NTV Telugu Site icon

Varshangalkku Shesham Review: ప్రణవ్ మోహన్ లాల్ ‘వర్షంగల్కు శేషం’ రివ్యూ

Varshangalkku Shesham

Varshangalkku Shesham

Varshangalkku Shesham Movie Review: ఈ ఏడాది మలయాళ సినీ పరిశ్రమకు ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది రిలీజ్ అయిన దాదాపు చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలవడమే కాదు ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తి కనబరిచేలా ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే పలు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరగా ఇప్పుడు మరో సినిమా కూడా ఆసక్తికరంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సినిమా మరేమిటో కాదు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్, ప్రేమమ్ ఫ్రేమ్ నివిన్ పాలీ హీరోలుగా నటించిన వర్షంగల్కు శేషం. సుమారు రెండేళ్ల క్రితం మోహన్ లాల్ కుమారుడికి మొదటి హిట్ అందించిన వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో ఈ సినిమా కూడా తెరకెక్కడంతో సాధారణంగానే మలయాళ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. 

వర్షంగల్కు శేషం కథ : ఈ సినిమా కథ విషయానికి వస్తే మొత్తం అంతా 80-90 లలో జరిగే ఒక పీరియాడిక్ సినిమా. ఒక సూపర్ హిట్ డైరెక్టర్ వేణు(ధ్యాన్ శ్రీనివాసన్) తన స్నేహితుడు మురళి(ప్రణవ్ మోహన్ లాల్) కోసం ప్రయాణం మొదలుపెడతాడు. ఆ క్యాబ్ డ్రైవర్(వినీత్ శ్రీనివాసన్)కి తన కథ మొత్తం చెబుతూ ఉంటాడు. దాని ప్రకారం కేరళకి చెందిన వేణుకి చిన్నప్పటినుంచి నాటకాల మీద ఎక్కువ ఆసక్తి. తనను పట్టించుకోకపోయినా ఊరిలో జరిగే నాటక ఉత్సవాలలో యాక్టివ్ గా ఉంటాడు. ఒకరోజు అదే నాటకాల ద్వారా మురళి అనే ఒక సంగీత విద్వాంసుడుతో పరిచయమవుతుంది. మురళి టాలెంట్ చూసి మద్రాసు వెళితే బావుంటుందని వేణు సలహా ఇస్తాడు. అప్పటికి లైట్ తీసుకున్న సరే కొన్ని రోజుల తర్వాత వేణుని కూడా రమ్మని మురళి చెన్నై వెళతాడు. అక్కడికి వెళ్లి వేణు దర్శకత్వ శాఖలో పని చేస్తుండగా మురళి సంగీతంలో తన మార్క్ వేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మురళి చేసిన ప్రయత్నంతో వేణుకి దర్శకత్వం చేసే అవకాశం వస్తుంది. తన మొదటి సినిమాకి సంగీతం ఇవ్వమని అడిగితే మురళి ఇవ్వకుండా తన సంగీతం వేరే సంగీత దర్శకుడికి ఇచ్చి అతని చేత పాటలు రిలీజ్ చేయిస్తాడు. దర్శకుడైన తర్వాత వేణు తన రూమ్ నుంచి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఫీల్ అయిన మురళి తాగుడికి బానిసై సంగీతం మీద పట్టు కోల్పోతాడు. ఒకానొక సమయంలో వేణు, మురళి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. వేణు దర్శకుడిగా ఎదుగుతూ వెళితే మురళి మాత్రం ఏమైపోయాడో కూడా తెలియని పరిస్థితుల్లో మాయం అవుతాడు. అలా మనస్పర్ధలతో విడిపోయిన వీరిద్దరూ కలిసి ఒక సినిమా ఎలా చేశారు? ఆ సినిమా మధ్యలో ఆగిపోయిన క్రమంలో మురళి మళ్లీ ఎందుకు మిస్ అయ్యాడు? ఎవరికి వేణు, మురళీ కలిశారా? చివరికి ఏమైంది అనేది ఈ సినిమా కథ. 

