NTV Telugu Site icon

Prince Movie Review: ప్రిన్స్ (తమిళ డబ్బింగ్)

Prince

Prince

Prince Movie Review: ‘జాతిరత్నాలు’తో చక్కని గుర్తింపు పొందిన దర్శకుడు అనుదీప్ డైరెక్ట్ చేసిన సినిమా ‘ప్రిన్స్’. దీంతో అతను కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి స్టార్ హీరో శివ కార్తికేయన్ తో అనుదీప్ దీన్ని తెరక్కించాడు. విశేషం ఏమంటే ఈ మూవీని తెలుగు నిర్మాతలైన సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్, సురేశ్ బాబు నిర్మించారు. మరి ‘డాక్టర్’, ‘డాన్’తో ఇప్పటికే రెండు హిట్స్ ను బ్యాక్ టూ బ్యాక్ తన ఖాతాలో వేసుకున్న శివ కార్తికేయన్ కు ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకుందాం..

కృష్ణాజిల్లా దేవరకోటకు చెందిన ఆనంద్ ఓ స్కూల్ లో సోషల్ టీచర్ గా వర్క్ చేస్తుంటాడు. అతని తండ్రి విశ్వనాథం ఊరంతటికీ పెద్దమనిషి. కులమతాలకు అతీతంగా మనుషులు మెలగాలని హితబోధ చేస్తుంటాడు. తన కూతురు.. చెల్లెలి కొడుకును చేసుకుందని ఆమెతో సంబంధాలు కూడా తెగతెంపులు చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి  కొడుకైన ఆనంద్ తన స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ అయిన బ్రిటీష్ యువతి జెస్సికాను ప్రేమిస్తాడు. కులమతాల బేధం లేని విశ్వనాథం ఈ పెళ్ళికి మాత్రం ససేమిరా అంటాడు. అంతేకాదు.. ఊరి జనం కూడా ఆనంద్ ను వెలివేయడానికి సిద్ధపడతారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఆనంద్ ఏం చేసి..  తన తండ్రిని, ఊరి జనాన్ని మెప్పించాడు? అసలు ఊరు జనం ఎప్పుడో మన దేశం వదిలి వెళ్లిపోయిన బ్రిటీషర్స్ పై ఇప్పుడెందుకు కక్ష పెంచుకున్నారు? ఈ మొత్తం వ్యవహారంలో భూపతి తన స్వార్థం కోసం విశ్వనాథంను ఎలా పావుగా వాడుకున్నాడు? అనేదే సినిమా కథ.

అనుదీప్ తెరకెక్కించిన ‘జాతిరత్నాలు’ మూవీ ఘన విజయం సాధించడంలో అందరూ అతని దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయిపోయారు. బట్… ఆ తర్వాత అతను కథను అందించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ అట్లర్ ఫ్లాప్ కావడంతో, అందురిలో అనుమాన బీజం మొలకెత్తింది. ‘ప్రిన్స్’ పరిస్థితి ఎలా ఉంటుందో అని సందేహ పడ్డారు. కామెడీ సినిమాలకు తమిళనాట కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శివ కార్తికేయన్ కు, అనుదీప్ సరైనా జోడీ అని భావించినా.. ఎక్కడో ఏదో సందేహం సినీ జనాల్లోనూ ఉంది. అయితే.. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, తనదైన కామెడీ టచ్ తో అనుదీప్ గట్టెక్కేశాడు. బ్రిటీష్ వనితను ప్రేమించడం అనేది యాదృచ్ఛికంగా జరిగినా, ఊరి జనం అతని మీద ద్వేషం పెంచుకోవడానికి మంచి రీజన్స్ ను అనుదీప్ తయారు చేశాడు. కానీ ఇంతా చేసి క్లయిమాక్స్ లో కాలెత్తేశాడు! దేశభక్తి ప్రధానమా? హ్యుమానిటీ ప్రధానమా? అనే అంశాన్ని లేవనెత్తి.. దేశభక్తిలో హ్యుమానిటీ లేదనే భావన తీసుకొచ్చాడు. పోనీ ఆ హ్యుమానిటీని అయినా అర్థం చేసుకుని జనం అతని ప్రేమకు ఆమోద ముద్ర వేశారా అంటే అదీ లేదు! థియేటర్లో కాసేపు నవ్వుకోవడానికి తప్పితే, ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

శివ కార్తికేయన్.. సోషల్ టీచర్ ఆనంద్ గా చలాకీగానే నటించాడు. కానీ సోషల్ టీచర్ కు ఉండాల్సిన కనీస లక్షణాలను కూడా ఆ పాత్రకు ఆపాదించలేదు. సహజంగా మన సినిమాల్లో హీరో పక్కన కమెడియన్ ఉంటాడు.. కానీ ఇందులో హీరోనే కమెడియన్! అలానే విశ్వనాథం పాత్ర పోషించిన సత్యరాజ్ దీ అదే పరిస్థితి. అతని క్యారెక్టరైజేషన్ కూడా కామెడీనే సాగుతుంది. మనిషిలో విషయం లేకపోయినా గుర్తింపు కోసం తాపత్రయ పడిపోతుంటుందా పాత్ర. ఇందులో కాస్తంత సీరియస్ పాత్ర ఏదైనా ఉందంటే అది హీరోయిన్ జెస్సికా పాత్రే. గంగై అమరన్ కుమారుడు ప్రేమ్ జీ విలన్ కాని విలన్ గా కనిపిస్తాడు. మిగిలిన పాత్రల్లో అత్యధికులు తమిళులే! కామెడీ సీన్స్ రాసుకుని, సినిమాను నడిపేశారు తప్పితే, ఎక్కడ లాజిక్ అనేది కనిపించదు. థమన్ సాంగ్స్ ఏవీ ఆకట్టుకునేలా లేవు. దాంతో రామజోగయ్య శాస్త్రి సాహిత్యమూ పెద్దంత గొప్పగా అనిపించలేదు. అయితే.. భీమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ‘జాతిరత్నాలు’ను ఊహించుకుని థియేటర్ కు వెళితే నిరాశకు గురికాక తప్పదు. బట్.. టైమ్ పాస్ కేటగిరిలో ‘ప్రిన్స్’ను వేయొచ్చు!

ప్లస్ పాయింట్స్
కామెడీ ఎంటర్ టైనర్
భీమ్ శ్రీనివాస్ డైలాగ్స్
మూవీ రన్ టైమ్

మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
ఆకట్టుకోని కథనం
పూర్ క్లయిమాక్స్

రేటింగ్: 2.5/ 5

ట్యాగ్ లైన్: ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్!

Show comments