Maamla Legal Hai Webseries Review: నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మంచి కామెడీ సిరీస్ రిలీజ్ అయింది. ‘మామ్లా లీగల్ హై’పేరుతో బాలీవుడ్ బ్యాక్ డ్రాప్ లో ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ రూపొందించారు. తెలుగులో రేసుగుర్రం లాంటి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న రవి కిషన్ తో పాటు యశ్పాల్ శర్మ వంటి గొప్ప నటులతో ఈ సిరీస్ తెరకెక్కించారు. మరి ఈ నెట్‌ఫ్లిక్స్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ :
‘మామ్లా లీగల్ హై’ కథ ఢిల్లీలోని పట్పర్‌గంజ్ జిల్లా కోర్టుల VD త్యాగి(రవి కిషన్) వాదనతో సిరీస్ ప్రారంభమవుతుంది. VD త్యాగి ఒక తెలివైన న్యాయవాది, అతను చట్టంలోని లొసుగులను కనుగొనడంలో నైపుణ్యం కలిగి ఉండి తన పని చేసుకుపోతూ ఉంటాడు. వీడీ త్యాగి తెలివైన న్యాయవాది మాత్రమే కాదు పట్పర్‌గంజ్ న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడు కూడా. అలాంటి అతను జిల్లా కోర్టు బార్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కూడా మారాలనుకుంటాడు. మరోపక్క తాత, తల్లి పెద్ద న్యాయవాదులు అయినా సొంత కేసులు వాదించి నిలబడాలని అనన్య ష్రాఫ్(నైలా గ్రేవాల్) భవిస్తూ ఉంటుంది. అణగారిన ప్రజలకు న్యాయ సహాయం అందించాలని అనన్య హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వస్తుంది. కానీ పట్‌పర్‌గంజ్ కోర్టుకు వచ్చిన తర్వాత, ఆమెకి ఇండియన్ న్యాయ వ్యవస్థ అసలు రూపం తెలుస్తుంది. ఇక అలా అనన్య ఒక్క కేసును అయినా వాదించాలని తపన పడుతూ ఉంటుంది. మరి వీడీ త్యాగి బార్ అసోసియేషన్‌కు అధ్యక్షుడయ్యాడా? అనన్య ఒక్క కేసును అయినా వాదించిందా? లాంటి విషయాలు తెలియాలి అంటే 8 ఎపిసోడ్ల సిరీస్ సినిమా మొత్తం చూడాల్సిందే.
విశ్లేషణ: ‘మామ్లా లీగల్ హై’లో మీరు న్యాయస్థానంలో జరిగే విషయాలు చూడటమే కాకుండా, న్యాయవాదుల వ్యక్తిగత జీవితాల వాస్తవికతను కూడా చూడవచ్చు. ఈ సిరీస్ ఆద్యంతం ఫన్నీగా ఉంది, దాని 8 ఎపిసోడ్‌లను చూసిన తర్వాత మీరు పగలబడి నవ్వుతారు. అయితే సిరీస్ సాగతీసిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. అయితే ఈ ‘మాస్మా లీగల్’ వెబ్ సిరీస్ ఒక విధంగా నటుడు రవికిషన్‌కు పునర్జన్మ అని చెప్పొచ్చు. ఈమధ్యన ఆయనకు ఇంత నిడివి ఉన్న రోల్ దొరికి చాలా కాలం అయింది. ఢిల్లీ బార్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేయడానికి ఒక పోకిరీ లాయర్ సన్నాహాలు మొదలు పెట్టడంతో కథ మొదలవుతుంది. ఈ సిరీస్ మొత్తం ఈ ఎన్నికల సన్నాహాల మధ్య ప్రతి ఎపిసోడ్‌లో కొత్త కథనం కూడా తెర మీదకు తీసుకొచ్చారు. న్యాయవాదుల యొక్క ఆసక్తికరమైన, వినోదభరితమైన అలాగే కొన్నిసార్లు హృదయాన్ని హత్తుకునే దృష్టాంతాలను తెర మీదకు తీసుకొచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతి ఎపిసోడ్ చివరిలో కొన్ని వార్తాపత్రిక క్లిప్పింగ్‌లను చూపించారు. దాన్నిబట్టి ఈ సీరీస్‌లో ఏది చూపించినా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడో జరిగిందని టీం చెప్పదలచుకుంది. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో, వింత కేసుల సమాహారంగా కథను చూపించారు, ఇది చూస్తే ముఖంలో నవ్వు రావడం సహజం. సిరీస్ కథ చాలా ఫన్నీగా ఉంది. ‘మామ్లా లీగల్ హై’లో చాలా చమత్కారమైన వన్-లైనర్లు అలాగే జోక్‌లు ఉన్నాయి, ఇది క్లీన్ కామెడీ జానర్ సిరీస్, ఫ్యామిలీతో కలిసి చూడటానికి సరదాగా ఉంటుంది.
నటీనటుల విషయానికి వస్తే లాయర్ వీడీ త్యాగి పాత్రలో రవి కిషన్ అలరించాడు. అతని పాత్ర షోలో ఒక మంచి వాతావరణాన్ని మెయింటెయిన్ చేస్తుంది. ఆయన లాయర్ పాత్రకు బాగా సూట్ అయ్యాడు. ఇక నైలా గ్రేవాల్, యశ్‌పాల్ శర్మ, నిధి బిష్త్ మరియు అనంత్ జోషితో సహా మిగిలిన సహాయ నటులు కూడా ఈ సిరీస్ లో తమ పాత్రలకు నటనతో న్యాయం చేశారు. టెక్నీకల్ టీం విషయానికి వస్తే ఈ సిరీస్‌కు రాహుల్ పాండే దర్శకత్వం వహించారు. డైరెక్షన్ సింపుల్‌గా, కచ్చితత్వంతో ఉంది. బాలీవుడ్ సిరీస్ అంటేనే బూతు అన్నట్టు మారిన ఈ తరుణంలో రాహుల్ డబుల్ మీనింగ్ జోకులు, వల్గారిటీ లేకుండా ఈ సిరీస్‌ని డైరెక్ట్ చేసి విషయంలో సక్సెస్ అయ్యాడు. ఈ సిరీస్‌లో చాలా చికాకు కలిగించే విషయం ఏమిటంటే, అనవసరమైన కొన్ని కేసులు ఇరికించారు. ఆర్ట్ డైరెక్షన్ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే, దాని ప్రభావం మరింత మెరుగ్గా ఉండేది. సిరీస్ నేపథ్య సంగీతం బలహీనంగా ఉంది.
ఫైనల్ గా: మీరు ఈ వారాంతంలో ఏదైనా మంచిటైం పాస్ సిరీస్ చూడాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ‘మామా లీగల్ హై’ మీకు మంచి ఆప్షన్.