NTV Telugu Site icon

Committee Kurrollu Review: నిహారిక ‘కమిటీ కుర్రాళ్ళు’ రివ్యూ!

Kamiti Kurrollu Review

Kamiti Kurrollu Review

Committee Kurrollu Review: మెగా డాటర్ నిహారిక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేసి తర్వాత నిర్మాతగా మారింది. నిర్మాతగా మారిన తర్వాత పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ సినిమాలు చేసి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ఫీచర్ ఫిలిమ్ ద్వారా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. కమిటీ కుర్రాళ్ళు అనే ఒక సినిమా ద్వారా ఆమె ప్రేక్షకులు ముందుకు వస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు సినిమా టీజర్ ట్రైలర్ కట్స్ కూడా అదిరిపోవడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్లాయి. 11 మంది కొత్త హీరోలు, కొత్త దర్శకుడుని పరిచయం చేస్తున్నట్లు చెప్పడంతో అసలు సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
గోదావరి జిల్లాల్లోని ఓ కల్పిత గ్రామంలో పన్నెండేళ్లకు ఒకసారి జాతరకు ముందు ఊరంతా కలిసి ఒక పంచాయతీ పెట్టుకుంటారు. ఈసారి జాతర జరిగిన పది రోజులకు పంచాయితీ ఎన్నికలు కూడా వస్తుండడంతో ఆ ఎన్నికల్లో శివ (సందీప్ సరోజ్) సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి రెడీ అవుతాడు. అయితే 12 ఏళ్ల క్రితం జరిగిన జాతరలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకడు ప్రాణాలు కోల్పోతాడు. అందుకు కారణం స్నేహితుల మధ్య జరిగిన కులాల గొడవ కావడంతో జాతర పూర్తయ్యే వరకు వరకు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఊరి పెద్దలు పంచాయితీలో నిర్ణయిస్తారు. రిజర్వేషన్స్ అనే అంశంతో మొదలైన గొడవ అసలు కులాల గొడవగా ఎలా మారింది? 12 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు మళ్లీ కలిశారా? లేదా? అసలు ఈ గొడవలో ప్రెసిడెంట్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్) పాత్ర ఏమిటి? చివరికి ఊరికోసం స్నేహితులందరూ ఒకటయ్యారా? శివ సర్పంచ్ గా గెలిచాడా? చివరికి ఏమైంది అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

90స్ కిడ్స్ కనెక్ట్ అవుతారు:
కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు వాస్తవానికి పెద్దగా ఆసక్తి కలగలేదు కానీ సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఒకసారిగా సినిమాలో ఏదో సున్నితమైన అంశాన్ని టచ్ చేయబోతున్నట్లు అనిపించింది. అనుకున్నట్టుగానే సినిమాలో ఒక సన్నితమైన అంశాన్ని అత్యంత సున్నితంగా టచ్ చేస్తూ మనల్ని ఆలోచింపజేసే ప్రయత్నం చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమా మొదలైన తర్వాత ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా మనమే గోదావరి జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్లినట్టు అక్కడ జరుగుతున్న విషయాలను రచ్చబండ మీద లేక అక్కడి షాపుల అరుగు మీద కూర్చుని చూస్తున్న ఫీలింగ్ కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే చాలా వేగంగా సాగిపోతూ అనేక నాస్టాలజీ మూమెంట్స్ తో నవ్విస్తూ కథ నడిపాడు. నిజానికి ఈ సినిమా విషయంలో 90స్ కిడ్స్ సూపర్ గా కనెక్ట్ అవుతారు, పడీ పడీ నవ్వుకుంటారు కూడా. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవల్ లో రాసుకున్నాడు. ముందు నుంచి సినిమా యూనిట్ చెబుతూ వచ్చిన జాతర సీక్వెన్స్ కూడా అదిరిపోయింది. ఈ మధ్యకాలంలో అలాంటి జాతర సీక్వెన్స్ వచ్చిన సినిమాలు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇక సెకండాఫ్ చాలా వరకు ఎమోషనల్ సీన్స్ పై ఫోకస్ పెట్టాడు దర్శకుడు వంశీ. ఏదో యూత్ ఫుల్ సినిమా తీసాం చూడండి అనకుండా రిజర్వేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూ గురించి ఇందులో డిస్కస్ చేయడం దర్శకుడు తీసుకున్న సాహసోపేత నిర్ణయం. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ స్లో అయింది డ్రాగ్ చేస్తున్న ఫీలింగ్స్ కలిగినా బోర్ కొట్టకుండా బండి నడిపించేశాడు..అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు మాత్రం నేటి పొలిటికల్ లీడర్స్ కు సెటైర్స్ అని ఈజీగా అర్థం అయ్యేలా ఉంది. ఇక జనం కూడా లీడర్లు ఇచ్చే డబ్బు తీసుకోవడానికి అలవాటు పడ్డారు అని ఒకపక్క దెప్పిపొడుస్తూనే వాళ్ళు నిజాయితీపరులు అంటూ చెప్పడం ఒక ఆసక్తికరమైన పరిణామం.

నటీనట్ల విషయానికి వస్తే:
11 మంది హీరోలోని ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు అందులో ప్రసాద్ బెహరా ఒక్కడే తెలిసిన ముఖం. శివ పాత్రలో నటించిన సందీప్ సరోజ్ మొదలు బ్రిటిష్ విలియం సుబ్బు సూరి ఆత్రం అంటూ అనేక పాత్రలు మన స్నేహితుల లాగానే అనిపిస్తాయి. ఇక సాయికుమార్ గోపరాజు రమణ, రమణ భార్గవ, కంచరపాలెం కిషోర్, నెల్లూరు నీరజ, బలగం జయరాం వంటివాళ్లు ఆసక్తికరమైన నటన ప్రదర్శించారు. ముఖ్యంగా ప్రసాద్ బెహరా, కంచరపాలెం కిషోర్ ఇద్దరికీ మంచి పాత్రలు పడ్డాయి. కొత్త నటులంతా పోటీ పడి నటించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడక్కడ షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించే ఇద్దరమ్మాయిలు సహా మరి కొంతమంది ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు.. వాళ్ల పాత్రులకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకున్నారు.. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో 11 మంది హీరోలు తెరమీద ఆసక్తికరంగా సీమాని నడిపిస్తే తెరువెనుక ఈ సినిమాని నడిపించిన హీరో అనుదీప్ దేవ్.. సినిమా మొదలైనప్పటి నుంచి మనల్ని ఆ ఊరిలోకి నడిపించే విధంగా ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఉపయోగపడింది. కొన్ని పాటలు అయితే బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమాలో వాడిన కలర్ పేలెట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్ నీడివి మీద ఎడిటర్ కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో.. మొదటి థియేటర్ సినిమాకి ఇలాంటి కథను ఎంచుకోవడం నిహారిక చేసిన సాహసం ఆ సాహసంతోనే విజయాన్ని అందుకుందని చెప్పొచ్చు..

ఫైనల్‌గా:
కమిటీ కుర్రోళ్ళు.. మిమ్మల్ని చిన్నతనంలోకి తీసుకెళ్లి నవ్విస్తూ, ఏడిపిస్తూ చివరికి ఆలోచింపజేస్తూ బయటకు పంపిస్తారు.

Show comments