విశ్లేషణ: గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా కధ ప్రారంభమవుతుంది. పల్లెటూరిలో స్నేహం, ప్రేమ కథతో మొదలయ్యే ఈ సినిమా మెల్లగా గేరు మార్చి మద్రాసులోని స్వామి లాడ్జికి చేరుతుంది. సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి స్నేహితులైన వేణు, మురళి కలిసి ఎక్కిన రైలు వారిని ఏ తీరాలకు చేర్చింది అనే కదాంశంతో సినిమాను తెరకెక్కించారు. వారిలో ఒకరు స్క్రీన్ రైటర్ మరియు డైరెక్టర్ కావాలని ప్రయత్నిస్తారు. మరొకరు సంగీత దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి ఎదుగుదల, బలహీనతలు, సంఘర్షణలతో ప్రథమార్ధం ముగుస్తుంది. వినీత్ సినిమా ఫస్ట్ హాఫ్ లోనే కావాల్సినంత కథ చెప్పేశాడు. ఇక సెకండాఫ్‌లో కథలోకి వచ్చేసరికి సినిమా మొత్తం మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. నివిన్ పౌలీ, బాసిల్ జోసెఫ్, నీరజ్ మాధవ్, అజు వర్గీస్‌లతో ఫుల్ గా ప్యాక్ చేయబడిన సెకండాఫ్ ప్రేక్షకులకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది. అయితే నిజానికి ఫస్టాఫ్ పూర్తి అయ్యే సరికే సినిమా ముగిసింది అనే ఫీలింగ్ వచ్చినా సెకండ్ హాఫ్ ను కూడా చాలా ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్. వినీత్ శ్రీనివాసన్ ఈ సినిమాలో లైట్ కామెడీ చేయిస్తూనే ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌కి కూడా స్పేస్ ఇచ్చాడు. 

నటీనటుల విషయానికి వస్తే  విభిన్న కాలాల కథనానికి న్యాయం చేసిన నటీనటుల పెర్ఫార్మెన్స్ లు ఉన్నాయి. ధ్యాన్ శ్రీనివాసన్-ప్రణవ్ కాంబినేషన్ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్. వీళ్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. వేర్వేరు వయసులలో వీరి నటన కూడా చాలా నేచురల్ అనిపించింది. అలాగే మేకోవర్ విషయంలో వీరు తీసుకున్న శ్రద్ధ కూడా ప్రస్తావించాల్సిన అంశం. ఇక సెకండాఫ్‌లో నివిన్ పౌలీ విధ్వంసం చేశాడు. ఇక ఈ సినిమా ద్వారా సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై స్పందించే అవకాశాన్ని నివిన్‌కి ఇచ్చాడు వినీత్. షాన్ రెహమాన్ – అజు వర్గీస్ నటన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విధంగా ఉన్నాయి. ఇక కళ్యాణి ప్రియదర్శన్ (అన్ని), నీతా పిళ్లై, నీరజ్ మాధవ్, బాసిల్ (ప్రదీప్), అర్జున్ లాల్, అశ్వత్ లాల్, కాలేష్ రామ్‌నాథ్ చిన్న చిన్న పాత్రల్లో వచ్చి తమ పాత్రలకు న్యాయం చేశారు. వినీత్ శ్రీనివాసన్ సినిమాలు ఎప్పుడూ పాటలతో రిచ్ గా ఉంటాయి. చివరగా వచ్చిన హృదయం సినిమా అయితే ఈ పాటల్లో రికార్డును కూడా నెలకొల్పింది. ఈ సినిమా సంగీత దర్శకుడు అమృత్ రామనాథన్ ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను నింపాడు.అమృత్ రామ్‌నాథ్ సంగీతం సినిమాకు ప్రాణం. అందమైన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను సినిమాలో మరింత ఇన్వాల్వ్ చేసేలా ఉన్నాయి. ప్రతి క్షణాన్ని అందంగా చిత్రీకరించిన సినిమాటోగ్రాఫర్ విశ్వజిత్ కి కూడా ఫుల్ మార్కులు పడాల్సిందే అని చెప్పాలి.. 

ఫైనల్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫ్యామిలీస్ తో కలిసి చూడదగ్గ ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్.

Show comments