NTV Telugu Site icon

Changure Bangaru Raja Review: ఛాంగురే బంగారురాజా రివ్యూ

Changure Bangaru Raja Review

Changure Bangaru Raja Review

Changure Bangaru Raja Review: ఇప్పుడు మన తెలుగు హీరోలు అందరూ ఒక పక్క హీరోలుగా నటిస్తూనే మరో పక్క సొంత నిర్మాణ సంస్థ‌లు పెట్టేస్తున్నారు. కొంతమంది తమ సినిమాలనే తాము నిర్మించుకుంటుంటే మరికొంతమంది చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. అదే కోవలో ర‌వితేజ కూడా ఈ మ‌ధ్య త‌న ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్ బ్యానర్ పెట్టి వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమాను తెలుగులో ‘మ‌ట్టికుస్తీ’ అనే పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చిన తరువాత ‘ఛాంగురే బంగారురాజా’ అనే సినిమాను కూడా ఆడియన్స్ ముందుకు తెచ్చారు. ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’ ఫేమ్ కార్తీక్ ర‌త్నం హీరోగా నటించిన ఈ సినిమాతో స‌తీశ్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా మారారు. అనూహ్యంగా రేసులోకి వచ్చిన ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి అలాంటి ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
ఒక పల్లెటూరిలో బంగార్రాజు (కార్తీక్ రత్నం) బైక్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. వర్షం పడితే రంగురాళ్లు కనిపించే ఆ ఊరిలో ఒకరోజు తన స్నేహితుడు సోమినాయుడు(రాజ్ తిరందాసు)తో బంగార్రాజుకు గొడవ అవుతుంది. తర్వాత రోజే సోము నాయుడు శవమై కనిపించడంతో ఆ నేరం బంగార్రాజుపై పడుతుంది. నిజంగా ఆ వ్యక్తిని బంగార్రాజే చంపాడా? ఈ హత్య కేసులో తాతారావు (స‌త్య‌), గాటీలు (ర‌విబాబు)కి ఆ ఉన్న లింక్ ఏంటి? అదే ఊరి కానిస్టేబుల్ మ‌ంగ‌ర‌త్నం (గోల్డీ నిస్సీ)కీ, బంగార్రాజుకీ మ‌ధ్య‌నున్న లింక్ ఏంటి? చివరికి బంగార్రాజు హత్య కేసు నుంచి బయట పడ్డాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సతీష్ వర్మ డైరెక్ట్ చేశాడు. నిజానికి లైన్ గా తీసుకుంటే అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కున్న హీరో ఆ హత్యకేసు మిస్టరీ క్లియర్ చేసుకుని ఎలా బయటకు వచ్చాడు అనేది కథ. ఇలాంటి సినిమాలు తెలుగులో ఇప్పటికే చాలానే వచ్చాయి. అయితే ఇలాంటి సినిమా చేస్తున్నపుడు ఆడియన్స్ థ్రిల్ అయితే సక్సెస్ అయినట్టే. కానీ ‘ఛాంగురే బంగారు రాజా’ డైరెక్టర్ ఈ సినిమాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా తేయాకెక్కించడంలో తడబడ్డాడు. కామెడీ వర్కౌట్ అయింది కానీ ఎమోషన్స్ కానీ ఇతర అంశాలు కానీఈ పెద్దగా మెప్పించలేదు. కమర్షియల్ అంశాలను పూర్తి స్థాయిలో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించే ప్రయత్నం చేసి ఉంటే ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ అయి ఉండేదనిపించింది. బంగర్రాజు క్యారెక్టర్ అంత మొండిగా మారడానికి కారణం బనే ఉంది కానీ దాన్ని ఎమోషనల్‌ గా డీటైల్‌గా చెప్పి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. అయితే సినిమా చూస్తున్నంత సేపు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా రవిబాబుతో చేయించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది.

ఎవరెలా చేశారంటే?
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. బంగార్రాజు పాత్రలో కార్తీక్ రత్నం ఒదిగిపోయాడు. పల్లెటూరి మెకానిక్ గా ఆకట్టుకున్నాడు. ఇక కమెడియన్ సత్య కామెడీ కూడా వర్కౌట్ అయింది. సోమి నాయుడుగా రాజ్ తిరందాసు, గోటీలుగా రవిబాబు, ఎస్సైగా అజయ్ క్యారెక్టర్లకి తగినట్టు నటించాడు. ఇక ఎస్తేర్ పాత్ర అతిధి పాత్రలా అనిపించింది. గోల్డీ పాత్రకి కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక టెక్నీకల్ టీమ్స్ విషయానికి వస్తే.. దర్శకుడిగా సతీష్ వర్మ టేకింగ్ బాగానే ఉన్నా, కథపై ఇంకా గట్టిగా వర్కౌట్ చేసి స్క్రీన్ ప్లే విషయంలో కూడా జాగ్రత్త తీసుకుని ఉంటే ఒక మంచి మర్డర్ మిస్టరీగా నిలిచేది. ఇక కృష్ణ సౌరబ్ సంగీతం డీసెంట్ గా ఉంది. ఇక సుందర్ సినిమాటోగ్రఫితో అనేక అందమైన సీనరీలు చూపించారు. రవితేజ టీమ్ వర్క్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ: ‘ఛాంగురే బంగారు రాజా’ అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే ఎంజాయ్ చేస్తారు.