NTV Telugu Site icon

Jigarthanda Double X Review: జిగర్ తండా డబుల్ ఎక్స్ రివ్యూ

Jigarthanda Double X

Jigarthanda Double X

Jigarthanda Double X Review: ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు పిజ్జా, జిగర్ తండా చిత్రాలతో ఫేమస్ అయ్యాడు, ఆయన ఇప్పుడు జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాను రూపొందించారు. రాఘవ లారెన్స్, ఎస్జే.సూర్య కీలక పాత్రల్లో తెరకెక్కిన జిగర్ తండా డబుల్ ఎక్స్ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం 2015 సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కి సీక్వెల్ అని చెబుతున్నా దానికి కొనసాగింపు కాదని, కొత్త గ్యాంగ్‌స్టర్ డ్రామా అని ముందే ప్రకటించారు. నిమిషా సజయన్, సంచనా నటరాజన్, నవీన్ చంద్ర, షైన్ చాం టాకో ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. దీపావళి కానుకగా ఈరోజు (నవంబర్ 10న) ఈ సినిమాను రిలీజ్ చేయగా సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

జిగర్ తండా డబుల్ ఎక్స్ కథ:
1970లలో ఉమ్మడి ఏపీకి ఒక స్టార్ హీరో(షైన్ చాం టాకో) సహా మరో నలుగురు సీఎం అయ్యేందుకు పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారిలో ఒకరి వద్ద రౌడీయిజం చేసే కర్నూలుకు చెందిన జిగర్ తండా మర్డర్ క్లబ్ అధ్యక్ష్యుడు సీజర్(లారెన్స్)ను చంపేందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న రే దాసన్(ఎస్జే సూర్య)ను స్టార్ హీరో తమ్ముడైన డీఎస్పీ(నవీన్ చంద్ర) రంగంలోకి దింపుతాడు. హీరో అవ్వాలని ప్రయత్నిస్తున్న సీజర్ దగ్గరకు దర్శకుడిలా వెళ్లిన రే దాసన్ ఎలా అయినా అతని వెంటనే ఉంటూ చంపడానికి ప్రయత్నిస్తాడు. అది తన వల్ల కాదని తెలిసి ఒక స్కెచ్ వేస్తాడు. అయితే ఈ క్రమంలోనే సీజర్ మీద రే దాసన్ కి మంచి అభిప్రాయం కలుగుతుంది. తాను జైలుకు వెళ్ళడానికి సీజర్ కారణమని తెలిసి అతన్ని ఎలా అయినా చంపాలనుకున్న రే సీజర్ ను కాపాడేందుకు ఎందుకు ప్రయత్నించాడు? అసలు రే ఎందుకు సీజర్ ను మెచ్చాడు? కర్నూల్ లో ఉండే సీజర్ ను మళ్ళీ తన అడవికి ఎందుకు రే తీసుకు వెళ్ళాడు? చివరికి సీజర్ అడవికి వెళ్లి ఏం చేశాడు? సీఎం ఎవరు అయ్యారు? అనేదే సినిమా కథ.

