NTV Telugu Site icon

Maya Petika Review: పాయల్‌ రాజ్‌పుత్ ”మాయాపేటిక” మూవీ రివ్యూ

Maya Pettika Movie Review

Maya Pettika Movie Review

Maya Petika Movie Review: ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకే ఇలాంటి సినిమాలు చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా కథతో తెరకెక్కింది మాయా పేటిక. విరాజ్‌ అశ్విన్, పాయల్‌ రాజ్‌పుత్, సిమ్రత్‌ కౌర్, రజత్‌ రాఘవ్‌, సునీల్, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలలో నటించిన సినిమానే ఈ ‘మాయా పేటిక’. రమేష్‌ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్‌ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా జూన్ 30న అంటే ఈరోజునే విడుదల అయింది. పోస్టర్లు, టీజర్, ట్రైలర్లతో అంచనాలు అందుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
మనిషి జీవితంలో అన్నిటికంటే అందరికంటే సెల్ ఫోన్ కు ముఖ్యం అయింది. ఈ క్రమంలోనే ఒక సెల్ ఫోన్ ను కాదాంశంగా తీసుకుని ఈ సినిమా డైరెక్ట్ చేశారు. చైనాలో తయారైన ఒక సెల్ ఫోన్ పాక్ ఉగ్రవాదులను అంతం చేయడానికి ఎలా పనికొచ్చింది అనేదే ఈ సినిమా కథ. సినీ నటి పాయల్ రాజ్ పుత్(పాయల్ రాజ్ పుత్)కు ఆమె నటిస్తున్న చిత్ర నిర్మాత ఓ సెల్ ఫోన్ ను గిఫ్ట్ గా ఇవ్వడం ఆమె ప్రియుడు ప్రణయ్(ర‌జ‌త్ రాఘ‌వ్)కు నచ్చదు. ఆ ఫోన్ కారణంగా వారిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమవవడంతో ఆమె తన ఫోన్ ను అసిస్టెంట్(నూకరాజు)కు గిఫ్ట్ గా ఇచ్చేసి దాన్ని వదిలించుకుంటుంది. అక్కడి నుంచి అది కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు(కమెడియన్ పృథ్వి) చేతికి చేరుతుంది, అతని నోటి దూల వల్ల జైలు పాలవడంతో కార్ వాష్ చేసే ఆలీ(విరాజ్ అశ్విన్) చేతికి చేరుతుంది. అతను అస్రాని(సిమ్రత్ కౌర్)తో ప్రేమలో పడేందుకు అలాగే వారి బ్రేకప్ కు కూడా కారణం అవుతుంది. అక్కడి నుంచి ఓ అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీ గార్డు నారాయణ(సునీల్) జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి అతను తన భార్య (శ్యామల)తో కలిసి పాటలకు డ్యాన్స్ చేస్తూ నెక్లెస్ గొలుసు నారాయణగా ఫేమస్ అవుతాడు, అతని వద్ద నుంచి బతుకు తెరువు కోసం హిజ్రా వేషం వేసుకు బతికే శీను (శ్రీనివాసరెడ్డి) వద్దకు ఈ ఫోన్ చేరి అతన్నీ మంచి మనిషిగా మారుస్తుంది. అలా ఒక ఎవరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:
ఈరోజు అందరికీ నిత్యావసర వస్తువులా మారిన సెల్ ఫోన్ వల్ల మంచి చెడు రెండూ ఉంటాయనే సందేశాన్ని దర్శకుడు అంతర్లీనంగా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రేమికుల మధ్య మనస్పర్థలకు ఎలా కారణం అవుతున్నది, ప్రేమికుల మధ్య ప్రేమ చిగురించేలా చేస్తున్నది, టాలెంట్ ఉన్న వారిని ఎక్కడికో తీసుకువెళుతుంది, అజాగ్రత్తగా ఉంటే ఫోన్లోనే ఎలా డబ్బులు పోగొట్టుకున్నది, మంచిగా ఎలా బతకాలి అనుకున్నది అన్నీ సెల్ ఫోనే కారణం అవుతుంది అనే విషయాన్నీ ఆసక్తికరంగా మలిచారు. మంచికి ఉపయోగిస్తే మంచిగా చెడుకు ఉపయోగిస్తే చెడుగా, ఎదిగేందుకు ఉపయోగిస్తే అలా ఉపయోగపడుతుందని కుండబద్దలు కొట్టి చెప్పాడు. ఒక రకంగా ఈ సినిమా అంతా మొబైల్ చుట్టూ తిరుగుతుంది. కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ దాన్ని తెరపై కన్విన్సింగ్ గా చూపించలేదు. అయితే ఒక ఆంథాలజీ సిరీస్ లా అనిపిస్తుంది, కొంచెం నిడివి పెంచి ఓటీటీకి రిలీజ్ చేసి ఉంటె బాగుండేది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ మినహా మిగతా ఎపిసోడ్స్ లో ఎమోషన్స్ మిస్ అయ్యాయి. లాజిక్స్ పక్కన పెట్టి ఒక సారి చూసేయచ్చు.

ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాలో పాయల్ హీరోయిన్ అనుకుంటాం కానీ ఆమె పాత్ర చిన్నదే. అయితే ఉన్నంతవరకు ఆకట్టుకుంది. విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, సునీల్, శ్యామల ఆకట్టుకున్నారు. అయితే సినిమా మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి నటన హైలెట్. ట్రాన్స్ జెండర్‌గాను నటించి మెప్పించారు. పృథ్వి అయితే నిజజీవితాన్ని పోలిన పాత్రతో నవ్వించాడు. ఇక సినిమా కథ బానే ఉన్నా.. తెరపై ఎందుకో ఆకట్టుకోలేదు. డైరెక్టర్ రమేష్ రాపర్తి అంథాలజీ ప్లాన్ చేశారో ఏమో కానీ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటె బాగుండేది. సురేశ్ రగుత్ కెమెరా వర్క్ ఆకట్టుకుంది. గుణ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ సోసోగా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. ప్రొడకషన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్
కామెడీ
ఎమోషనల్ సీన్స్
శ్రీనివాస్ రెడ్డి నటన
సునీల్, శ్యామల దుర్గారావును పోలిఉన్న ట్రాక్

మైనస్ పాయింట్లు
ఫస్ట్ హాఫ్
క్లైమాక్స్
నిడివి
స్క్రీన్ ప్లే

బాటమ్ లైన్: మాయా పేటిక, ఒక సెల్ ఫోన్ జర్నీ.. పెద్దగా మాయలు అయితే చేయలేదు.

Show comments