కేవలం నెల రోజుల వ్యవథిలో కేరళకు చెందిన ఇద్దరి జీవిత చరిత్రలు దేశ ప్రజల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి మరణానంతరం ‘అశోక చక్ర’ అవార్డుకు ఎంపికైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ కాగా, మరొకటి పద్మభూషణ్ గ్రహీత, శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్. అదృష్టం ఏమంటే… ఎనభై యేళ్ళ నంబి నారాయణన్ ఇంకా మన మధ్యే ఉన్నారు. నటుడు మాధవన్ నటించి, తొలిసారి దర్శకత్వం వహించి నిర్మించిన ‘రాకెట్రీ’ మూవీలో ఆయన కొన్ని సన్నివేశాలలో తన పాత్రలో తానే కనిపించారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఈ ఇద్దరు దేశభక్తుల జీవితంలోని విషాదఘటనలను వెండితెరపైకి తీసుకొచ్చిన దర్శక నిర్మాతలను అభినందించాలి. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి సందీప్ ఉన్నికృష్ణన్ కాగా, అంతరిక్ష పరిశోధనలో భారత్ ను సూపర్ పవర్ గా నిలబెట్టాలని ప్రయత్నించి వంచనకు గురైన శాస్త్రవేత్త నంబి నారాయణన్. ఈ తరానికి వీరిద్దరి కథలూ ఆదర్శమనే చెప్పాలి.
ఈ మధ్యకాలంలో మన ముందుకు ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. క్రీడాకారులు, నటులు, రాజకీయనేతలు చివరకు బందిపోట్లు, దేశాన్ని దోచుకున్న పారిశ్రామిక వేత్తల జీవితాలనూ వెండితెరపై చూస్తున్నాం. అయితే అందుకు భిన్నంగా తన దేశభక్తిని నిరూపించుకోవడానికి ఓ శాస్త్రవేత్త చేసిన పోరాటాన్ని ‘రాకెట్రీ’గా మాధవన్ తెర మీదకు తీసుకొచ్చారు. రకరకాల మలుపులు తిరిగి తన చేతికి వచ్చిన ‘రాకెట్రీ’ ప్రాజెక్ట్ కు మాధవన్ మనసా వాచా కర్మణా సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు కృషి చేశారు. నంబి నారాయణన్ అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో చదువుకునేప్పుడు మొదలై ఈ కథ 2013 వరకూ సాగింది. దీనిని మాధవన్ రెండు భాగాలుగా విభజించారు. ఫస్ట్ హాఫ్ లో నంబి ఈ దేశంలోని అంతరిక్షపరిశోధనా సంస్థ ఇస్రోకు ఎలాంటి కంట్రిబ్యూషన్ అందించారో చూపారు. ఇస్రో అధికారి విక్రమ్ సారాబాయి మనసు గెలుచుకుని, ఆయన ద్వారా రాజకీయ నేతల నుండి అనుమతులు సంపాదించి, యూరప్, రష్యా నుండి దేశానికి కావాల్సిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఎలాంటి చొరవ ప్రదర్శించారు చూపించారు. ఈ క్రమంలోనే నంబిలోని తెగువ, పొగరును సుతిమెత్తని హాస్యంతో తెలిపారు. ఇక ద్వితీయార్థంలో నంబి నారాయణన్ పై పాక్ గూఢచారిగా వచ్చిన ఆరోపణలు, దాని ద్వారా సమాజం నుండి ఎదురైన ప్రతిఘటనలు, ఆయన కుటుంబంపై జరిగిన మానసిక, శారీరక దాడి… వీటితో కథ రక్తకట్టించారు.
నంబి నారాయణన్ అరెస్ట్ తో ఆసక్తికరంగా మొదలైన ఈ సినిమా మూడు నాలుగు నిమిషాలకే హీరో సూర్య ఆయనను టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించడంతో ట్రాక్ లోకి ఎక్కింది. ఆ ఇంటర్వ్యూలో తన కాలేజీ రోజుల నుండి సుప్రీమ్ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన రోజు వరకూ జరిగిన సంఘటనలను నంబి ద్వారా చెప్పించారు. తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడంతో పాటు అసలైన దోషులను గుర్తించి, సమాజం ముందు నిలబెట్టమని తాను కోరానని, అది ఇంతవరకూ నెరవేరలేదని నంబి ఇంటర్వ్యూలో ముక్తాయింపు ఇస్తారు. చిత్రం ఏమంటే… ఇది జరిగి మరో పదేళ్ళు గడిచినా నంబి కోరిక ఇప్పటికీ తీరలేదు. 2013 తర్వాత జరిగిన సంఘటనలను సినిమాలో వాయిస్ ఓవర్ ద్వారా తెలిపారు. 1998లో సుప్రీమ్ కోర్ట్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. 2019లో భారత ప్రభుత్వం దేశంలోనూ అత్యున్నత గౌరవ పురస్కారాలలో మూడోదైన పద్మభూషణ్ తో ఆయనను గౌరవించింది, ప్రభుత్వం నుండి ఆయన కోరుకున్న నష్టపరిహారమూ దక్కింది. కానీ ఎవరు అసలు దోషులనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ సినిమా క్లయిమాక్స్ లో మాధవన్ తాను కాకుండా తెర మీదకు నంబి నారాయణన్ నే తీసుకొచ్చారు. ఆయన డిమాండ్ ను ఆయనతోనే చెప్పించారు. అయితే… ఈ మొత్తం కుట్రలో అగ్రరాజ్యం అమెరికా హాస్తం ఉందనే విషయాన్ని దర్శకుడు మాధవన్ చూచాయగా తెలియచెప్పే ప్రయత్నం చేశారు.
