NTV Telugu Site icon

Premalu Review: ప్రేమలు రివ్యూ

Premalu Review

Premalu Review

Premalu Movie Review: గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ మూవీ ప్రేమలు చర్చనీయాంశంగా మారింది. కేవలం సుమారు 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నస్లెన్ కె. గఫూర్ – మమిత బైజు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమాను తెలుగులో రాజమౌళి కొడుకు కార్తికేయ రిలీజ్ చేసాడు.
మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

ప్రేమలు కథ:
కేరళకు చెందిన సచిన్ (నాస్లెన్ కె. గఫూర్) ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. తన పిరికితనంతో తన కాలేజీలో ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయలేక దూరమవుతాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత, అతను లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా రిజెక్ట్ అవుతుంది. అయితే ఒక పక్క లవ్ ఫెయిల్, మరోపక్క వీసా మిస్ కావడంతో తన స్వగ్రామంలో ఉండటానికి సచిన్ కి మనసొప్పదు. ఈ విషయంలో సహాయం చేయమని తన స్నేహితుడు అమల్ డేవిస్ (సంగీత్ ప్రతాప్)ని అడుగుతాడు. హైదరాబాద్‌లో గేట్ కోచింగ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్, సచిన్‌ను తన వెంట తీసుకువెళతాడు. మరొక పక్క కేరళకే చెందిన రీను(మమిత బైజు) సాఫ్ట్ వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. ఇక ఈ క్రమంలో సచిన్ రీనుని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే రీనుని ఇష్టపడుతున్న ఆది(శ్యామ్ మోహన్) సచిన్ కి అన్నిట్లో అడ్డు పడుతూ ఉంటాడు. మరి సచిన్ ఈసారి అయినా రీనుకి తన ప్రేమను వ్యక్త పరుస్తాడా? తన ఐడియల్ హస్బెండ్ క్వాలిటీస్ ఏమాత్రం లేని సచిన్ ను రీను ఒప్పుకుందా? మధ్యలో ఆది ఏం చేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
కథగా చూసుకుంటే ఇదేమీ అద్భుతం కాదు. అప్పుడే ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఇద్దరు భిన్న మనస్తత్వాలకు చెందిన వ్యక్తులు ప్రేమలో పడితే? అనే లైన్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. నిజానికి ఇలాంటి సినిమాలను డీల్ చేయడం కత్తి మీద సాము లాంటి విషయం. కానీ గిరీష్ తన గత సినిమాల అనుభవంతో చాలా క్లీన్ గా ఎలాంటి అసభ్యతకు తావివ్వకుండా అన్ని వయసుల వారు మెచ్చేలా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. కామెడీ కోసం కూడా బూతులు వెతుక్కుంటున్న ఈ రోజుల్లో సందర్భానుసారం అమాయకంగా పాత్రధారులు మాట్లాడే మాటలతో కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేసి అందులో సఫలం అయ్యారు మేకర్స్. రోజువారీ మన మాటల మధ్య దొర్లే సంభాషణల నుంచి తీసుకున్న కామెడీ ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. ముఖ్యంగా సచిన్ – అమల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మనలో ప్రతిఒక్కరికీ ఉండే ఒక బెస్ట్ ఫ్రెండ్ ను గుర్తుచేస్తుంది. ఇక రొమాంటిక్ కామెడీ అనే ప్రచారం ఉన్నా సచిన్ – రీను మధ్య ఇంటిమెంట్ రొమాన్స్ లేదు. అన్నీ కళ్ళతోనే అన్నట్టు వారి చిలిపి మాటలు, చూపులు మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకు పోతాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమంటే కథ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక వచ్చే ప్రదేశాలు మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ ను అంత అందంగా చూపించడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రేమ కోసం తపన పడే అమాయకమైన సచిన్‌గా నాస్లెన్ గఫార్ కి ఒక మంచి పాత్ర పడింది. ఇక మనోడు ఈ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. చాలా మంది కుర్రాళ్ళు కనెక్ట్ అయ్యేలా సచిన్ పాత్రలో నాస్లెన్ ఒదిగిపోయాడు. ఇక మరోపక్క రీనూ పాత్రలో మమిత బైజు తెరపై చాలా క్యూట్‌గా ఉంది. సచిన్ పాత్రతో రీను పాత్ర చేసే క్యూట్ ఇంటిమసీలెస్ రొమాన్స్ చూడడానికి భలే ఉంటుంది. అమల్‌గా సంగీత్ ప్రతాప్ అదరగొట్టాడు. కార్తీక పాత్రలో నటించిన అఖిలా భార్గవన్ కూడా ఆకట్టుకుంది. ఇక ఆది పాత్రలో శ్యామ్ మోహన్ పాత్రకి కూడా మంచి నటించే స్కోప్ దొరికింది. ఇక మిగతా పాత్రధారులు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే కనుక విష్ణు విజయ్ సంగీతం భలే ఉంది. కేజీ మార్కోస్ రూపొందించిన ‘తెలంగాణ బొమ్మలు’ ప్రత్యేకంగా అనిపించింది. ఇక అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది, విజువల్స్ లో హైదరాబాద్ ను చూస్తే ఇది మనం రోజూ తిరిగే హైదరాబాద్ ఏనా? అని అనుమానం కలిగించేలా ఉన్నాయి. ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ బాగా సూట్ అయ్యాయి.90స్ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ అందించిన ఈ డైలాగ్స్ ఫేమస్ అలాగే ట్రెండింగ్ డైలాగ్స్ తో పాటు కొన్ని మీమ్ రిఫరెన్సులు వాడడంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళం లో లేని కొన్ని డైలాగ్స్ కూడా తెలుగులో సృష్టించడం ఆసక్తి కరం. అయితే కేరళ తమిళనాడు బ్యాక్ డ్రాప్ ని తెలుగు రాష్ట్రాలకు మార్చే ప్రయత్నం చేసి తర్వాత మళ్లీ మానేసినట్లు అనిపించింది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇక ఆకాష్ జోసెఫ్ వర్గీస్ ఎడిటింగ్ బాగుంది. ఫహద్ ఫాజిల్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా : ప్రేమలు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి చూసి ఎంజాయ్ చేసే కంటెంట్ ఉన్న సినిమా.. హైదరాబాద్ లవర్స్ మీరు అస్సలు మిస్ కావద్దు.

Show comments