Nee Dhaarey Nee Katha Review: ఈ మధ్యకాలంలో కాన్సెప్ట్ నచ్చితే కొత్త వాళ్ళ సినిమానా లేక ఇండస్ట్రీలో పాతుకుపోయిన వాళ్ళ సినిమానా అని ఏమాత్రం చూడడం లేదు ప్రేక్షకులు. కచ్చితంగా దాన్ని ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వాళ్లు సైతం రిస్క్ చేసి సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలా వంశీ జొన్నలగడ్డ దర్శకత్వంలో నీ దారే నీ కథ అనే సినిమా తెరకెక్కింది. ట్రైలర్ తో ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడేలా చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
నీ దారే నీ కథ:
అర్జున్ (ప్రియతమ్) తన స్నేహితుడు రాహుల్, విజయ్ లతో కలిసి ఒక మ్యూజిక్ బ్యాండ్ నడుపుతుంటాడు. ఇండియన్ సింపని ఆర్కెస్ట్రా ఒక కాంపిటేషన్ పెట్టడంతో దానిలో గెలిస్తే ఇక లైఫ్ సెట్ అయిపోతుందనుకుంటారు. అర్జున్, విజయ్ బ్యాండ్ కోసమే టైం కేటాయించినా రాహుల్ మాత్రం ఒకపక్క సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ బ్యాండ్ కోసం సమయం కేటాయిస్తూ ఉంటాడు. అయితే ఫ్యామిలీ ప్రెజర్ వల్ల లండన్ వెళ్లాల్సి రావడంతో టీం నుంచి తప్పుకుంటాడు. అదే సమయంలో ఒక మ్యూజిక్ షాపు రన్ చేస్తూ మ్యూజిక్ స్కూల్ నడిపే శృతి (అంజన)తో వీరికి పరిచయం ఏర్పడుతుంది. ఆమెను కూడా తమ టీం లోకి తీసుకొని కాంపిటీషన్ కి సిద్ధమవుతున్న సమయంలోనే అర్జున్ కి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అయితే ఆ షాకింగ్ న్యూస్ ఏమిటి? ఆ షాకింగ్ న్యూస్ విన్న తర్వాత కూడా ఎలా పెర్ఫార్మ్ చేశాడు? చివరికి వాళ్లు ఆ కాంపిటీషన్ విన్ అయ్యారా? లేదా? ఇందులో అర్జున్ తండ్రి(సురేష్) పాత్ర ఏమిటి? లాంటి విషయాలన్నీ తెలియాలంటే సినిమా మొత్తం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
నీ దారే నీ కథ టైటిలే కాస్త భిన్నంగా అనిపిస్తుంది కదా. అయితే ఇందులో భిన్నమైన అంశం ఏమీ లేదు. గతంలో ఇదే లైన్లో చాలా సినిమాలు వచ్చాయి. కెరీర్లో తనకు నచ్చిన పనే చేసి అదే రంగంలో నిలబడాలనుకునే ఒక కుర్రాడిని సమాజమంతా ఏం చేస్తున్నావు? పెళ్లెప్పుడు? ఎంత శాలరీ? లాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆ కుర్రాడు తాను అనుకున్న పనిని ఎలా సాధించాడు అనే ప్రయాణమే ఈ సినిమా. ఈ సినిమాలో హీరోకి ఎప్పటికైనా ఒక మంచి మ్యుజీషియన్ గా పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. తండ్రి కోటీశ్వరుడు అయినా సరే బంధువుల నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలను మాత్రం తప్పించుకోలేని పరిస్థితులను తెరమీదకు ఆసక్తికరంగా తీసుకొచ్చే విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఈ సినిమా చూస్తున్న సమయంలో వెంకటేష్ వాసు సినిమా చూస్తున్న ఫీలింగ్ కూడా కలిగే అవకాశం ఉంది. కానీ అది పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా అయితే ఈ సినిమా మాత్రం కమర్షియల్స్ కి చోటు లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ని హానెస్ట్ గా చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డు పడే వరకు మ్యూజిక్ తోనే నడిపించే ప్రయత్నం చేశారు. ఎన్నో రకాల వాయిద్య పరికరాలతో ప్రయోగాలు కూడా చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా మ్యూజికల్ టచ్ ఉన్న వాళ్ళకి అలాగే జీవితంలో ఏదైనా ఒక విషయాన్ని సాధించాలనే పట్టుదలతో అదే రంగానికి పరిమితమైపోయి ఇబ్బంది పడుతున్న వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగానే గడిచిపోయినా సెకండ్ హాఫ్ లో మాత్రం ఎమోషన్స్ తో రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. అయితే క్లైమాక్స్ ఊహించే విధంగానే ఉన్న ఇంకా బలంగా ఉంటే ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేవి.
ఇక నటీనటుల విషయానికొస్తే అందరూ కొత్తవారే అయినా ఉన్నంతలో బాగా నటించారు. ముఖ్యంగా హీరో ప్రియతం మొదటి ప్రయత్నంలోనే పరవాలేదు అనిపించుకున్నాడు. అయితే హీరోయిన్ పాత్ర అంత బలమైనది కాదు. అయితే ఉన్నంతలో పర్వాలేదు. ఇక హీరో తండ్రిగా సురేష్ మరొకసారి తన మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ చూపించారు. ఇక పోసాని కృష్ణ మురళి ఒకే సీన్ లో కనిపించినా నవ్వించే ప్రయత్నం చేశారు. అజయ్ కూడా చాలా చిన్న పాత్ర. మిగతా వాళ్ళందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే పూర్తిస్థాయిలో కలర్ గ్రేడింగ్ మీద వర్క్ చేసినట్లు అనిపించలేదు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా కాస్త బెటర్ గా చేయొచ్చు. అయితే మ్యూజిక్ మాత్రం సినిమా తగ్గట్టు మూడ్ క్యారీ చేసే విషయంలో ఉపయోగపడింది. ఇక సింక్ సౌండ్ డబ్బింగ్ కొంతమంది ఆర్టిస్టులకు బాగానే అనిపించినా మరి కొంతమందికి మాత్రం ఎబెట్టుగా అనిపించింది. ఆ విషయంలో కేర్ తీసుకుంటే బాగుండేది. తక్కువ లొకేషన్స్ లో ఒక హానెస్ట్ అటెంప్ట్ చేసినట్టు అనిపించింది. దర్శకుడిగా వంశీకి ఇది మొదటి సినిమానే అయినా అలా అనిపించలేదు. ఇక కాస్ట్యూమ్స్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకున్నట్లయితే అనిపించింది.
ఫైనల్ గా ఈ సినిమా ఏదైనా రంగంలో పట్టుదలగా నిలబడి సాధించాలనుకునే వారికి ఒక ట్రిబ్యూట్ లాంటిది.