులో కాస్త ఆసక్తి ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ అఫ్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ల క్యారెక్టర్ లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. పూర్తిగా రెండు భిన్నమైన ధ్రువాలుగా కనిపించే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి తొలిచూపులోనే ఒకరికి ఒకరు అట్రాక్ట్ కావడం, వారిద్దరి మధ్య లవ్ ఏర్పడడం అనే పాయింట్ మనం చాలాకాలం నుంచి ఎన్నో సినిమాలలోనే చూసే ఉంటాం. ఇక్కడ కూడా అదే పాయింట్ చుట్టూ కథ మొదలవుతుంది. ఎందుకు ప్రేమ మొదలవుతుంది? అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. అయితే ఇంటర్వెల్, క్లైమాక్స్ పక్కన పెడితే బబుల్ గమ్ కూడా ఇలాంటి ఓ రొటీన్ కథ. దీంతో ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీ రొమాన్స్ మీద బండి నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాన్స్ ఆకట్టుకునేలా ఉంది కానీ హీరో అతని స్నేహితుల మధ్య రాసుకున్న కామెడీ ట్రాక్ పూర్తిస్థాయిలో వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. వైవా హర్ష లాంటి నటుడిని ఎందుకో పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయాడు అనిపించింది. కేవలం రెండు మూడు సీన్లు మాత్రమే నవ్వు తెప్పించేలా ఉన్నాయి. మిగతాదంతా బలవంతపు కామెడీనే అనిపించింది. ఎమోషన్స్ వర్కౌట్ కాకుండా లవ్ బదులు లస్ట్ ఏమో అనిపించేలా ఉన్న లవ్ ట్రాక్ వెరసి ఇవన్నీ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇప్పించాయి ఏమో అనిపించేలా ఉంది. అవన్నీ పక్కన పెడితే రొటీన్ గా కాకుండా కొత్తగా అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. అయితే బేబీ సినిమాని గుర్తు చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథ పరుగులు పెడుతుందేమో అనుకుంటే సినిమా టైటిల్ కి తగ్గట్టు అక్కడక్కడే తిరుగుతూ సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ లో గ్లామర్ డాల్ గా ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. సెకండ్ ఆఫ్ లో హీరో ఫాథర్ తో రాసుకున్న సీన్లు బాగా పండాయి. రొటీన్ క్లైమాక్స్ కాకుండా కొత్త రకం ఎండింగ్ తో దర్శకుడు తన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే కామెడీ సీన్స్ తో పాటు లవ్ సీన్స్ లో ఎమోషన్ మరింత పండేలా ప్లాన్ చేసుకునే ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త లీడ్ పైర్ తో ఇలాంటీ ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకోవడమే ఒక రిస్క్, అయితే ఆ రిస్క్ లో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదేమో అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వచ్చేసరికి బబుల్ గమ్ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది రోషన్ కనకాల గురించి. మనోడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఆదిత్య అనే మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రకు రోషన్ పర్ఫెక్ట్ మ్యాచ్. రోషన్ లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగున్నా ఒక ఎక్స్ప్రెషన్స్ విషయంలో మాత్రం కేర్ తీసుకుని ఉండాల్సింది. అయితే మొదటి సినిమాకే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా భావ్యం కాదేమో. కానీ ఆ ఒక్క విషయంలో ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి నటుడిగా షైన్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మాత్రం ఔట్ పుట్ ఇచ్చాడంటే రోషన్ కి మంచి ఫ్యూచర్ ఉన్నట్టే. ఇక హీరోయిన్ మానస చౌదరి కూడా ఎక్కడా మొదటి సినిమా చేసిన హీరోయిన్ లా అనిపించలేదు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో హీట్ పెంచుతూనే మరోపక్క నటన విషయంలో కూడా రోషన్ ని డామినేట్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కి క్యూ కడుతున్న తెలుగు అమ్మాయిలలో మానస కూడా నిలబడి పోతుంది. ఇక హీరో ఫాథర్ రోల్ లో నటించిన హీరో సిద్దు జొన్నలగడ్డ బ్రదర్ చైతు జొన్నలగడ్డ సినిమా మొత్తానికి పెద్ద అసెట్. టాలీవుడ్ కి మరొక మంచి యాక్టర్ దొరికాడు రా అనేలా నటన విషయంలో రెచ్చిపోయాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎవర్రా ఈ నటుడు అనుకోకుండా ఉండలేరు. ఇక వైవా హర్ష, హర్ష వర్ధన్ వంటి వారిని ఎందుకో పూర్తి స్థాయిలో వాడుకోలేదు అనిపించింది. కిరణ్ మచ్చ, బిందు చంద్రమౌళి వంటి వారు తమ పాత్రల పరిధి మేర పరవాలేదు అనిపించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే రవికాంత్ పేరేపు ‘బబుల్ గమ్’లో ఎమోషన్స్ మిస్ అయినా రోషన్ కనకాల, మానస చౌదరిల నుంచి బెస్ట్ రాబట్టుకోవడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా పాటలు అంతగా గుర్తుంచుకో దగ్గవి లేకున్నా.. శ్రీ చరణ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఇక సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది, గోవాలో షాట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక అలానే సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ: బబుల్ గమ్ అనేది అవుట్ అండ్ అవుట్ యూత్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ఫ్యామిలీతో కలిసి చూడలేము. అయితే ఈ తరం లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చొచ్చు కానీ కండిషన్స్ అప్లై.

Show comments