NTV Telugu Site icon

MAD Review: మ్యాడ్ రివ్యూ

Mad Review

Mad Review

MAD Movie Review: హారిక హాసిని క్రియేషన్స్ అనే బ్యానర్ స్థాపించి అనేక సినిమాలు నిర్మించారు సూర్యదేవర చినబాబు. ఆయన బాటలో ఆయన అన్నయ్య కుమారుడు నాగవంశీ కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఏర్పాటు చేసి అనేక సూపర్ హిట్ సినిమాలకు నిర్మాణం వహించారు. చినబాబు కుమార్తె హారిక నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తూ మాడ్ అనే ఒక సినిమా తెరకెక్కించారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కూడా ఒక హీరోగా నటించడంతో సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు టీజర్, ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ మరింత పెంచేయడంతో సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా చూసిన తర్వాత నవ్వకపోతే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని నాగా వంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడంతో ఈ సినిమా మీద ఆసక్తి అందరిలోనూ పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

మ్యాడ్ కథ ఏమిటంటే
బీటెక్ కాలేజ్ జాయిన్ అయిన ఒక రాడు కాలేజీ నచ్చక ఇంటికి పారిపోతాను అని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక సీనియర్ల గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేసి అతనికి ఒక కథ చెప్పడం ప్రారంభిస్తుంది. ఆ సీనియర్ల గ్యాంగ్ లీడర్ అయిన లడ్డు (విష్ణు) తాను మొదటి సంవత్సరం బిటెక్లో జాయిన్ అయినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరిస్తాడు. తాను కాలేజీలో ఉండడానికి కారణమైన దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్) మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్)ల కాలేజీ లైఫ్ గురించి చెబుతూ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు ఎలా గడిపారు అని చెబుతాడు. ఈ క్రమంలో దామోదర్ కు వెన్నెల నుంచి వచ్చిన ప్రేమ లేఖ గురించి, మనోజ్ శృతి లవ్ ట్రాక్, అశోక్ జెన్నీ లవ్ ట్రాక్ గురించి చెబుతాడు. ఈ ముగ్గురి పేరులో మొదటి అక్షరాలన్నీ కలిపి మ్యాడ్ పేరుతో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసిన పనుల గురించి చెబుతాడు. ఇక ఈ ముగ్గురు విజయవంతంగా నాలుగేళ్లలో ఇంజనీరింగ్ పూర్తి చేశారా? వీరి ప్రేమ కథలు సఫలమయ్యాయ? ఈ నాలుగేళ్లలో వీరి జీవితాల్లో వచ్చిన మార్పులు ఏమిటి? లాంటి విషయాలను చాలా లైటర్ వేలో పూర్తిస్థాయి కామెడీతో చెప్పిన కథ ఈ మాడ్.

