వకీల్ సాబ్ ఫేమ్ శివకుమార్ రామచంద్రవరపు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించిన ఈ సినిమా 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ కూడా వేసింది సినిమా యూనిట్. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
నరుడి బ్రతుకు నటన కథ:
కమల్ హాసన్ వీరాభిమానయిన సత్య(శివ కుమార్)కి నటన అంటే ప్రాణం. హీరో కావాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ సినిమాకి సంబంధించిన వాళ్లే కాదు సినిమాకు సంబంధం లేని వాళ్ళు కూడా నువ్వు నటనకి పనికి రావని తీసి పారేస్తారు. అయితే ఈ క్రమంలో అనుకోకుండా కేరళలో కొన్ని రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ సల్మాన్( నితిన్ ప్రసన్న)అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి క్లోజ్ అవుతాడు. అయితే ఆలు నటుడిగా సత్య రాణించలేకపోవడానికి కారణం ఏమిటి? సత్య కేరళ ఎందుకు వెళ్లాడు? కేరళలో సత్యకు ఎదురైన సమస్యలు ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో సత్యకు సల్మాన్ పరిచయమయ్యాడు? కేరళలో సత్యను హీరో అని ఎందుకు పిలిచారు? చివరకు సత్య నటుడు అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: దర్శకుడు రిషికేశ్వర్ రెడ్డి మొదటి సినిమాతోనే చాలా కష్టమైన కథ ఎంచుకున్నాడు. ఒకరకంగా కథను సింగిల్ లైన్‌గా చూస్తే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కథను సన్నివేశాలుగా తీర్చిదిద్దడంలో ఆయన పని తనం కనిపించింది. అయితే స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాల విషయంలో తడబాటు కనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఓ పాప సీన్, ప్రెగ్నెంట్ ఉమెన్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక సెకండాఫ్‌లో ఫన్‌తో పాటు ఎమోషనల్ సీన్లతో కథను నడిపించిన విధానం హైలెట్. కొన్ని సీన్స్ అయితే నవ్వించడమే కాకుండా చప్పట్లు కొట్టిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా నిజాయితీగా ఎమోషనల్ టచ్‌తో సినిమాను ముగించడం ఒక మంచి ఫీల్ కలిగిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు విలన్ టచ్ ఉన్న పాత్రలతో మెప్పించిన శివకుమార్ రామచంద్రవరపు తనకు లభించిన సత్య పాత్రను పూర్తిగా వాడుకున్నాడు. ఆ కార్యక్టర్‌లో ఇమిడిపోయాడు. ఇక డీ సల్మాన్ పాత్రలో మరోసారి నితిన్ ప్రసన్న తన రొటీన్ కి భిన్నంగా వినోదంతో పాటు ఎమోషన్స్ ను కూడా పండించాడు. శృతి జయన్ కార్యెక్టర్‌కు పూర్తిగా న్యాయం చేసింది. దయానంద్ రెడ్డి, వైవా రాఘవ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. దర్శకుడు రిషికేశ్వర్ యోగి రచయితగా, ఎడిటర్‌గా మంచి ప్రతిభ కనబరిచాడు. ఇక సినిమాటోగ్రాఫర్ కేరళ అందాలను అద్బుతంగా కెమెరాలో బంధించి మన ముందు ఉంచారు. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని మంచి పెయింటింగ్‌లా పచ్చదనంతో చూపడం హైలైట్. ఇక లోపెజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని చాలా సీన్స్ ను న్యాచురల్ గా చూపింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సీ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్స్, ఎస్ స్వ్కేర్ సినిమాస్ బ్యానర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ: ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లిన వారికి మంచి ఫీల్ అందించే సినిమా నరుడి బ్రతుకు నటన.