NTV Telugu Site icon

Sagileti katha: సగిలేటి కథ రివ్యూ

Sagileti Katha Review

Sagileti Katha Review

Sagileti katha Review: ఈ మధ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న అన్ని సినిమాలు దాదాపుగా హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఒక ఊరి చుట్టూ తిరిగే కథ, అందులో ఒక లవ్ స్టోరీ అంటే అందరికీ ఆసక్తే. ఆ ఆసక్తే అలాంటి సినిమాలకి మంచి స్కోప్ ఇస్తున్నాయి. ఇక అలాంటి బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన తాజా చిత్రం సగిలేటి కథ. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ హీరో హీరోయిన్లుగా రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించగా ప్రమోషన్స్ తో మంచి బజ్ కూడా క్రియేట్ చేసింది. అలాంటి సినిమాను మీడియా కోసం స్పెషల్ ప్రీమియర్ వేసి ప్రదర్శించారు మేకర్స్. మరి ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతుంది అనేది సినిమా రివ్యూలో చూద్దాం.

సగిలేటి కథ విషయానికి వస్తే: రాయలసీమలోని కడప జిల్లా సగిలేరు గ్రామ ప్రెసిడెంట్ చౌడప్ప (రాజ శేఖర్ అనింగి), ఆర్ఎంపీ దొరసామి (రమేష్)లు మంచి స్నేహితులు ఇద్దరూ ఊరి పెద్దలుగా ఊరి సమస్యలు అన్నిటినీ తీరుస్తూ ఉంటారు. కువైట్ లో చదువుకుంటున్న చౌడప్ప కొడుకు కుమార్ (రవి మహాదాస్యం), దొరసామి కూతురు కృష్ణ కుమారి (విషిక కోట) ఇద్దరూ ప్రేమలో పడతారు. అంతా బాగుంది ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటున్న సమయంలో ఊరిలో జరిగే గంగాలమ్మ జాతర్లో దొరసామిని చౌడప్ప నరికేస్తాడు. ఆ తరువాత చౌడప్ప మీద పగతో రగిలిన కృష్ణ కుమారి కుమార్ ప్రేమను వదులుకుందా? తాను దక్కాలంటే ఆమె కుమార్ కు పెట్టిన కండిషన్ ఏంటి? చివరికి వీరిద్దరూ ఒక్కటయ్యారా? లేదా? వీరి మధ్యలో రోషం రాజు చికెన్ కథ ఏంటి? అన్నది మీరే థియేటర్లో చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ: సగిలేటి కథ అంటే ఇంకేదో అనుకునేరు సగిలేరు అనే ఊరికి సంబంధించిన కథ. నిజానికి ఈ సగిలేటి కథలు సీనియర్ జర్నలిస్టు, రచయిత బత్తుల ప్రసాదరావు ఎప్పుడో పుస్తక రూపేణా తీసుకొచ్చారు. ఇపుడు ఆ కధలలో ఒకటైన కూరకి సచ్చినోడు అనే కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. సగిలేరు అనే ఊరు ఆ ఊరిలో రోషం రాజు అనే అమాయకుడు. పేరుకే రోషం రాజు కానీ ఎవ్వరితో గొడవ పడలేక అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి బతికేస్తో ఉంటాడు. అలాంటి రాజు హీరో నానమ్మ దినం భోజనాలలో చికెన్ తినే విషయంలో గొడవపడి తానే ఇంట్లో వండించుకుని తింటానని బయలుదేరతాడు. ఇక మరో పక్క హీరో హీరోయిన్లు ప్రేమలో పడడం, వారి ప్రేమకు క్షణికావేశం ఒక పెద్ద గుదిబండగా మారడం ఇంట్రెస్టింగ్ గా చూపించాడు దర్శకుడు. నిజానికి ఇక్కడ చంపుకోవాల్సిన అవసరమే లేదు కానీ క్షణికావేశంలో చంపేసుకుని ఊరి మొత్తాన్ని ఇబ్బంది పెట్టిన వైనాన్ని, పల్లెటూరి వాసుల ప్రేమను, పంతాన్ని, అమాయకత్వాన్ని కూడా చూపించే విషయంలో సక్సెస్ అయ్యాడు. సగిలేరు చుట్టూ కొన్ని పాత్రలు రాసుకుని ఆ పాత్రలను జనాలకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. కథ ఏమీ కొత్తగా అనిపించదు కథనం కూడా సాగతీసిన ఫీలింగ్ కలిగినా సీమ యాసలో చేసిన కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. నిజానికి ఈ సినిమా అంతా ఒకెత్తు అయితే చివర్లో వచ్చే ట్విస్టు మాత్రం ఎవరో ఊహించరు. అప్పటి వరకు ఏదో సాగుతుంది లే అని అనుకుంటూ చూసిన ప్రేక్షకులు ఆ ట్విస్ట్ చూసాక మాత్రం సర్ప్రైజ్ అవుతారు. గ్రామీణ వాతావరణాన్ని, ముఖ్యంగా టచ్ ఫోన్లు కూడా లేని 2007 బ్యాక్ డ్రాప్‌ను తెరకెక్కించే విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. రెండు గంటల లోపు సినిమా కావడంతో కొంచెం లాగ్ అనిపించినా ఫర్వాలేదనిపిస్తుంది. లాజిక్స్ వెతకకుండా చూస్తే సినిమా కొందరికి నచ్చచ్చు.

ఎవరెలా చేశారంటే: ముందుగా నటీనటుల విషయానికి వస్తే కువైట్ నుంచి వచ్చిన కుమార్ పాత్రలో రవి భలే సెట్ అయ్యాడు, హీరోగా ఇది మొదటి సినిమానే అయినా యూట్యూబ్ అనుభవం బాగా కలిసొచ్చింది. పక్కింటి కుర్రాడిలా అనిపిస్తూ సినిమా మొత్తం మీద తన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక కృష్ణ కుమారిగా విషిక తన పాత్రకి న్యాయం చేసింది. ఒకపక్క అందంగా కనిపిస్తూనే మరో పక్క గడుసరిగా మెప్పించింది. రోషం రాజు పాత్రలో పంతగాని నరసింహ ప్రసాద్ జీవించాడు. చౌడప్పగా రాజశేఖర్, ఊరి పెద్దాయన, హీరో తల్లి పాత్రలు డిజైన్ చేసిన తీరు వారు నటన రెండు బాగున్నాయి. అన్ని కారెక్టర్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నికల్ టీమ్స్ విషయానికి వస్తే ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మాయాజాలం కనిపించింది. పల్లెటూరినీ అందునా సగిలేరును అందంగా క్యాప్చర్ చేశారు, కొన్ని ఫ్రేమ్స్ భలే ఆసక్తికరంగా ఉన్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని సాంగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా అనిపించినా ఇంకొంచెం ట్రిమ్ చేయచ్చనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ ఒక్కమాటలో చెప్పాలంటే సగిలేటి కథ ఒక రాయలసీమ బ్యాక్ డ్రాప్ విలేజ్ లవ్ రివేంజ్ స్టోరీ.. నేటివిటీకి దగ్గరగా ఉండే సినిమాలు ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ వాచ్.

Show comments