NTV Telugu Site icon

Rebels Of Thupakula Gudem Review: రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం రివ్యూ

Rebels Of Thupakula Gudem M

Rebels Of Thupakula Gudem M

Rebels Of Thupakula Gudem Review: రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం రివ్యూ
రిలీజ్: 03-02-2023
నటీనటులు: ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయత్రి మకానా, శివరామ్ రెడ్డి, వంశీ, ఊటుకూరు, శరత్ బరిగెల, వినీత్ కుమార్, విజయ్ మచ్చా
రచన: సంతోష్ మురారికర్
సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ అర్పుల
సంగీతం: మణిశర్మ
ఎడిటిర్, డైరెక్టర్: జై దీప్ విష్ణు

నక్సలిజం కథాంశంతో ఇటీవల వరుసగా సినిమాలు తెరకెక్కాయి. అవే ఆ మధ్య వచ్చిన ‘విరాటపర్వం’, ‘సిందూరం’, ‘రెబల్స్ అఫ్ తుపాకులగూడెం’. వాటిలో కొన్ని నెలల క్రితం రానా ‘విరాటపర్వం’, గత వారం ‘సిందూరం’ విడుదల కాగా ఈవారం ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ఆడియన్స్ ముందుకు వచ్చింది. వీటిలో భిన్నమైన కాన్సెప్ట్‌తో ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ సినిమా తెరకెక్కింది. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలతో పాటు టీజర్‌ ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

నిజానికి ఈ సినిమా వాస్తవంగా జరిగిన ఓ సంఘటన స్ఫూర్తితో తెరకెక్కింది. కథ అంతా తుపాకులగూడెం అనే ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నక్సలిజం సమస్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ప్రకటిస్తుంది. దాని ప్రకారం నక్సలైట్లు సరెండర్ అయితే వారికి మూడు లక్షల క్యాష్, పోలీసు ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తారు. అలా నక్సలైట్ల పేరుతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను సరెండర్ చేసి తను లాభపడాలని ఓ బ్రోకర్ ప్లాన్ చేస్తాడు. దీనికి ఏజెన్సీలో దొరలా బతికే రాజన్న (ప్రవీణ్ కండెల) దృష్టికి తీసుకువెళ్తే రాజన్న తన దగ్గర ఉండే కుమార్ (శ్రీకాంత్ రాథోడ్) అనే వ్యక్తికి ఆ పని అప్పచెబుతాడు. అయితే పోలీస్ ఉద్యోగం అలా ఫ్రీగా ఇవ్వటం కుదరదని మనిషికి లక్ష ఇవ్వాలని షరతు పెడతాడు బ్రోకర్. అలా ఊరిలో ప్రజల వద్ద డబ్బు వసూలు చేసి బ్రోకర్ కి ఇచ్చిన తర్వాత నక్సల్ నాయకుడు శివన్న (శివరామ్ రెడ్డి) ప్రభుత్వ దళాలను చంపటంతో సరెండర్ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేస్తుంది ప్రభుత్వం. బ్రోకర్ డబ్బుతో మాయం అవుతాడు. దాంతో సరెండర్ అవటానికి నక్సల్స్ దుస్తుల్లో వెళ్ళిన 100 మంది పరిస్థితి
ఏమవుతుంది? అసలు నక్సల్ నాయకుడు శివన్న ఉద్దేశం ఏమిటి? ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న రాజన్న ఏం చేస్తాడు? రాజన్నకు, ఊరుని మోసం చేశాడంటున్న క్రాంతికి, నక్సల్ నాయకుడు శివన్నకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఊరి ప్రజలను ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ అని ఎందుకు అన్నారు? అన్నదే ఈ సినిమా.

సినిమా పూర్తిగా అడవి నేపథ్యంలో సాగుతుంది. 90ల నేపథ్యంలో జరిగిన కథ. పూర్తిగా కొత్తవారితో సినిమా తీయటం నిజంగా సాహసంతో కూడిన పనే. అయినా దానిని సమర్ధవంతంగా చేశారు. ఎంచుకున్న కథాంశాన్ని నమ్మి చేశారు. అయితే నక్సలిజం కనుమరుగై పోయిన ప్రస్తుత తరుణంలో తీయటమే పెద్ద డ్రా బ్యాక్. నటీనటులు కొత్త వారైనా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కొత్తవారైనా ఆ ఫీలింగ్ కలగదు. సినిమాకు మెయిన్ ఎస్సెస్ సంగీతం. మణిశర్మ అందించిన ‘అడవిలోన ఆడపిల్ల..’, ‘షురువాయె… ‘, పాటలు, వాటి చిత్రీకరణ అద్భుతంగా ఉన్నాయి. ‘ఇంటికి తిరిగెరా బిడ్డ..’ పర్వాలేదు. నేపథ్య సంగీతం కూడా సినిమాను నిలబెట్టింది. కెమెరా వర్క్ తో పాటు ఎడిటింగ్ కూడా పర్వాలేదు. దర్శకుడు తను స్ఫూర్తి చెందిన సంఘటనను సినిమాగా మలచటంలో సక్సెస్ అయినా, ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచికి జతపడని అంశం కావటంతో నిరాశ పడక తప్పదు.

రేటింగ్: 2.5/5

ప్లస్ పాయింట్స్
మణిశర్మ సంగీతం
చక్కటి లొకేషన్స్
నటీనటుల పెర్ఫార్మెన్స్

మైనస్ పాయింట్స్
ఈ జనరేషన్ ని మెప్పించని కథాంశం
ప్రథమార్ధం

ట్యాగ్ లైన్
పేలని ‘తుపాకులు’