విశ్లేషణ
మా చెల్లి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా చూస్తూ కాసేపు నవ్వకుండా ఉన్నా టికెట్ డబ్బులు వాపస్ ఇస్తా అని ఓ నిర్మాత కామెంట్ చేశాడంటే ఒకటి ప్రమోషనల్ స్ట్రాటజీ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కాన్ఫిడెన్స్ అని ఈజీగా అర్థమయింది. తెలుగులో కామెడీ సినిమాలకు కొదవలేదు. అందులోనూకాలేజ్ కామెడీ డ్రామాలు తెలుగులో చాలా వచ్చాయి. కానీ MAD అలాంటి కోవలోనే సాగుతూ రెండున్నర గంటల సమయంలో నవ్వి నవ్వి పొట్ట నొప్పి పుట్టేలా చేయడంలో సఫలం అయింది. అతడు సినిమాలో మహేష్ బాబు ఫైట్ గురించి చాలా పద్ధతిగా చేశాడు అంటూ తనికెళ్ల భరణి చెప్పినట్టుగా ఈ సినిమాలో కూడా చాలా పద్ధతిగా ఎక్కడ మొదలుపెట్టాలి ఎక్కడ ఆపాలో తెలిసిన దర్శకుడు పూర్తిస్థాయిలో తన పనితనాన్ని అందరి ముందు ఆవిష్కరించాడు. ఎన్టీఆర్ బావమరిది లాంచింగ్ ఫిలిం అంటే ఏదో యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నారు కానీ ఇది పూర్తిస్థాయి కామెడీ సినిమా. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా పంచుల వర్షం కురిపిస్తూ వచ్చిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ రొటీన్ స్టోరీకి రేసీ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఒక సీన్ చూసి నవ్వుకునే లోపు మరో అదిరిపోయే సీన్ వచ్చి, భలే ఉంది మామా అనిపించేలా చేసింది. సాధారణంగా ఈ మధ్య కాలంలో రెండున్నర గంటల సినిమా అనగానే నిడివి పెంచేందుకు ఏవేవో ప్రయోగాలు చేసి ఎందుకురా ఇంత సాగి తీశారు అనిపించేలా వచ్చిన సినిమాలన్నింటినీ మరిపించేలా ఈ సినిమా నిడివి కూడా ఉంది. జాతి రత్నాలు దర్శకుడి హ్యాండ్ కూడా ఉంది అని తెలియడంతో లాజిక్ లెస్ సీన్లు ఉంటాయేమో అనిపించింది కానీ ఎక్కడా అలాంటి సీన్లు లేవు. నిజంగా ఏదైనా ఒక కాలేజీలో లేదా హాస్టల్లో సీసీ కెమెరా పెట్టి అక్కడి దృశ్యాలే చూపించారేమో అనేంతలా ఈ సినిమా సాగుతుంది. పూర్తిస్థాయి రియలిస్టిక్ సీన్లతో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. తమ పిచ్చి పనులతో కడుపుబ్బా నవ్వించారు మ్యాడ్ టీమ్.

నటీనటుల విషయానికి వస్తే ముగ్గురు హీరోలు అదరగొట్టారు. సినిమాకి ముగ్గురు హీరోలోని ముందు నుంచి ప్రచారం జరిగింది, కానీ ఎందుకో సంగీత్ శోభన్ మెయిన్ హీరో అనిపిస్తాడు. అతని స్టైల్, డైలాగ్ డెలివరీ, కామిక్ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అతని తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నది లడ్డు పాత్రలో నటించిన విష్ణు. తెలంగాణలో ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన అమాయకుడైన కుర్రాడిగా విష్ణు ఆకట్టుకునేలా నటించాడు. ఎన్టీఆర్ బావమరిది నితిన్ కు కొన్ని సాంగ్స్ అలాగే ఫైట్లు కూడా పెట్టారు. ఉన్నంతలో హీరో ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నాడు నితిన్. పులిహోర రాజాగా రామ్ నితిన్ జీవించేశాడు. ఇక ముగ్గురు హీరోయిన్లు అనంతిక, గౌరీ ప్రియా, గోపిక తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. లడ్డు తండ్రి పాత్రలో నటించే ఉన్న మురళీధర్ గౌడ్, కాలేజీ ప్రిన్సిపల్ పాత్రలో రఘుబాబు కనిపించినంత సేపు నవ్వులు పండించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ని చాలా లైటర్ వేలో అందరూ కడుపుబ్బ నవ్వుకునేలా చూపించడంలో సఫలమయ్యాడు. ముఖ్యంగా డైలాగులు బాగా పేలాయి. అసలు ఏమాత్రం సీరియస్ నెస్ లేని కాలేజీ కుర్రాళ్ళతో పూర్తిస్థాయి కామెడీ సినిమా చేసి చూపించాడు దర్శకుడు. సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయింది. బీమ్స్ సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని ఎలివేట్ చేసింది. హారిక నిర్మాతగా మారిన మొదటి సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. నిడివి ఎక్కువే అయినా ఎక్కడ సాగదీసిన ఫీలింగ్ మాత్రం కలగలేదు.

ఫైనల్లీ:
ఈ మ్యాడ్ రెండున్నర గంటల నాన్ స్టాప్ ఫన్ రైడ్.. ఒక పర్ఫెక్ట్ వీకెండ్ యూత్ ఎంటర్టైనర్.. మీ స్నేహితులతో ముఖ్యంగా కాలేజ్ స్నేహితులతో చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ

Show comments