విశ్లేషణ:
ఈ సినిమా 2014లో వచ్చిన తమిళ జిగర్ తండా సినిమాకు సీక్వెల్ అని ప్రకటించినా రెండు కథలకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అందుకు తగినట్టుగానే ఈ రెండవ వెర్షన్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ కథను రాసుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. ఒకపక్క గ్యాంగ్ స్టర్ డ్రామాగా సినిమాను నడుపుతూనే మరో పక్క పొలిటికల్ అంశాలను టచ్ చేస్తూ మరోపక్క ఆదివాసీల కష్టాలు అంటూ వేర్వేరు లేయర్స్ ను టచ్ చేశాడు. మొదటి భాగం లాగానే ఇక్కడ కూడా ఒక గ్యాంగ్ స్టర్ కి సినిమా హీరో అవ్వాలనే కోరిక కలగడం ఆ కోరిక మేరకు హీరో అవ్వాలని ప్రయత్నించడం చూపించారు. అయితే నేరుగా కంటెంట్ లోకి తీసుకు వెళ్లకుండా సాగతీసిన క్రమం మాత్రం సహనానికి పరీక్ష పెడుతుంది. నిజానికి మొదటి భాగం అంతా పొలిటికల్ ఫైట్, ఆ ఫైట్ లో లారెన్స్ ను ఎలా టార్గెట్ చేశారు? సూర్య ఎలా లారెన్స్ ను చంపే ప్రయత్నం చేశాడు? లాంటి విషయాలను చూపించే ప్రయత్నం చేసి ఇంటర్వెల్ ముందు కాస్త సినిమాపై ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేసినా సెకండ్ హాఫ్ లోకి వెళ్ళాక కూడా మళ్ళీ చాలా సేపు కధను తిప్పిన చోటే తిప్పుతూ ఎప్పటికో ప్రీ క్లైమాక్స్ కి కానీ ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే హై మూమెంట్స్ ప్లాన్ చేయలేకపోయారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా కథ ట్రాజెడితో ముగించినా మంచి మెసేజ్ ఇచ్చినట్టు కనిపిస్తూనే మరో పక్క కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవకుండా చూసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కానీ ఓవరాల్ గా మాత్రం సాగతీసిన ఫీలింగ్ కలుగక మానదు.

నటీనటుల విషయానికి వస్తే అలియాస్ సీజర్ అనే పాత్రలో లారెన్స్ జీవించాడు. అసలు ఏమాత్రం జాలి కరుణ దయ లాంటి లక్షణాలు లేని ఒక అడవి జంతువు లాంటి పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడేమో అనిపించేలా నటించాడు. ఆ తరువాత మారిపోయిన మనిషిగా చూపించే వేరియేషన్స్ కూడా చాలా చక్కగా ఎవరూ వంక పెట్టలేని విధంగా నటించాడు. ఇక పిరికివాడైన వ్యక్తిగా రే దాసన్ అనే పాత్రలో ఎస్జె సూర్య కూడా ఒదిగిపోయాడు. పిరికితనాన్ని లోపల దాచుకుంటూ బయటకు గంభీరమైన వ్యక్తిగా కనిపించే కొన్ని సీన్స్ లో మాత్రం నటనతో లారెన్స్ తో పోటాపోటీగా నటించాడు. ఇద్దరూ ఉన్న కాంబినేషన్ సీన్స్ అన్నీ అదేవిధంగా పోటాపోటీ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నిమిష సజయన్ కనిపించేది కొన్ని సీన్లలోనే అయినా ఆమె తనదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. నవీన్ చంద్ర క్రూరుడైన పోలీస్ అధికారి పాత్రలో ఆకట్టుకున్నాడు. షైన్ చాం టాకో కూడా కన్నింగ్ హీరోగా తన పరిధి మేర నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులు అందరూ తమ తమ పరిధి మేరకు నటించారు

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమాకి దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు తన పూర్తి ఎఫర్ట్ పెట్టినట్లు అనిపించింది కానీ అవేమీ పూర్తి స్థాయిలో సినిమాకి ఉపయోగపడలేదు. చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే కానీ అటు తిప్పి ఇటు తిప్పి రకరకాల లేయర్స్ కలిపే సరికి మొదటికే మోసం వచ్చిందా? అన్నట్లుగా మారింది పరిస్థితి. అయితే తెలుగులో డైలాగ్స్ బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కూడా సో సో అనిపిస్తుంది కానీ కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఆర్ట్ టీమ్ కష్టం అన్ని ఫ్రేమ్స్ లో కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ: జిగర్ తండా డబుల్ ఎక్స్ సాగతీసిన గ్యాంగ్ స్టర్ డ్రామా.. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళితే కొంతమేరకు నచ్చే అవకాశాలున్నాయి.