NTV Telugu Site icon

Darling Movie Review: లేడీ అపరిచితురాలు ‘డార్లింగ్’.. ఎలా ఉందంటే?

Darling Movie Review

Darling Movie Review

Priyadarshi Darling Movie Review: హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తమ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సంయుక్తంగా డార్లింగ్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హనుమాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా డార్లింగ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. తమిళ్ లో ఒక సినిమా చేసిన అనుభవం ఉన్న అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా ఈ డార్లింగ్ అనే సినిమా తెరకెక్కింది. మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్ అంటూ ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

డార్లింగ్ కథ :
ఒక ట్రావెల్ కంపెనీలో పనిచేసే రాఘవ (ప్రియదర్శి) ఎప్పటికైనా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను ప్యారిస్ హనీమూన్ తీసుకువెళ్లాలని కలతోనే జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ రోజుల్లో పెళ్లి అవటమే కష్టం కావడంతో అతనికి పెళ్లి ఒక పెద్ద ఇబ్బందికర అంశంగా మారిపోతుంది. అతనికి ఒకరోజు తన చిన్ననాటి స్నేహితురాలు నందిని (అనన్య నాగళ్ళ) తో వివాహం నిశ్చయం అవుతుంది. అయితే రాఘవ పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత నందిని తనకు నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోతుంది. పెళ్లి విఫలం కావడంతో చనిపోవడానికి సూసైడ్ పాయింట్ కి వెళ్లిన రాఘవకి ఆనంది (నభా నటేష్) పరిచయం అవుతుంది. తాను చావకుండా ఉండడానికి కారణం ఆమేనని భావించి ఆమెను వివాహం చేసుకోవాలని రాఘవ ప్రపోజల్ పెడతాడు. నందిని వెంటనే ఓకే చెబుతుంది. ఉదయం 6 గంటలకు పరిచయమైన వీరు మధ్యాహ్నం లోపు వివాహం చేసేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ రోజే రాఘవకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అప్పటివరకు ఎంతో ఆనందంగా సాగుతున్న అతని జీవితం ఒక్కసారిగా తలకిందులు అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలో అసలు రాఘవ ఆనందితో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ఆనంది గురించి రాఘవకి తెలిసిన షాకింగ్ విషయం ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే ఒక సమస్యతో ఇప్పటికే మనం పలు సినిమాలు చూసాం. అయితే ఈ సమస్య చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చే సినిమా అపరిచితుడు. దాదాపు ఇలాంటి జబ్బు ఒక అమ్మాయికి వస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? అనే లైన్ తో ఈ సినిమా రాసుకున్నాడు దర్శకుడు. మొదటి భాగంలో హీరో క్యారెక్టర్ ని పాయింట్ టు పాయింట్ ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు హీరోయిన్ క్యారెక్టర్ ని మాత్రం క్వశ్చన్ మార్క్ గానే ఉంచాడు. అయితే హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకోవడంతో ఫస్ట్ ఆఫ్ కాస్త లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.. అయితే ఆ ఫీలింగ్ ను కవర్ చేయడానికి డైరెక్టర్ కామెడీని ప్రధాన అస్త్రంగా వాడుకున్నాడు. అది చాలాచోట్ల బాగా వర్క్ అవుట్ అయింది ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ తో పలికించే డైలాగులు ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్విస్తాయి. అయితే ప్రియదర్శి క్యారెక్టర్ నీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం తీసుకున్న సమయం ఫస్ట్ ఆఫ్ కి కాస్త ఇబ్బందికర అంశమే. ఎప్పుడయితే హీరోయిన్ కి ఉన్న డిజార్డర్ బయట పడుతుందో అప్పటినుంచి కథ కాస్త వేగం పుంజుకుంటుంది. అయితే ఇంటర్వెల్ సమయానికి అసలు కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినందుకు ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పెద్దగా సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచలేదు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఆనంది డిసార్డర్ గురించి మరిన్ని విషయాలు బయటకు రావడం, ఆ తర్వాత సాగే సన్నివేశాలకి ఈసారి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చాడు డైరెక్టర్. ఫస్టాఫ్ అంతా నవ్వించిన డైరెక్టర్ సెకండ్ ఆఫ్ లో మాత్రం ఎమోషనల్ టచ్ ఇవ్వడం ఆడియన్స్ కి పెద్దగా ఎక్కకపోవచ్చు. అయితే సెకండ్ హాఫ్ని డీల్ చేసిన విధానం మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఆనంది బాధను చూపిస్తున్న విధానం కొన్నిచోట్ల ఆలోచింపచేసే విధంగా ఉన్నా దాన్ని ప్రేక్షకుడు ఎంటర్టైన్ అయ్యే విధంగా తీర్చి దిద్దడంలో మాత్రం తడబడ్డాడు. అయితేసంబంధాలు కోసం మ్యాట్రిమోని సైట్లలో ప్రొఫైల్స్ వెతికే సమయంలో అమ్మాయిలు చెప్పే కోర్కెలు, మండపంలో పెళ్లి ఆగిన తర్వాత వచ్చే సన్నివేశాలు, ప్రియదర్శిని నభా నటేష్ చితక్కొట్టిన ఎపిసోడ్స్ లాంటివి పూర్తిగా ప్రేక్షకులను నవ్వించడం కోసమే రాసుకున్నారు. ఆ విషయంలో సంపూర్ణంగా సఫలమయ్యారు. అయితే నవ్వించడంలో పూర్తిస్థాయిలో మార్కులు కొట్టేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్స్ని కనెక్ట్ చేసే విషయంలో మాత్రం ఎందుకో తడబడ్డాడు. ఆనంది ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంటుందనుకుంటే ఇంకేదో చూపించి నీరసపరిచాడు. ఆ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే డార్లింగ్ రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రియదర్శి నటనకు ఎక్కువ మార్కులు పడతాయి. నిజానికి ఇలాంటి పాత్రలో ఆయనకి కొత్త ఏమీ కాదు. మల్లేశం, బలగం లాంటి సినిమాల్లో ఆకట్టుకున్న ప్రియదర్శి ఈ సినిమాలో కూడా తనదైన శైలిలో నటించాడు. కొన్నిచోట్ల నటించాడు అనడం కంటే జీవించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రియదర్శి కామెడీ టైమింగ్ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక నభా నటేష్ విషయానికి వస్తే ఆమెది సినిమాకు ప్రధానమైన పాత్ర. కథ అంతా ఆమె చుట్టే తిరుగుతుంది. అయితే ఆమెకు ఆరు పాత్రలు చేసే అవకాశం దక్కింది. మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే ఒక జబ్బు కారణంగా ఆమె ఆరు పాత్రల స్వభావాలను పలికించాల్సి వచ్చింది. కొన్ని పాత్రల విషయంలో అదరగొట్టేసిన ఆమె మరికొన్ని పాత్రల విషయంలో మాత్రం ఇదేంటిరా బాబు అనిపించింది. డబ్బింగ్ సింకు కాకపోవడం కొన్ని పాత్రల హావభావాలు పలికించెప్పుడు ఇబ్బందికరమనిపించాయి. అయితే ఏ నటుడికైనా నటికైనా ఇలాంటి ఒక పాత్ర లైఫ్ టైం లో పడటం అదృష్టం అలాంటి అదృష్టాన్ని నభా దక్కించుకుంది. హీరో స్నేహితులుగా నటించిన కృష్ణ తేజ విష్ణు అదరగొట్టారు. అనన్య నాగళ్ళ ఒక రకంగా ఎక్స్పెండెంట్ కామ్యో చేసింది ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మురళీధర్ గౌడ్ కామెడీ కూడా సినిమాకి బాగా వర్కౌట్ అయింది. రఘుబాబు కనిపిస్తుంది రెండు మూడు సీన్లలోనే అయినా ఎమోషనల్ గా బాగా ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా డైలాగు రైటర్ కి అందరికన్నా ఎక్కువ మార్కులు పడతాయి. ఒక తమిళ్ డైరెక్టర్ విజన్ కి తన డైలాగులు జోడించి సినిమాని వేరే లెవెల్ కి తీసుకు వెళ్ళాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు అర్థవంతంగా ఉన్నా గుర్తుంచుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల బాగా వర్క్ అవుట్ అయింది కొన్ని చోట్ల కాలేదు. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది ప్రతి ఫ్రేమ్ ని కలర్ ఫుల్ గా చూపించారు. ఇక హనుమాన్ నిర్మాతల నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? టాప్ నాచ్ అంతే. అయితే నిడివి విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

ఫైనల్లీ డార్లింగ్ అనేది ఒక ఎమోషనల్ ఫన్ రైడ్.. పెళ్లి కావలసిన వాళ్లకు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది.

Show comments