NTV Telugu Site icon

RAM Movie Review: రామ్- రాపిడ్ యాక్షన్ మిషన్ రివ్యూ

Ram Movie

Ram Movie

RAM Movie Review:ప్రతివారం రెగ్యులర్ గా ఎన్నో కమర్షియల్ సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు మాత్రమే దేశభక్తి చిత్రాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తూ ఉంటారు మేకర్స్. అయితే దేశభక్తి చిత్రాలు మాత్రమే తీసుకొస్తే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వదు కాబట్టి దేశభక్తికి కమర్షియల్ అంశాలు జోడించి ఈమధ్య సినిమాలు చేస్తున్నారు. ఇక తాజాగా రామ్- రాపిడ్ యాక్షన్ మిషన్ అనే దేశభక్తి ఆధారిత సినిమా చేశారు. ఈ సినిమాకు సంబంధించిన హీరో, దర్శకుడు, నిర్మాతలు అందరూ కొత్తవారే కావడం గమనార్హం. ఈ దేశభక్తి చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి రివ్యూలో చూద్దాం పదండి.

రామ్ కథ విషయానికి వస్తే
మేజర్ సూర్య ప్రకాష్(రోహిత్) దేశం కోసం ప్రాణాలర్పిస్తాడు. కానీ మేజర్ సూర్య ప్రకాష్ కొడుకు సూర్య (అయ్యలసోమయాజుల) తన తండ్రి మరణం మీద ఏమాత్రం గౌరవం లేకుండా దేశానికి సేవ చేయడం అంటే ఆమడ దూరం పారిపోతూ ఉంటాడు. తన తండ్రి దేశానికి సేవ చేస్తూ చనిపోవడం వల్ల దిక్కులేని వాళ్ళం అయ్యామని చిన్నతనంలో కూడా తన తండ్రి తనతో ప్రేమగా ఉండలేకపోయాడని ఆయన మీద కోపం పెంచుకుంటాడు. అయితే తన తండ్రి స్నేహితుడైన మేజర్ జేబీ (భానుచందర్) సూర్య ప్రకాష్ కోరిక మేరకు రామ్ ను మిలిటరీలో చేరేలా కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. అయితే మరి తన తండ్రి మీద, దేశం మీద చాలా కోపం పెంచుకున్న రామ్ మిలిటరీలో జాయిన్ అయ్యాడా? ఈ రాపిడ్ యాక్షన్ మిషన్ ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ : రామ్ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమా దర్శకుడు తీసుకున్న పాయింట్ కొత్తదేమీ కాదని ఈజీగా అర్థమయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే భారత దేశంలో ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కేవలం బోర్డర్ దాటి మన దేశంలో వచ్చే ఇతర దేశాలకు చెందిన శత్రువులు మాత్రమే కాదు మన దేశంలో ఎంతో ప్రమాదకరమైన వ్యక్తులను ఆయా దేశాల వారు తయారు చేస్తున్నారు అనే విషయం మనం గతంలో ఎన్నో సినిమాల్లో చూసాం. ఇక్కడ డైరెక్టర్ కూడా దాదాపు అదే పాయింట్ తీసుకున్నాడు. తీసుకున్న సెట్ అప్ కూడా చాలా పాతదే కానీ కథనాన్ని నడిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ తన తండ్రి దేశం కోసం ప్రాణాలర్పిస్తే దానివల్ల తమ నష్టపోయామని భావించే ఒక వ్యక్తి ఒక ఆర్మీ అధికారిగా మారితే అతను దేశం కోసం ఎలా పనిచేశాడు అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు. దేశంలో ఒక మతానికి చెందిన వారు ఇతర దేశాల శత్రువులకు ఎలా స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారు. వారికి రాజకీయ నాయకులు ఎలా ఉపయోగపడుతున్నారు? లాంటి విషయాలను ఆసక్తికరంగా చూపించారు. అయితే పాయింట్ బాగానే ఉంది కానీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ మీద తీసుకురాలేకపోయాడు అనిపిస్తుంది. ఉగ్రవాదం, పాకిస్తాన్ అక్కడి వారి కోసం పనిచేసే ఇండియాలోని స్లీపర్ సెల్స్ లాంటి విషయాలు మనం గతంలోనే ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ ఈ సినిమాలో ఎందుకు కన్వెన్సింగ్ అనిపించదు. అయితే క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా రాసుకున్నాడు. ప్రతి ఒక్క ఇండియన్ కి రోమాలు నిక్కబడుచుకునేలా క్లైమాక్స్ సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా భారతదేశ జండా కనిపించే ఒక షాట్, హిందూ ముస్లిం భాయి భాయి అనిపించేలా చూపించే ఒక షాట్, ఒక హిందూ అధికారికి ముస్లిం పౌరుడు సహాయం చేసే సీన్ వంటి వాటిని గూజ్ బంప్స్ తెప్పించేలా డైరెక్ట్ చేయడంలో సఫలం అయ్యాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే రం పాత్రలో సూర్య అయ్యలసోమయాజుల కరెక్ట్ గా సెట్ అయ్యాడు. దేశభక్తి అంటే గిట్టకుండా సరదాగా టైం పాస్ చేసే కుర్రాడిగా ఒక పార్ష్యంతో పాటు దేశభక్తితో ఎదిగిన ఒక సిన్సియర్ ఆఫీసర్గా కూడా మరోపార్శాన్ని చూపించి భలే ఆకట్టుకున్నాడు. కేవలం యాక్షన్ సీన్స్ లోనే కాదు ఎమోషన్స్ తో పాటు కామెడీ కూడా చేస్తూ సూర్య అసలు ఏ మాత్రం మొదటి సినిమా చేస్తున్నాడు అని అనిపించకుండా ఆకట్టుకున్నాడు. ఇక రోహిత్ కూడా చాలా రోజులకు ఒక మంచి పాత్రలో మెరిశాడు అనిపించింది. భానుచందర్ కూడా ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకునేలా నటించాడు. సాయికుమార్ పలికిన డైలాగ్ తో పాటు ఆయన యాక్షన్ వారెవా అనిపిస్తుంది. శుభలేఖ సుధాకర్ వంటి వారు తమ అనుభవాన్ని రంగరించి తమ పాత్రలలో ఆకట్టుకున్నారు. ధన్య పాత్ర ఆసక్తికరంగా ఉంది రవివర్మ, మీనా వాసు, బాషా అంటూ ఇలా మిగిలిన పాత్రధారులు అందరు తమ పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఆశ్రిత్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమాటోగ్రఫీ క్లైమాక్స్ షాట్స్ తోటే తన పనితనం అంతా కనిపించేలా ప్లాన్ చేసుకున్నారు. డైలాగ్స్ కూడా హార్ట్ కి టచ్ అయ్యేలా రాసుకోవడంలో టీం సక్సెస్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా రామ్ ఒక పేట్రియాటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్. కొన్ని గూజ్ బంప్స్ తెప్పించే సీన్లు సినిమాకి ప్లస్.