NTV Telugu Site icon

Ram Setu Movie Review: రామ్ సేతు (హిందీ, డ‌బ్బింగ్)

Ram Setu

Ram Setu

Ram Setu Movie Review: త‌మిళ‌నాడు నుండి శ్రీలంక వ‌ర‌కూ ఉన్న రామ‌సేతువును ఆ మ‌ధ్య నౌకామార్గం కోసం కూల్చివేయాల‌ని చూసిన‌ప్పుడు రామ‌భక్తులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి వంటి నాయ‌కులు కోర్టు త‌లుపు త‌ట్టారు. రామ‌సేతువును జాతీయ చారిత్ర‌క సంప‌ద‌గా కేంద్రం ప్ర‌కటించ‌డంతో దానిని తొల‌గించాల‌నే ప్ర‌య‌త్నానికి క‌ళ్ళెం ప‌డింది. అయితే రామ‌సేతువు స‌హ‌జంగా ఏర్ప‌డిందా? లేక శ్రీరాముడి కాలం నాటిదా? అనే ప్ర‌శ్న‌కు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యాన్ని తీసుకునే లైకా ప్రొడ‌క్ష‌న్ కంపెనీ జీ స్టూడియోస్ తో క‌లిసి ‘రామ్ సేతు’ మూవీని నిర్మించింది.

ఆర్య‌న్ కుల‌శ్ర‌ష్ట్ (అక్ష‌య్ కుమార్) ఆర్కియాల‌జిస్ట్. అత‌నో నాస్తికుడు, స‌త్యాన్ని మాత్ర‌మే న‌మ్ముతాడు. తాలిబ‌న్లు బుద్ధుడి విగ్ర‌హాల‌ను పేల్చేసిన చోటుకు భార‌త‌దేశం త‌ర‌ఫున వెళ్ళి, అక్క‌డ బుద్ధ‌విగ్ర‌హం తాలూకు అవ‌శేషాల‌ను వెలికి తీసి ఆ ఆప‌రేష‌న్ ను విజ‌య‌వంతంగా ముగించుకుని తిరిగి వ‌స్తాడు. అదే స‌మ‌యంలో త‌మిళ‌నాడులో రామసేతును తొల‌గించాల‌నే నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ కొంద‌రు ఉద్య‌మం చేస్తుంటారు. రామ‌సేతును రాముడు నిర్మించ‌లేద‌ని నిరూపిస్తే, త‌మ పుష్ప‌క్ షిప్పింగ్ ప్రాజెక్ట్ కు కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌స్తుంద‌ని, దాని అధినేత ఇంద్ర‌కాంత్ (నాజ‌ర్) భావిస్తాడు. త‌న దుందుడుకు వైఖ‌రితో ఆర్కియాల‌జీ డిపార్ట్ మెంట్ నుండి స‌స్పెండ్ అయిన ఆర్య‌న్ ను ఈ విష‌యంలో పావుగా వాడుకోవాల‌నుకుంటాడు. రామ‌సేతు నిర్మాణం విష‌యంలో ప‌లు సందేహాలు ఉన్న‌ ఆర్య‌న్… ఇంద్ర‌కాంత్ తో చేతులు క‌లిపాడా? రామ‌సేతు అవ‌శేషాలను, నీటిలో తేలే రాతిని ప‌రిశీలించిన త‌ర్వాత అత‌ని అభిప్రాయంలో మార్పు వ‌చ్చిందా? రామ‌సేతుకు సంబంధించిన ఆధారాల కోసం శ్రీలంక వెళ్ళిన ఆర్య‌న్ కు అక్క‌డ ఎలాంటి అనుభవాలు ఎదుర‌య్యాయి? అనేదే మిగ‌తా క‌థ‌.

‘రామ్ సేతు’ సినిమా ప్రారంభమే ఓ ర‌కంగా బాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి, దాని భావ‌జాలానికి అనుకూలంగా ఈ సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. దానికి తోడు ఇటీవ‌ల వ‌చ్చిన ‘పృథ్వీరాజ్ చౌహాన్’ చిత్ర ద‌ర్శకుడు, ‘చాణ‌క్య’ టీవీ సీరియ‌ల్ ఫేమ్ చంద్ర ప్ర‌కాశ్ ద్వివేది దీనికి క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ గా ఉండేస‌రికి వారి వాద‌న‌కు బ‌లం చేకూరింది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా ఉంది. అక్ష‌య్ కుమార్ ను మొద‌ట నాస్తికుడిగా చూపించినా, అలాంటి వ్య‌క్తి స‌త్యాన్ని గ్ర‌హించి, రామ‌సేతు… రాముడి కాలం నాటిద‌ని గుర్తించి, కోర్టులో త‌న వాద‌న‌ను ఎలా వినిపించాడ‌నే దానికే ఇందులో ప్రాధాన్య‌మిచ్చారు. జ‌నాల‌కు చెప్పాల‌నుకున్న విష‌యం మీద ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు క్లారిటీ ఉన్నా, దాన్ని ఆస‌క్తిక‌రంగా అందించ‌డంలో మాత్రం విఫ‌లం అయ్యారు. సినిమా ప్రారంభం నుండి అదో డాక్యుమెంట‌రీలానే సాగింది. నాస్తికుడైన భ‌ర్త వ‌ల్ల స‌మాజంలో భార్య‌, కొడుకు ప‌డిన అవ‌మానాల‌ను హృద‌యానికి హ‌త్తుకునేలా ద‌ర్శ‌కుడు తీయ‌లేక‌పోయాడు. ఆర్కియాల‌జీ డిపార్ట్ మెంట్ నుండి స‌స్పెండ్ అయిన వ్య‌క్తి సినిమా క్ల‌యిమాక్స్ లో కోర్టు హాలులో ఏ హోదాతో త‌న వాద‌న‌ను వినిపించాడో మ‌న‌కు అర్థం కాదు! శ్రీలంక‌లో సివిల్ వార్ జ‌రుగుతోంది కాబ‌ట్టి, ఆ ప్రాంత ప‌రిధితో ఉన్న ఫ్లోటింగ్ రాక్ ను హీరో ముట్టుకోవ‌డ‌మే నేరంగా భావించి అత‌ని ప్రాజెక్ట్ మేనేజ‌ర్ ఆప‌రేష‌న్ ను అర్థంతరంగా ఆపేయ‌డానికీ కార‌ణం బోధ‌ప‌డ‌దు. ఇక త‌మ‌కే చెందిన ప్రొఫెస‌ర్ ను కాల్చేయ‌డం, హీరోయిన్ ను కిడ్నాప్ చేసి హీరోను త‌మ అధీనంలోకి తీసుకు రావ‌డం వంటి స‌న్నివేశాలు పాత చింత‌కాయ ప‌చ్చ‌డిని త‌ల‌పిస్తాయి.

