NTV Telugu Site icon

Poacher Review: పోచర్ రివ్యూ

Poacher Series Review

Poacher Series Review

Poacher web-series Review:ఢిల్లీ క్రైమ్ లాంటి ఆసక్తికరమైన సిరీస్ తెరకెక్కించిన రిచి మెహతా దాదాపు ఐదేళ్ల తర్వాత పోచర్ అనే మరో సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ కి అలియా భట్ నిర్మాతగా వ్యవహరించడంతో అందరి దృష్టి ఈ సిరీస్ మీద పడింది మలయాళ భాష ప్రధానంగా తరకెక్కించిన ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సిరీస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.

పోచర్ కథ: కేరళలోని మలయత్తు అనే ప్రాంతానికి చెందిన అడవుల్లో జరిగిన కథగా దీన్ని చూపించారు. ఆ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కిందిస్థాయి ఉద్యోగి ఒకరు తాను ఏనుగుల వేటలో భాగస్వామ్యుడిని అయ్యాను అంటూ జిల్లా ఫారెస్ట్ అధికారి ముందుకు వెళ్లి వెళ్లిపోతాడు. దీంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం కదులుతుంది. ఇక మాలా జోగి (నిమిషా సజయన్) అనే ప్రతిభావంతులైన రేంజ్ ఆఫీసర్, తట్టెకాడ్ బర్డ్ శాంక్చురీలో పోస్ట్ చేయబడి ఉంటుంది. ఈ కేసు కోసం ఆమెను నీల్ (దిబ్యేందు భట్టాచార్య) పని చేయమని కోరతాడు. ఆమె అలాన్ (రోషన్ మాథ్యూ) అనే ప్రోగ్రామర్‌తో టీంగా ఫామ్ అయి వేటగాళ్లను ఎలాగైనా అరెస్టు చేయడమే వారి ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. కేరళలో మొదలైన వీరి వేట ఢిల్లీ వరకు వెళుతుంది. మరి ఈ వేటలో వాళ్ళు వేటగాళ్లను పట్టుకున్నారా? రాజ్ కోసం బయలుదేరిన టీంకి ఎలాంటి షాక్ తగిలింది? చివరికి ఏమైంది? లాంటి విషయాలు తెలియాలి అంటే సిరీస్ మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ : ఈ సిరీస్ మొదలు కావడమే ఒక వ్యక్తి ఫారెస్ట్ ఆఫీస్ కి వెళ్లి తాను ఏనుగుల వేటలో పాల్గొన్నానని చెబుతూ ఆ ఏనుగులు వేట చేసిన వారిని శిక్షించమని కోరడం ఆసక్తి కలిగిస్తుంది. 8 ఎపిసోడ్ లు కలిగిన ఈ సిరీస్ మొత్తం ఏనుగులను వేటాడిన వారిని, వేటాడిన తర్వాత వాటి దంతాలను ఎక్కడికి తరలించారు అనే విషయాలను ట్రేస్ చేయడంతోనే సరిపోతుంది. 8 ఎపిసోడ్ లు దాదాపు 45 నిమిషాల పాటు సాగే ఈ సిరీస్ మొత్తం కొంత మందికి సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ప్రకృతిని ప్రేమించే వారికి మాత్రం సిరీస్ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పక తప్పదు. ఒక పక్క కథ చెబుతూనే మరొక పక్క అంతర్లీనంగా జంతువులను చూపుతూ తెలియని మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది సిరీస్ టీం. సాధారణంగా మనం ఏదైనా జంతువుని రోడ్డు మీద చూస్తే అది రోడ్డు మీదకు వచ్చినట్టు ఫీల్ అవుతాం కానీ ఒకప్పుడు అవి బతికిన ప్రాంతానికే మనం అభివృద్ధి పేరుతో చొచ్చుకు వచ్చాం అని చాలామంది ఆలోచించరు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా ఎదిగిన ఒక వేటగాడి కూతురు తన తండ్రి వేటకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించి అడవిలో చనిపోయినట్లుగా భావిస్తున్న 18 ఏనుగుల చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అవుతుంది. దానికి జంతు ప్రేమికులందరూ సహకరించడంతో రాజ్ అనే ఒక ఏనుగుల వేటగాడిని వేటాడడంతో మొదలైన ఈ సిరీస్ చివరికి పూర్ణిమ వర్మ అనే ఒక ఆర్ట్ షాప్ నడుపుకునే మహిళ దగ్గర ఉన్న 500 కిలోల వరకు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకునే వరకు సాగుతుంది. సిరీస్ కావడంతో నిడివి విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు అది కొంచెం నిరాశ పరిచే అంశం. అయితే ఎక్కువ డీటెయిలింగ్ కోసం ఈ నిడివి ఎక్కువైనా పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. అయితే ఫారెస్ట్ ఆఫీసర్లు సాగిస్తున్న ఈ వేటని చూస్తే కనుక ఏమాత్రం సిబిఐ లేదా పోలీస్, క్రైమ్ డిపార్ట్మెంట్ అధికారులకు తక్కువ కాకుండా నడిపించిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే నిమిషా మాల అనే పాత్రలో సూట్ అయింది. అయితే ఆమెను గతంలో చూసిన విధంగానే ఆమెకు బాగా అచ్చొచ్చిన పాత్ర చేసినట్టుగానే అనిపించింది. రోషన్ మాధ్యు, డిబ్యేందు తమ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. కని కస్రుతి, చిన్న పాత్ర చేసినప్పటికీ గట్టి ప్రభావం చూపే పాత్రలో కనిపించింది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. చాలా బలమైన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది యూనిట్. ఇక సినిమాటోగ్రఫీ సిరీస్ కి పెద్ద అసెట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక నిర్మాణ విలువలు సినిమాకు ఏమాత్రం తక్కువ లేదని చెప్పాలి.

ఫైనల్ గా పోచర్ అనే సిరీస్ కాస్త సాగతీసిన ఫీలింగ్ కలిగించినా వన్ టైం వాచబుల్