NTV Telugu Site icon

Narakasura Movie Review: పలాస హీరో కొత్త సినిమా ‘నరకాసుర’ రివ్యూ.. ఎలా ఉందంటే?

Narakasura Review

Narakasura Review

Narakasura Movie Review in Telugu: లండన్ బాబులు అనే సినిమాతో హీరోగా లాంచ్ అయినా ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు హీరో రక్షిత్ అట్లూరి. తరువాత కరుణ కుమార్ డైరెక్షన్లో చేసిన పలాస సినిమా మంచి హిట్ కావడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో వరుస సినిమాలు లైన్లో పెట్టిన రక్షిత్ నరకాసుర అనే సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ఈ సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటించగా అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం నాడు తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియాకి ఒకరోజు ముందుగానే ప్రదర్శించారు మేకర్స్. ఆ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

‘నరకాసుర’ కథేటంటే: చిత్తూరు జిల్లాకు చెందిన శివ(రక్షిత్‌ అట్లూరి) ఏపీ – తమిళనాడు సరిహద్దులో ఉండే ఓ కాఫీ ఎస్టెట్‌లో లారీ డ్రైవర్‌ గా పని చేస్తూ ఉంటాడు. ఆ ఎస్టేట్ ఓనర్, లోకల్ ఎమ్మెల్యే నాగమ నాయుడు(చరణ్‌ రాజ్‌)అంటే శివకి ప్రాణం. ఆయనకు అడ్డు వస్తే ఎవరైనా హత్య చేసేంతలా ఆయనకు నమ్మిన బంటులా ఉంటాడు. అలాంటి శివ ఉన్నట్టుండి మిస్ అవుతాడు. దీంతో శివ కోసం పోలీసులు వెతకడం ప్రారంభిస్తారు. అసలు శివ ఎలా మిస్ అయ్యాడు? శివ ఎక్కడ ఉన్నాడు? ఎమ్మెల్యే నాయుడు కొడుకు ఆది నాయుడు(తేజ చరణ్‌ రాజ్‌)తో శివకు ఎందుకు గొడవ మొదలైంది? శివను ప్రేమించిన మరదలు వీరమణి(సంకీర్తన విపిన్), తను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనాక్షి(అపర్ణ జనార్దన్‌) కోసం శివ ఏం చేశాడు. ఊరికి మంచి చేసే వ్యక్తిగా ఉన్న శివ కథకి ‘నరకాసుర’ అనే టైటిల్ కి సంబంధం ఏంటి? నరకాసుర వధ కథలో అర్ధ నారీశ్వరులు పోషించిన పాత్రేంటి? అనేది తెలియాలంటే నరకాసుర పెద్ద తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ: ‘నరకాసుర’ సినిమా కథ కొత్త కథ ఏమీ కాదు ఒక రొటీన్ రివెంజ్ స్టోరీ. ఊరికోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉండే శివ అనే ఒక యువకుడు తనకు దేవుడనుకున్న వ్యక్తి చేతిలోనే మోసానికి గురై అతని కొడుకుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి చివరికి అతన్ని ఎలా అంతమొందించాడు అనేదే ఈ సినిమా కథ. గతంలో ఇలాంటి కథనే మనం చాలా సినిమాల్లో చూశాం కానీ ఇక్కడ అర్ధ నారీశ్వరులతో కలిసి శివుడు చేసిన తాండవమే ఈ నరకాసుర సినిమా. సినిమా మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా నాన్ లీనియర్ ఎడిటింగ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఊరికోసం ప్రాణాలు ఇచ్చేందుకు అయినా తీసేందుకు అయినా వెనుకాడని శివ అనే ఒక వ్యక్తి మరదలిని చంపి భార్యను చెరబట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని హిజ్రాల సాయంతో అంతమొందించే ప్రాసెస్ బాగానే ఉన్నా శివ కథను రివీల్ చేసేందుకు ఇంకెన్నో కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేశారు. అనుకోకుండా హిజ్రాలను హీరో అవమానించడం, వారు అతనికి తమ స్థితిని తెలియచేస్తే వారికోసం అండగా నిలబడే సన్నివేశాలు. హీరో భార్య ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హిజ్రాలే కవచంగా నిలబడి ఎదుర్కొనే సన్నివేశాలు గూజ్ బంప్స్ తెప్పిస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే కనుక రక్షిత్ అట్లూరి శివ పాత్రలో ఒదిగిపోయాడు. శివగా రక్షిత్ నటన గత సినిమాల కంటే మెరుగైంది. అపర్ణ జనార్దన్ కేరళ కుట్టిగా జీవించేసింది. ఇక అమాయకపు మరదలిగా సంగీర్తన కూడా ఆకట్టుకుంది. నాజర్ నత్తి సూపర్వైజర్ గా సెట్ అయ్యాడు. ఎమ్మెల్యేగా చరణ్ రాజ్, ఆయన కుమారుడిగా తేజ్ చరణ్ రాజ్ కరెక్ట్ గా సెట్ అయ్యారు. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఇక టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడు సెబాస్టియన్ తాను చెప్పాలనుకున్న పాయింట్ నేరుగా చెప్పలేక కథనం విషయంలో తడబడ్డా ఓవర్ ఆల్ గా ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇక కొన్ని పాటలు చాలా బాగున్నాయి, విజువల్ గా ఆకట్టుకునేలా ఉన్నాయి. అందమైన లొకేషన్లను మరింత అందంగా కెమెరాతో చూపించారు. ఇక ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉండాల్సింది.

ఫైనల్లీ లాజిక్స్ పక్కన పెట్టి ఓవరాల్ గా అందమైన లొకేషన్లు, అదిరిపోయే ఫైట్లు, ఆకట్టుకునే పాటలు, ఒక మంచి మంచి సోషల్ మెసేజ్ కోసం ఒకసారి చూసేయచ్చు.

Show comments