రామ‌సేతు కాల నిర్ణ‌యం ప్ర‌ధానాంశంగా ఈ క‌థ సాగింది. దానికే దాదాపు రెండు గంట‌ల స‌మ‌యాన్ని ద‌ర్శ‌కుడు కేటాయించాడు. అయితే అదేమంత ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. అండ‌ర్ వాట‌ర్ సీన్స్ ఏమంత గొప్ప‌గా లేవు. నిజానికి ఇలాంటి సినిమాల‌ను చూసిన‌ప్పుడు రోమాలు నిక్క‌బొడుచుకోవాలి. థియేట‌ర్ లో కూర్చున ప్రేక్ష‌కులు ఓ ర‌క‌మైన ఉద్వేగానికి, ఉద్విగ్న‌త‌కు గురికావాలి. కానీ అలాంటి స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కులు రాసుకోలేదు, చిత్రీక‌రించ‌లేదు. అయితే స‌త్య‌దేవ్ పాత్రను మాత్రం మిస్టీరియ‌స్ గా మ‌లిచి కొంత‌లో కొంత దానికి ప్ర‌త్యేక‌త ఆపాదించారు. అది గుడ్డిలో మెల్ల‌!

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే… అక్ష‌య్ కుమార్ చాలా కూల్ గా ఈ పాత్ర‌ను చేశాడు. అత‌ని వేష‌ధార‌ణ విష‌యంలో డైరెక్ష‌న్ టీమ్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం అత‌ని గ‌డ్డం చూస్తే తెలిసిపోతుంది. ఇక అత‌ని భార్య‌గా న‌టించిన న‌స్ర‌త్ బ‌రూచా, ఎన్విరాన్మెంట‌లిస్ట్ గా న‌టించిన జాక్విలైన్ ఫెర్నాండేజ్ ల‌వి పెద్దంత ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు కాదు. హీరో ప‌క్క‌న ఎవ‌రో ఒక‌రు ఉండాలి కాబ‌ట్టి ఉన్న‌ట్టుగా ఉంది. షిప్పింగ్ ప్రాజెక్ట్ అధినేత‌గా నాజ‌ర్, అత‌ని స‌హాయ‌కుడిగా ప‌ర్వేష్ రానా బాగా న‌టించారు. స‌త్య‌దేవ్ ఎంట్రీ ఆల‌స్యంగా జ‌రిగినా… అక్క‌డి నుండి అత‌ను త‌న‌దైన మార్క్ ను క‌న‌బ‌రిచాడు. ఇటీవ‌లే వ‌చ్చిన ‘గాడ్ ఫాద‌ర్’ లో బ్యాడ్ గై గా న‌టించిన స‌త్య‌దేవ్ ఇందులో అందుకు పూర్తి భిన్న‌మైన పాత్ర‌ను పోషించాడు. ఉత్త‌రాదిన అత‌ని పాత్ర‌కు చ‌క్క‌ని గుర్తింపు ల‌భించే ఆస్కారం ఉంది. రామ‌సేతు నిర్మాణానికి శ్రీరాముడే కారణమని కోట్లాది మంది భార‌తీయులు న‌మ్ముతారు. వారి విశ్వాసాన్ని గౌర‌వించాల్సిన అవ‌స‌రం ప్ర‌తి ఒక్క‌రికీ ఉంది. దానిని ఓ సినిమాగా తీసి, ప్ర‌జ‌ల అభిప్రాయం ఇది అని చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి రావ‌డం నిజానికి బాధాక‌రం. అయితే… ఇలాంటి సినిమాల‌ను ఇంకాస్తంత జాగ్ర‌త్త‌గా, బాధ్య‌త‌గా తీసి ఉంటే ద‌ర్శ‌క నిర్మాత ల‌క్ష్యం నెర‌వేరేది. లేదంటే… కాసుల కోసం ఇలాంటి సినిమా తీశార‌నే అపప్ర‌ద త‌ప్ప‌దు.

రేటింగ్ : 2.25 /5

ప్ల‌స్ పాయింట్స్:
ఎంచుకున్న పాయింట్
సత్య‌దేవ్ న‌ట‌న‌
క్ల‌యిమాక్స్ లోని డైలాగ్స్

మైనెస్ పాయింట్స్:
బ‌ల‌హీన‌మైన క‌థ‌
ఆక‌ట్టుకోని క‌థ‌నం
ఉత్సుక‌త రేకెత్తించ‌ని సీన్స్

ట్యాగ్ లైన్: తెగిన సేతువు!

Show comments