NTV Telugu Site icon

Rathnam Review: విశాల్ రత్నం రివ్యూ

Rathnam Review

Rathnam Review

Rathnam Movie Telugu Review: తమిళ హీరో విశాల్ రత్నం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళంలో పాటు తెలుగులో కూడా ఈరోజు రిలీజ్ అయింది. యాక్షన్ సినిమాలకు ఫేమస్ అయిన డైరెక్టర్ హరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం నాడు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. గౌతమ్ మీనన్, మురళీ శర్మ, జయప్రకాష్, విజయ్ చందర్ వంటివాళ్లు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇక ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూసి తెలుసుకుందాం.

రత్నం కథ:
చిత్తూరులో ఒక కూరగాయల మార్కెట్లో పనిచేసే రత్నం (విశాల్) చిన్నప్పుడే అదే మార్కెట్లో ఉండే పన్నీర్ (సముద్రఖని)ని ప్రాణాలకు తెగించి కాపాడుతాడు. అప్పటినుంచి సొంత అల్లుడిగా భావించి పన్నీర్ అతన్ని ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. కాలక్రమేణా పన్నీర్ ఎమ్మెల్యేగా ఎదిగితే రత్నం పన్నీర్ రైట్ హ్యాండ్ గా ఉంటూ అన్ని పనులు చేసి పెడుతూ ఉంటాడు. అదే సమయంలో నగరికి చెందిన మల్లిక(ప్రియ భవాని శంకర్) నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వస్తుంది. అయితే ఆమెను చూసి ఎక్కడో చూసినట్టుందే అని రత్నం భావిస్తాడు. అలా అనుకుంటూ ఉన్న సమయంలోనే ఆమె మీద కొన్ని గ్యాంగులు అటాక్ చేస్తూ ఉంటే ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అయితే అసలు ఎందుకు రత్నం ఆమెను కాపాడుతూ ఉంటాడు? లింగం బ్రదర్స్ ( మురళీ శర్మ, హరీష్ పేరడీ, అలాగే మరొకరు) ఎందుకు మల్లికను టార్గెట్ చేశారు? చివరికి రత్నం మల్లికని కాపాడాడా లేదా? లింగం బ్రదర్స్ చివరికి ఏమయ్యారు? అలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
సాధారణంగా హరి డైరెక్ట్ చేసే సినిమాల మీద తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా కొన్ని అంచనాలు ఉంటాయి. సింగం సిరీస్ తో పాటు మరికొన్ని సినిమాలతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే హరి లాంటి డైరెక్టర్ నుంచి వచ్చిన ఈ సినిమా మీద మాత్రం ప్రేక్షకులు గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా ప్రారంభం నుంచి సినిమా మీద ఆసక్తి పెంచుతూ వెళ్లిన దర్శకుడు దాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకున్నాడా అంటే లేదనే చెప్పాలి. సినిమా మొదట్లోనే ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలలో జరిగిన కొన్ని సంఘటనలను చూపిస్తారు. మొదటి భాగం అంతా విశాల్ నేపథ్యం, అతను చిత్తూరు మార్కెట్ కి ఎలా చేరాడు? ఎందుకు పన్నీర్ కోసం ప్రాణాలు తీయడానికి అయినా ప్రాణాలు ఇచ్చేందుకు అయినా సిద్ధపడ్డాడు? లాంటి విషయాలని ఫస్ట్ అఫ్ లో రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతూనే ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ మీద మరింత ఆసక్తి పెంచేలా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ కి వెళ్ళిన తర్వాత కథలో వేగం తగ్గి పోతుంది. కథను అక్కడక్కడే తిప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి కథ విషయానికి వస్తే ఇది కొత్త కథ అని చెప్పలేం. చాలా రోజుల నుంచి ఇలాంటి సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే స్క్రీన్ ప్లేతో ట్విస్టులు ప్లాన్ చేసి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి కొంత ప్రయత్నం చేశారు. అయితే అది పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. దానికి తోడు ప్రేక్షకులు కథను ఈజీగా గుర్తుపట్టే విధంగా ఉంది. అలా గుర్తుపట్టే విధంగా ఉంది అనుకుంటారు అనుకునం ఏమో ఒక విషయాన్ని మాత్రం ప్రేక్షకులు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ముగించారు. క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏదైనా ఉన్నాయంటే దేవిశ్రీప్రసాద్ అందించిన ఒక సాంగ్ అలాగే కొన్నిచోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇక ఫైట్స్ కూడా హరి మార్క్ కి తగినట్టుగానే కొంతవరకు ఉన్నాయి. అయితే మితిమీరిన రక్తపాతం ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే అవకాశాన్ని దూరం చేయొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే విశాల్ ఎప్పటిలాగే దానికి బాగా అలవాటైన పాత్రలో కనిపించాడు. ఒకపక్క మాస్ హీరో లాగా బీభత్సమైన ఫైట్లు చేస్తూనే మరోపక్క యోగిబాబుతో కలిసి కామెడీ కూడా పండించాడు. యోగిబాబు కామెడీ ట్రాక్ కొంతవరకు సినిమాకి కలిసి వస్తుంది. హీరోయిన్గా ప్రియ భవాని శంకర్ తన పాత్ర పరిధి మేరకు నటించింది. హీరో విశాల్ తో కెమిస్ట్రీ ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఇక సముద్ర కనికి మరోసారి తనకి బాగా అలవాటైన పాత్ర పడింది. ఆయన కూడా నటనతో ఆకట్టుకున్నాడు. ఇక జయప్రకాష్, విజయ్ చందర్ వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఫైట్స్ కూడా ఆసక్తికరంగా అనిపించాయి. తెలుగు డైలాగ్స్ రాసింది ఎవరో కానీ కొన్ని గుర్తుపెట్టుకునే డైలాగ్స్ కూడా ఉన్నాయి. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద సినిమా విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. తమిళ పేర్లను తెలుగు తర్జుమా చేసే విషయంలో కూడా అజాగ్రత్త కనబడింది. డీఎస్సీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే ఉన్నా కొన్ని చోట్ల ఇబ్బంది పడేలా అనిపించింది. ఆయన అందించిన ఒక సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.

ఓవరాల్ గా రత్నం ఒక రొటీన్, ఔట్ డేటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా. యాక్షన్ ని అమితంగా ఇష్టపడే వారికి సినిమా నచ్చొచ్చు.

Show comments