NTV Telugu Site icon

Rakshana Review: పాయల్ రాజ్ పుత్ రక్షణ రివ్యూ

Rakshana Movie Review

Rakshana Movie Review

Rakshana Movie Review: ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల అందరి మది దోచిన పాయల్ రాజ్ పుత్ తర్వాత చాలా రకాల సినిమాలు చేసింది. అయితే ఆర్ఎక్స్ 100 సినిమా హిట్ అయిన వెంటనే ఆమె రక్షణ అనే ఒక పోలీస్ సినిమాకి కూడా సైన్ చేసింది. పలు కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్ తో ప్రేక్షకులందరి అటెన్షన్ ని గ్రాబ్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
కిరణ్(పాయల్ రాజ్ పుత్) ఒక ఐపీఎస్ అధికారిణి. ఆమె ట్రైనింగ్ లో ఉండగానే ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని మరణిస్తుంది. అయితే ఆమె మరణించిన సమయంలో ఒక లాలీపాప్ తో ఉన్న వ్యక్తి ఆమె మరణాన్ని ఎంజాయ్ చేసినట్లు ఆమె ఫీల్ అవుతుంది. . ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పిన వాళ్ళు పట్టించుకోరు. అయితే కిరణ్ పోలీసు అధికారిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా ఆమెకు ఒక అమ్మాయి కేసు విషయంలో అరుణ్(మానస్ నాగులాపల్లి) ఎదురవుతాడు. అతని మనస్తత్వం చూసి అతని తన స్నేహితురాలి సూసైడ్ కి కూడా కారణమేమో అనే అనుమానం కూడా కిరణ్ కి వస్తుంది. అయితే అనూహ్యంగా అరుణ్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాడు అరుణ్ సూసైడ్ చేసుకోవడానికి కారణం కిరణే అని చెప్పి ఆమెను పోస్ట్ నుంచి సస్పెండ్ చేస్తారు. అయితే సస్పెండ్ అయిన తర్వాత చాలామంది అమ్మాయిలు చనిపోతున్నారు అని అయితే వాళ్లందరికీ ఒక కామన్ పాయింట్ ఉందని కిరణ్ పసిగడుతుంది. అయితే కిరణ్ పసిగట్టిన ఆ కామన్ పాయింట్ ఏంటి? ఎందుకు అమ్మాయిలను లాలీపాప్ కిల్లర్ చంపుతున్నాడు? అసలు ఈ కేసుని కిరణ్ ఎలా హ్యాండిల్ చేసింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ: ఒక నిజాయితీ గల పోలీసు అధికారికి అంతుచిక్కని కేసు దొరకడం, దాన్ని ఎన్నో తంటాలు పడి సాల్వ్ చేయడం లాంటి కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఈ సినిమా కూడా అలాంటి తరహా కథతోనే తెరకెక్కింది. అయితే ఇప్పటి వరకు రొమాంటిక్ ఇమేజ్ ఉన్న పాయల్ రాజ్ పుత్ మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో ఐపీఎస్ అధికారిగా కనిపించింది. అది కొంత కొత్త పాయింట్ అనుకోవచ్చు. ఒకరితో ఒకరికి సంబంధంలేని అమ్మాయిలు అనూహ్యమైన పరిస్థితుల్లో కొందరు యాక్సిడెంట్లలో, మరికొందరు సూసైడ్ చేసుకుని మరణించడం. అసలు వాళ్ళకి ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక పోలీసు అధికారి వాటన్నింటినీ ఒక త్రెడ్ లాగా చూసి సాల్వ్ చేయాలనుకోవడం కాస్త ఆసక్తికర అంశమే. అయితే స్క్రీన్ ప్లేని మరింత పగడ్బందీగా రాసుకొని ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేదేమో. కానీ కొన్ని సీన్స్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అంతా వరుస మరణాలు, వాటికి కారణాలు వెతికే పనిలో ఉండగానే విరామం వచ్చేస్తుంది. తర్వాత అయినా కధ పరుగులు పెడుతుందా? అంటే అక్కడ కూడా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివరికి ముగించిన విధానం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో చేస్తున్నట్టు అన్ని సినిమాల లాగానే సీక్వెల్ ప్రకటించలేదు. కాకపోతే పోలీసులు కేసులను సాల్వ్ చేసే విధానాన్ని వాళ్లు లైట్ తీసుకునే విధానాన్ని బాగా దగ్గర నుంచి చూసి సినిమా చేసినట్లు అనిపించింది. లైన్ గా రాసుకున్న కథ బాగానే ఉన్నా తెరకెక్కించే విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.

నటీనటుల విషయానికి వస్తే పాయల్ రాజ్పుత్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా ఆకట్టుకునేలా నటించింది. ఇప్పటివరకు గ్లామర్ భామ అనే ముద్ర ఉన్న ఆమెకు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చేదే. ఫైట్ సీక్వెన్స్ లలో కూడా ఆమె ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. విలన్ గా నటించిన రోషన్ నటన బాగుంది. మిగతా పాత్రధారులు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఇక కొన్ని డైలాగులు ఆలోచింపజేసే విధంగా రాసుకున్నారు. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు పెద్దగా గుర్తుంచుకో తగినట్టు లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ ని క్యారీ చేసేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ రక్షణ పాయల్ రాజ్ పుత్ లో కొత్త కోణాన్ని చూపిన క్రైమ్ థ్రిల్లర్