NTV Telugu Site icon

Parampara 2 Review : రివ్యూ: పరంపర -2 (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

Parampara Season2

Parampara Season2

Parampara Season 2 Review:

జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన వెబ్ సీరిస్ ‘పరంపర’. గత యేడాది డిసెంబర్ చివరి వారంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అది స్ట్రీమింగ్ కాగా.. ఈ శుక్రవారం నుండి సీజన్ 2 ప్రసారం అవుతోంది. ఈ పొలిటికల్ ఫ్యామిలీ క్రైమ్ డ్రామాను కృష్ణ విజయ్‌ ఎల్., విశ్వనాథ్‌ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు. ఆమని, ఆకాంక్ష సింగ్‌, నైనా గంగూలి, మురళీ మోహన్, కస్తూరి తదితరులు కీలక పాత్రలు పోషించడంతో సహజంగానే సీజన్ 1 అందరినీ ఆకట్టుకుంది. దానికి కొనసాగింపుగానే సీజన్ 2 సైతం ఉంది.

వీర్నాయుడు (మురళీమోహన్) కొడుకులు మోహన్ రావు (జగపతి బాబు), నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) మధ్య ఆధిపత్య పోరు సాగుతూ ఉంటుంది. తండ్రి మరణానంతరం పెంపుడు కొడుకైన మోహన్ రావు నుంచి కుటుంబ నిర్వహణతో పాటు వ్యాపార పగ్గాలనూ తన చేతిలోకి తెలివిగా తీసేసుకుంటాడు నాగేంద్ర నాయుడు. బాబాయ్ చేసే ఈ పనులు మోహన్ రావు కొడుకు గోపికి కంటగింపుగా మారతాయి. తాను ప్రేమించిన అత్త కూతురు రచన (ఆకాంక్ష సింగ్‌)నూ తన బాబాయ్ కొడుకు సురేశ్‌ (ఇషాన్) మాయమాటలతో పెళ్ళి చేసుకోవడాన్ని గోపి సహించలేకపోతాడు. ఆ పెళ్ళిని చెడగొట్టడానికి వెళ్ళిన గోపీని పోలీసులు అరెస్ట్ చేయడంతో తొలి సీజన్ ముగిసింది. తండ్రి కోల్పోయిన వైభవాన్ని తిరిగి కట్టబెట్టడానికి గోపీ పడే తపన, తన కొడుకును రాజకీయ నేతగా చూడాలని నాగేంద్ర చేసే ప్రయత్నాలతో ఈ రెండో సీజన్‌ సాగింది.

మొదటి సీజన్ లో పాత్రలు, వాటి మధ్య ఏర్పడిన ఇగో క్లాషెస్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకులు బాగానే టైమ్ తీసుకున్నారు. అయితే ఈ సీజన్ కు వచ్చే సరికీ అలాంటి అవసరం లేకపోయింది. మొదటి సీజన్ కథను ఐదారు నిమిషాల్లో రీక్యాప్ గా చూపించేసి, గోపీ జైలు కెళ్ళడం దగ్గర నుండి కథను మొదలెట్టారు. జైలు నుండి మాత్రమే కాదు… బాబాయ్ చెర నుండి కూడా బయటకు రావాలని గోపీ చేసే ప్రయత్నం ఆసక్తికరంగానే ఉంది. జైలులో పరిచయం అయిన రత్నాకర్ (రవివర్మ) సాయంతో మైనింగ్ కార్యకలాపాలలోకి ప్రవేశించిన గోపీ… తల్లి భానుమతి (ఆమని) పేరుతో ఓ ఎన్.జీ.వో.ను స్థాపించి, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు సాయం చేస్తుంటాడు. ఓ పథకం ప్రకారం అతను చేస్తున్న ఈ పనులకు నాగేంద్ర నాయుడు ఎలా చెక్ పెట్టాడు? తన కొడుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టి గోపీ ఎత్తులను ఎలా చిత్తు చేయాలని అనుకున్నాడు? కొడుకును, భార్యను దక్కించుకోవడానికి చివరకు మోహన్ రావు ఏం చేశాడు? అనేదే ఈ రెండో సీజన్.

మొదటి సీజన్ లో ఉన్న పాత్రలే ఇందులోనూ దాదాపుగా ఉన్నాయి. అయితే రవివర్మ, దివి, విక్రమ్ శివ, మయాంక్ పరాఖ్ వంటి పాత్రలు అదనంగా వచ్చి చేరాయి. ఫస్ట్ సీజన్ లో పోరు ప్రధానంగా శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఇషాన్ మధ్య సాగగా, ఇందులో జగపతిబాబు, ఆమని కూడా కథను మలుపుతిప్పే పాత్రధారులయ్యారు. మొదటి దాంట్లో కాలేజీ ఎన్నికలు కీ పాయింట్ కాగా, ఇందులో ఎమ్మెల్యే ఎలక్షన్లను తీసుకున్నారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పాత్రకూ ఇందులో ఇంకాస్తంత ప్రాధాన్యం పెరిగింది. కస్తూరి, ఆమెకు బాసటగా నిలిచే పొలిటీషియన్ కేదార్ శంకర్, ఎస్పీ తేజా కాకుమాను, నాయుడు కుటుంబ పెద్ద సూర్య.. వీళ్ళ పాత్రలు సైతం ఇందులో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

నైనా గంగూలి, దివి పాత్రలు కథలో భాగమే కానీ దాన్ని మలిచేవి కావు. ఆ మధ్య వచ్చిన ‘మా నీళ్ళ ట్యాంక్’లో కీలక పాత్ర పోషించిన దివి… వెంటనే ఈ వెబ్ సీరిస్ లో నటించడం విశేషమే. మొదటి సీజన్ ఏడు ఎపిసోడ్స్ కాగా… ఈ రెండో సీజన్ లో ఐదు మాత్రమే ఉన్నాయి. పైగా వీటి నిడివి తక్కువే ఉండటంతో కథ చకచకా సాగిపోయిన భావన కలుగుతుంది. ఊహించని మలుపులు పెద్దంతగా లేకపోయినా… ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకులు జాగ్రత్త పడ్డారు. కృష్ణ విజయ్, హరి యెల్లేటి రాసిన సంభాషణలూ బాగున్నాయి. నరేశ్‌ కుమరన్ సంగీతం కూడా అందుకు దోహదపడింది. మొదటి సీజన్ చూసిన వారికి ఈ రెండో సీజన్ అర్థమౌతుంది కానీ డైరెక్ట్ గా ఇదే చూస్తే మాత్రం పాత్రలు, వాటి స్వభావాలు అర్థం కావు. ‘పరంపర’ వెబ్ సీరిస్ ఇంతటితో ముగియలేదనేది క్లయిమాక్స్ షాట్ తో తెలుస్తోంది. మరి ఇప్పటికే మూడో సీజన్ షూటింగ్ కూడా మొదలు పెట్టేసి ఉంటే… అది కూడా ఈ యేడాది చివరిలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ మధ్య శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సీరిస్ తో పోల్చితే ఇది చాలా చాలా బెటర్!

 

ప్లస్ పాయింట్స్
ఫ్యామిలీ క్రైమ్ డ్రామా కావడం
పాపులర్ ఆర్టిస్టులు నటించడం
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్
ఫ్లాట్ గా సాగే కథనం
పెద్దగా పండని సెంటిమెంట్ సీన్స్
ఉత్సుకత రేపని ఎపిసోడ్స్ ముగింపు

ట్యాగ్ లైన్: కొనసాగుతూనే ఉంది!