ఇలాంటి బయోపిక్స్ చాలా అరుదుగా వస్తాయి. పైగా ఓ శాస్త్రవేత్తకు సంబంధించిన జీవితాన్ని వెండితెరపైకెక్కించి సామాన్య ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడమనేది అంత సులభం కాదు. అందుకోసం మాధవన్ సైతం కొన్ని ఫీట్లు చేశారు. కాస్తంత డ్రమెటిక్ గా ఈ కథను చెప్పారు. దక్షిణాదిన సూర్యను, ఉత్తరాదిన షారుఖ్ ఖాన్ ను రంగంలోకి దించారు. ఆ ఇద్దరి వల్ల మూవీ మీద మాస్ ఆడియెన్స్ దృష్టి పడుతుంది. కానీ థియేటర్ కు వచ్చిన వారిని మెప్పించాల్సింది చివరకు మాధవనే! నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా కీలక బాధ్యతలను తన భుజానికి ఎత్తుకున్న మాధవన్ అన్ని రంగాలలో నూరుశాతం ప్రతిభ చూపారని చెప్పలేం.
నంబి నారాయణన్ పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించారు. చాలా మేరకు సక్సెస్ అయ్యారు. ఇక సిమ్రాన్ స్క్రీన్ మీద కనిపించేది కొద్ది సేపే అయినా… చక్కని అభినయం ప్రదర్శించింది. ముఖ్యంగా క్లయిమాక్స్ లో తన నటనతో మెప్పించింది. ‘అమృత’ చిత్రం నుండి వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం తెర మీద మరోసారి ప్రతిఫలించింది. విక్రమ్ సారాబాయి, సతీశ్ ధావన్, కలామ్ వంటి కీలక పాత్రలను హిందీ, తమిళంలో వేర్వేరు నటులతో చేయించారు. తెలుగు వారికి ఇవన్నీ తెలియని ముఖాలే. దేశ విదేశాలలో మాధవన్ ఎంతో శ్రమకోర్చి ఈ సినిమాను తీశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఫేస్ చేశారు. మొత్తం మీద తన చిరకాల కల ‘రాకెట్రీ’ని జనం ముందుకు తీసుకొచ్చారు. అయితే ప్రథమార్థంలో కొన్ని సీన్స్ మనకు క్లాస్ రూమ్ ను గుర్తు చేస్తాయి. ద్వితీయార్థంలో సెంటిమెంట్ సీన్స్ మనసుల్ని కదలిస్తాయి. మొత్తంగా మిశ్రమ స్పందన ఏర్పడుతుంది. కమర్షియల్ గా ఏ స్థాయి విజయాన్ని ‘రాకెట్రీ’ సాధిస్తుందనే విషయాన్ని పక్కన పెడితే, మాధవన్ చేసిన మంచి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాలి. ఆ మధ్య వచ్చిన ‘విక్రమ్’ క్లయిమాక్స్ లో సూర్య గ్యాంగ్ స్టర్ రోలెక్స్ గా ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి థియేటర్స్ ను ఓ ఊపు ఊపాడు. ఇందులో మొత్తం మీద ఐదారు చోట్ల సూర్య కనిపిస్తాడు. క్లయిమాక్స్ లో నంబి నారాయణన్ కు దేశం తరఫున క్షమాపణలూ చెబుతాడు. కానీ సూర్యను ఇలాంటి పాత్రలో చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని అనుకోలేం!!
రేటింగ్: 3 / 5
ప్లస్ పాయింట్స్
నంబి నారాయణన్ బయోపిక్ కావడం
మాధవన్, సిమ్రాన్ నటన
సూర్య ప్రత్యేక పాత్ర పోషించడం
మైనెస్ పాయింట్స్
పెద్దగా పండని సెంటిమెంట్
ఆసక్తి కలిగించని స్క్రీన్ ప్లే
ట్యాగ్ లైన్: గుడ్ ఎఫర్ట్!