NTV Telugu Site icon

RGV’s Ammayi Movie Review: అమ్మాయి రివ్యూ

Ammayie

Ammayie

 

బ్రూస్ లీ మరణించి దాదాపు ఐదు దశాబ్దాలు కావస్తోంది. అయినా ఈ తరం యువతరం మీద కూడా అతని ప్రభావం ఎంతో ఉంది. కేవలం 33 సంవత్సరాలు మాత్రమే జీవించిన బ్రూస్ లీ మరణానంతరం కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హృదయాలలో చోటు సంపాదించుకున్నాడు. అతని ఇన్ స్పిరేషన్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. బాల్యం నుండి బ్రూస్ లీని అభిమానిస్తూ వచ్చిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం తన రోల్ మోడల్ బ్రూస్ లీ నుండి స్ఫూర్తిని పొంది, అతనికి నివాళిగా ‘లడ్కీ: డ్రాగన్ గర్ల్’ అనే హిందీ తీశాడు. ఈ సినిమా చైనీస్ తో పాటు ప్రధాన భారతీయ భాషల్లోకి అనువాదమై శుక్రవారం విడుదలైంది. తెలుగులో ‘అమ్మాయి’ పేరుతో వచ్చింది.

కథ కొత్తదేమీ కాదు…. పైగా చాలా సింపుల్ అండ్ సింగిల్ పాయింట్. పూజా (పూజా భలేకర్) కు బ్రూస్ లీ అంటే ప్రాణం. నిస్సహాయురాలైన కారణంగా తన అక్క జీవితం కళ్ళ ముందే నాశనం కావడంతో స్వీయ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ధనార్జన కోసం మోడలింగ్ చేస్తుంటుంది. ఫోటోగ్రాఫర్ నీల్ (పార్థ్ సూరి)తో ప్రేమలో పడిన పూజా… డ్రాగన్ స్కూల్ లో చేరుతుంది. అక్కడి యువకులకు శిక్షణ ఇస్తుంటుంది. అయితే ఆ స్కూల్ ఉండే ఏరియా మీద అండర్ వరల్డ్ డాన్ వి. ఎం. (అభిమన్యు సింగ్) కన్ను పడుతుంది. దాన్ని ఎలాగైనా ఖాళీ చేయించాలని చూస్తాడు. ఆ క్రమంలో డ్రాగన్ స్కూల్ నిర్వాహకుడు లుయ్ (తియాంగ్లాంగ్ షి)ని అంతం చేస్తాడు. గురువు చివరి కోరిక మేరకు ఆ స్కూల్ నిర్వహణ బాధ్యతను తన భుజానికెత్తుకున్న పూజా దాన్ని ఎలా కాపాడింది? సంఘ విద్రోహశక్తి అయిన వి.ఎం.కుఎలా బుద్ధి చెప్పింది? అన్నది కథ.

దాదాపు 133 నిమిషాల నిడివి వున్న ఈ సినిమాలో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులేమీ లేవు. అలానే అబ్బురపరిచే సన్నివేశాలూ లేవు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా పూజా, ఆమె ప్రేమ చుట్టూనే సాగుతుంది. అయితే బ్రూస్ లీ పూర్వీకులకు చెందిన దక్షిణ చైనాలోని జూనన్ పట్టణానికి కథను తీసుకెళ్ళడం ఓ విశేషం. అక్కడి 62 అడుగుల బ్రూస్ లీ విగ్రహాన్ని చూపించడంతో పాటు ఓ పాటనూ వర్మ చిత్రీకరించాడు. చైనా లేడీ ఫైటర్ ముఖీ మియాతో చిత్రీకరించిన పోరాట సన్నివేశం కాస్తంత ఆసక్తికరంగా ఉంది. ఇక ద్వితీయార్థం మొత్తం పరమ రొటీన్ గా, రొట్టకొట్టుడు గా సాగింది. భూమి కబ్జాకు విలన్ పాల్పడటం, అందుకు అడ్డు వచ్చిన వారిని చంపేయడం, హీరోయిన్ ను కంట్రోల్ చేయడానికి హీరోని కిడ్నాప్ చేయడం.. చివరకు ఓ వీరోచిత పోరాటంతో ఆమె విలన్ ను చంపేయడం! బ్రూస్ లీకి నిజంగా నివాళులు అర్పిస్తూ వర్మ ఓ సినిమా తీయాలని అనుకుంటే ఇలాంటి సాదా సీదా కథను ఎంచుకోకూడదు. పైగా మార్షల్ ఆర్ట్ అనేది ఓ గౌరవ ప్రదమైన క్రీడ. దానికంటూ కొన్ని రూల్స్, డ్రస్ కోడ్ లాంటివి ఉంటాయి. హీరోయిన్ ఎంత మోడల్ అయినా… సినిమా అంతా ఆమెను టూ పీస్ బికినీలోనే చూపించడం దారుణం. నాలుగు పాటలు, ఆరు ఫైట్స్ తో మూవీని వర్మ ముగించేశాడు. పాటలలోనే కాకుండా ఫైట్స్ లోనూ హీరోయిన్ తో అందాల ఆరబోతకు ప్రయత్నించాడు. సహజంగా మన హీరోయిన్లు… ‘సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే ఎక్స్ పోజింగ్ కు సిద్ధం’ అంటూ కూనిరాగాలు తీస్తారు. కానీ ఇందులో సిట్యుయేషన్ డిమాండ్ తో సంబంధం లేకుండా పూజా పరువాలను ఆరబెట్టింది. సినిమా మొత్తం మీద ఒకటి రెండు సార్లు మాత్రమే అమ్మడు చీరలో కనిపిస్తుంది. ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిన ఈ సినిమాలో చాలా చోట్ల డైలాగ్స్ మ్యూట్ అయ్యాయంటే ఆ యా పాత్రల ద్వారా ఎంత లేకి మాటలు వర్మ పలికించి ఉంటాడో ఊహించుకోవచ్చు!

మార్షల్ ఆర్ట్స్ లో ప్రవీణురాలైన పూజాకు ఇది మొదటి సినిమానే అయినా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఒకరిద్దరు తప్పితే మిగిలిన ఆర్టిస్టులంతా హిందీ వాళ్ళే. కొందరు చైనీస్ నటులూ ఇందులో నటించారు. అభిమన్యుసింగ్, రవి కాలే వంటి వారు తెలుగులోనూ కొన్ని సినిమాలలో నటించడం కాస్తంత ఊరట. ఇతర ప్రధాన పాత్రలను రాజ్ పాల్ యాదవ్, ప్రతీక్ కుమార్, ‘టెంపర్’ వంశీ, యేజీ హే తదితరులు చేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఏవీ ఆశించిన స్థాయిలో లేవు. సిరాశ్రీ రాసిన పేథటిక్ సాంగ్ అయితే మరీ దారుణంగా ఉంది. బ్రూస్ లీ పేరును అడ్డం పెట్టుకుని, వర్మ బిజినెస్ చేశారు తప్పితే మరేమీ లేదు! ఒక వేళ దీన్ని బ్రూస్ లీకి నివాళిగా ఎవరైనా భావిస్తే… అంతకంటే ఆత్మ వంచన మరొకటి ఉండదు.

 

ప్లస్ పాయింట్స్
బ్రూస్ లీ పేరు ముడిపెట్టడం
ఆకట్టుకునే యాక్షన్ సీన్స్

మైనెస్ పాయింట్స్
రొటీన్ కథ
రొట్టకొట్టుడు కథనం

ట్యాగ్ లైన్: సెక్సీ ఫైటర్!