NTV Telugu Site icon

Parakramam Review: పరాక్రమం సినిమా రివ్యూ

Bandi Saroj Kumar

Bandi Saroj Kumar

Parakramam Movie Review in Telugu:యూట్యూబ్ లో మాంగల్యం, నిర్బంధం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బండి సరోజ్ కుమార్. హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేస్తూ మ్యూజిక్ అందిస్తూ ఎడిటింగ్ కూడా తానే చేస్తూ అన్ని విభాగాల మీద పట్టు సంపాదిస్తూ చేసిన ఆ రెండు సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బోల్డ్ రా అండ్ రస్టిక్ సినిమాలుగా ఆ సినిమాలు నిలిచాయి.. ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేసిన తాజా చిత్రం పరాక్రమం. ఈ సినిమాలో ఆయనొక్కడే కాస్త తెలిసిన ఫేస్ కాగా మిగతా వాళ్ళందరూ కొత్తవాళ్లే. కల్ట్ ప్రొడ్యూసర్ గా తనకు తాను చెప్పుకునే ఎస్కేఎన్ ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో ప్రేక్షకులలో కాస్త ఆసక్తి ఏర్పడింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

పరాక్రమం కథ:
తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ అనే గ్రామంలో మంద బుద్ధి గల సత్తిబాబు(బండి సరోజ్ కుమార్) ఊర్లో నాటకాలు ఆడుతూ ఉంటాడు. యముడి వేషం వేసిన క్రమంలో ఆ ఊరి మునసబు ఇంకెప్పుడూ యముడి వేషం వేయకూడదు అని అతనికి వార్నింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో అనారోగ్యం పాలైన సత్తిబాబు తన కుమారుడు లోవరాజు(బండి సరోజ్ కుమార్)కి ఎప్పటికైనా పరాక్రమం అనే నాటకం వేయాలని కోరతాడు. అన్నింటికీ సిద్ధమైన తర్వాతే తానిచ్చిన పెట్టె ఓపెన్ చేసి ఆ నాటకం మొత్తం వేయాలని చెప్పి చనిపోతాడు. మరోపక్క లోవ రాజుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అందులోనూ పాక్ క్రికెటర్ అఫ్రిది అంటే ఇంకా ఇష్టం. ఆ ఊరిలో ప్రతి బెట్ మ్యాచ్ లోను తానే గెలుస్తూ ఉంటాడు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం పరాక్రమం నాటకాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శించేందుకు లోవరాజు హైదరాబాద్ వస్తాడు. అయితే హైదరాబాద్ రవీంద్రభారతిలో లోవరాజు నాటకాన్ని ప్రదర్శించాడా? దీని వెనుక ఉన్న బుజ్జమ్మ(శృతి సమన్వి) ఎవరు? అసలు సత్తిబాబు లోవరాజు చేత ఈ పరాక్రమ నాటకం ఎందుకు ఆడించాలి అనుకున్నాడు? చివరికి ఏమైంది? అనే విషయం తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
మామూలుగానే బండి సరోజ్ సినిమాలకు ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే మనోడు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా బుల్లెట్ దిగిందా? లేదా? అన్నట్టే చెబుతాడు. గతంలో ఆయన నుంచి వచ్చిన మాంగల్యం, నిర్బంధం సినిమాల విషయంలో జనం కనెక్ట్ అవడానికి కూడా అదే కారణం. ఆ సినిమాల్లో బూతులు ఉంటాయేమో కానీ బూతు సీన్స్ ఉండవు. అయితే ఈ సినిమా విషయానికి వచ్చే సరికి చెప్పాలనుకున్న పాయింట్ ను ఆ సూటిగా చెప్పే విషయంలోనే తడబడ్డాడు. ఒక బాలిక బలి, మరో ఆటిజం ఉన్న యువతి పట్ల సమాజం తీరు వంటి విషయాలను ప్రధానంగా చేసుకుని ఈ సినిమా చుట్టూ కథ అల్లుకున్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి ఒక కథ ప్రేక్షకులకు చెప్పాలనుకోవడం అభినందనీయం. కానీ అది పూర్తిస్థాయిలో వర్క్ అవుట్ అయిందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. ముందు కాస్త ఆశాజనకంగానే మొదలైనా లోవరాజుని పరిచయం దగ్గర నుంచి కథకి కమర్షియల్ హంగులు అద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఆసక్తికరం. లోవరాజు పాత్ర ఫస్ట్ ఆఫ్ అయ్యే సమయానికి సొంత మరదలి చేతిలోనే మోసపోవడం యూత్ కి కనెక్ట్ అయ్యే అంశం. ఇక పరాక్రమం సెకండ్ ఆఫ్ లో తండ్రి వేదన గురించి తెలుసుకుని పరాక్రమం ప్రదర్శించే తీరు, బుజ్జమ్మ కోసం నిలబడే తీరు సినిమాకి హైలైట్. నిజానికి కథగా కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేనప్పుడు స్క్రీన్ ప్లే విషయంలో అయినా కేర్ తీసుకోవాల్సింది. గతం-ప్రస్తుతం అంటూ అనేక సీన్లు రాసుకోవడంతో సరైన ఎమోషన్ పండలేదేమో అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ విషయంలో కూడా కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

ఇక నటీనటుల విషయానికి వస్తే బండి సరోజ్ కుమార్ ద్విపాత్రాభినయం ఇరగదీశాడు. సత్తిబాబు పాత్రలో సరిగా నప్పలేదు కానీ లోవరాజు క్యారెక్టర్ లో జీవించాడు. బయట సరోజ్ ను చూసినా ఇది ఇతని ఒరిజినల్ క్యారెక్టర్ లా ఉందే? అని అనుమానం కలగక మానదు. ఇక మందబుద్ధి గల యువతిగా శృతి సమన్వి ఆకట్టుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నిజంగా ఆమెకు ఏదో సమస్య ఉందేమో అన్నట్టు నటించింది. మిగతా పాత్రలలో నటించిన వారందరూ కొత్తవారే అయినా తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. టెక్నీకల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి బండి సరోజ్ కుమార్ హీరోగా మాత్రమే కాక దర్శకుడిగా, కథకుడిగా, ఎడిటర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో ఎడిటర్ & మ్యూజిక్ డైరెక్టర్ గా ఆకట్టుకున్నాడు. క్రికెట్ సీన్స్ లో వచ్చే ఆర్ఆర్, లోవరాజు క్యారెక్టర్ ఎలివేషన్స్ కి ఇచ్చిన బీజీయం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. డైరెక్టర్ గా కంటే నటుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు సరోజ్. అయితే ఆయన రాసుకున్న రైటింగ్ కొన్ని సమస్యల వలన ఇబ్బంది పడిన వారిని అలరిస్తాయి. అయితే కెమెరా క్వాలిటీ బాలేదు, అంటే వెండితెర కోసం ఈ సినిమా చేసినట్టు అనిపించలేదు. వెబ్ ఫిలింలా అనిపిస్తే అది మీ తప్పు కాదు.

ఫైనల్లీ ఈ పరాక్రమం సరోజ్ కుమార్ ఫాన్స్ కి తప్ప అందరికీ నచ్చకపోవచ్చు.